English   

2019 బ్లాక్ బస్టర్ లిస్ట్.. హిట్స్ అండ్ సూపర్ హిట్స్..

2019 tollywood super hit movies
2019-12-30 17:46:03

ఎప్పటిలాగే 2019లో కూడా దాదాపు 180 సినిమాలు విడుదలయ్యాయి. అందులో కేవలం 10 శాతం మాత్రమే విజయాలు సాధించాయి. ఇంకా చెప్పాలంటే 2019లో కేవలం రెండు సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. మరి ఆ సినిమాలేంటి మిగిలిన సూపర్ హిట్లు హిట్స్ ఏంటి అనేది ఒకసారి లిస్ట్ చూద్దాం..

F2: వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫన్ ఎంటర్‌టైనర్ ఎఫ్2. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం 70 కోట్లకు పైగా వసూలు చేసి 2019 తొలి బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా దాదాపు 50 కోట్ల లాభాలు తీసుకొచ్చింది.

ఇస్మార్ట్ శంకర్: దేశముదురు తర్వాత ఆ స్థాయి బ్లాక్ బస్టర్ సినిమా కోసం 12 ఏళ్లుగా వేచి చూస్తూనే ఉన్నాడు పూరీ జగన్నాథ్. చివరికి ఆయన కోరిక 2019లో తీరింది. రామ్ హీరోగా ఈయన తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా 18 కోట్ల బిజినెస్ చేస్తే ఏకంగా 40 కోట్ల వసూళ్లు రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ అయిపోయింది.

ప్రతిరోజూ పండగే: ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ అయ్యాయి. మూడో సీట్ కోసం మ్యాగ్జిమమ్ ట్రై చేస్తుంది ప్రతిరోజూ పండగే. ఈ సినిమా ఇప్పటికే 22 కోట్ల షేర్ వసూలు చేసి సూపర్ హిట్ అయిపోయింది. 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం 30 కోట్ల క్లబ్బులో చేరితే బ్లాక్ బస్టర్ కిందే లెక్క.

మజిలీ: నిన్నుకోరి లాంటి ఎమోషనల్ ఎంటర్‌టైనర్ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా మజిలీ. సమంత, నాగ చైతన్య జంటగా వచ్చిన ఈ సినిమాకు కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో 25 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం దాదాపు 37 కోట్ల వరకు షేర్ వసూలు చేసి సూపర్ హిట్ అనిపించుకుంది.

ఓ బేబీ: సమంత అక్కినేని కీలక పాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ఓ బేబీ. కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం దాదాపు 13 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. 8 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం 5 కోట్ల లాభం తీసుకొచ్చింది.

మహర్షి: సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి కూడా 2019లో మంచి విజయం సాధించింది. అయితే ఈ చిత్రం సూపర్ హిట్ కాలేదు జస్ట్ హిట్ అనిపించిందంతే. 99 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం 102 కోట్లు షేర్ వసూలు చేసి బయటపడింది. మహేష్ కెరీర్లో తొలి 100 కోట్ల షేర్ సాధించిన సినిమా ఇదే. వంశీ పైడిపల్లి దీనికి దర్శకుడు.

గద్దలకొండ గణేష్: సంక్రాంతికి ఎఫ్2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్ తేజ్.. గద్దలకొండ గణేష్‌ సినిమాతో మాత్రం హిట్ దగ్గరే ఆగిపోయాడు. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం 25 కోట్ల షేర్ వసూలు చేసింది. విడుదలైన రెండో వారంలో భారీ వర్షాలు రావడంతో గద్దలకొండ గణేష్ సినిమాకు దెబ్బ పడింది.

118: కళ్యాణ్ రామ్ కూడా ఈ ఏడాది హిట్ కొట్టాడు. ఈయన నటించిన 118 సినిమా మంచి విజయం అందుకుంది. 10 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం 11 కోట్లు వసూలు చేసింది.

ఎవరు: రెండేళ్లుగా వరస విజయాలతో జోరు మీదున్న అడవి శేష్.. ఈ ఏడాది ఎవరు సినిమాతో హిట్ అందుకున్నాడు. రాంజీ వెంకట్ తెరకెక్కించిన ఈ చిత్రం 11 కోట్ల వరకు షేర్ వసూలు చేసి హిట్ అనిపించుకుంది. రెజీనా ఇందులో ప్రతినాయక పాత్రలో నటించింది.

అర్జున్ సురవరం: కిరాక్ పార్టీ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న నిఖిల్.. ఈ ఏడాది ‘అర్జున్ సురవరం’తో వచ్చాడు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం చాలా తక్కువ అంచనాలతో వచ్చింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ చిత్రం 6 కోట్లకు అమ్మితే 9.50 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాంలో అయితే ఏకంగా 3.60 కోట్ల షేర్ తీసుకొచ్చింది.

బ్రోచేవారెవరురా: మెంటల్ మదిలో సినిమాతో రెండేళ్ల కింద మాయ చేసిన కుర్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ ఏడాది బ్రోచేవారెవరురా సినిమాతో వచ్చాడు. సత్యదేవ్, శ్రీవిష్ణు, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం దాదాపు 6 కోట్ల షేర్ వసూలు చేసి హిట్ అనిపించుకుంది.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ: నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అతడి స్నేహితుడు స్వరూప్ ఆర్ఎస్జే ఈ సినిమాను తెరకెక్కించాడు. నవీన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. దాదాపు 8 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.

జెర్సీ: నాని కూడా రెండు ఫ్లాపుల తర్వాత 2019లో విజయం అందుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ తర్వాత ఈ ఏడాది నటించిన జెర్సీ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు విజయం కూడా అందుకున్నాడు. అయితే అద్భుతమైన టాక్ వచ్చినా కూడా ఎందుకో కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గిపోయాడు నాని.

చిత్రలహరి: సాయి ధరమ్ తేజ్ తన పేరు మార్చుకుని హిట్ కొట్టాడు. సుప్రీమ్ తర్వాత అరడజన్ ఫ్లాపులు ఇచ్చిన ఈ హీరో.. ధరమ్ పీకేసి సాయి తేజ్ అంటూ వచ్చి చిత్రలహరి సినిమాతో విజయం అందుకున్నాడు. అయితే ఆయన కోరుకున్నట్లుగా సూపర్ హిట్ అయితే రాలేదు కానీ 14 కోట్ల బిజినెస్ చేసిన చిత్రలహరి 15 కోట్లు వసూలు చేసింది.

సైరా: చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి 2019లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. దాదాపు 142 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. అయితే చేసిన బిజినెస్ మరీ ఎక్కువ కావడంతో మిగిలిన భాషల్లో ఫ్లాప్.. తెలుగులో యావరేజ్ రిజల్ట్‌తోనే సరిపెట్టుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

వెంకీ మామ: వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా బాబీ తెరకెక్కించిన వెంకీ మామ కూడా యావరేజ్ రిజల్ట్‌తోనే సరిపెట్టుకున్నాడు. ఈ సినిమా కూడా చేసిన బిజినెస్‌కు కాస్త అటూఇటూగా వసూలు చేసింది. దాంతో ఎఫ్2 తర్వాత వెంకటేష్.. మజిలీ తర్వాత నాగ చైతన్య 2019లో మరో హిట్ అందుకున్నారు.

రాక్షసుడు: రాక్షసుడు సినిమాతో వరస ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్ల తర్వాత కనీసం ఓ యావరేజ్ అందుకున్నాడు ఈయన. 12 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన రాక్షసుడు సినిమా చివరికి 12 కోట్ల దగ్గరే ఆగింది. అద్భుతమైన టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల రూపంలో మాత్రం అది కనిపించలేదు.

విజిల్: ఈ మధ్య తెలుగులో కూడా వరస విజయాలు అందుకుంటున్న విజయ్.. 2019లో కూడా మంచి సినిమాతోనే వచ్చాడు. ఈయన నటించిన విజిల్ తెలుగులో కూడా 12 కోట్ల వరకు వసూలు చేసి హిట్ అనిపించుకుంది. గతేడాది సర్కార్ సినిమాతో విజయం అందుకున్న విజయ్.. ఈ సారి విజిల్ వేయించాడు.

ఖైదీ: కార్తి ‘ఖైదీ’ సినిమా ఈ ఏడాది డబ్బింగ్ సినిమాల్లో అతి పెద్ద విజయంగా నిలిచింది. దివాళికి పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఖైదీపై ప్రశంసల జల్లు కురిసింది. దాదాపు 8 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.

కాంచన 3: ముని సిరీస్‌లో వచ్చిన మరో సినిమా ‘కాంచన 3’. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి లాభాలనే తీసుకొచ్చింది. తెలుగులో కూడా పర్లేదనిపించింది కాంచన 3. 

More Related Stories