English   

సమ్మర్ 2020 హౌజ్ ఫుల్.. లైన్‌లో ఉన్న 15 సినిమాలు..

Tollywood Summer Fight
2020-01-29 15:34:01

సమ్మర్ వచ్చిందంటే పండగ చేసుకుంటారు నిర్మాతలు. సంక్రాంతి తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినిమాకు బాగా కలిసొచ్చే సీజన్ వేసవి కాలమే. ఎందుకంటే భారీగా సెలవులు ఉంటాయి కాబట్టి. అందుకే సంక్రాంతికి రావాలనుకుని ఆగిపోయిన సినిమాలతో పాటు ప్రత్యేకంగా సమ్మర్ కోసమే కొన్ని సినిమాలు అలా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. 2020 సమ్మర్‌లో చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో పవన్ కల్యాణ్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో పాటు నాని, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్ లాంటి కుర్ర హీరోలు కూడా ఉన్నారు. మరి ఈ సమ్మర్‌ను టార్గెట్ చేసిన ఆ హీరోలెవరో చూద్దాం.. ముఖ్యంగా మార్చ్ నుంచే సమ్మర్ సినిమాల సందడి మొదలు కానుంది.

1. మిస్ ఇండియా: మహానటి లాంటి సినిమా తర్వాత కీర్తి సురేష్ మళ్లీ తెలుగులో కనిపించలేదు. మన్మథుడు 2లో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు మిస్ ఇండియా అంటూ పూర్తిస్థాయి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది కీర్తి. ఈ చిత్రం మార్చ్ 6న విడుదల కానుంది. నరేంద్ర నాథ్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మహేష్ కోనేరు నిర్మాత.

2. వి: ఈ సమ్మర్‌లో రాబోతున్న తొలి క్రేజీ సినిమా వి. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని విలన్. అంతేకాదు ఇది ఆయనకు 25వ సినిమా కూడా. పూర్తిస్థాయి ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు నాని. సుధీర్ బాబు ఇందులో హీరో. మార్చ్ 25న విడుదల కానుంది ఈ చిత్రం. దిల్ రాజు నిర్మాత.

3. శ్రీకారం: శర్వానంద్ హీరోగా కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఎప్రిల్ 2న విడుదల కానుంది ఈ చిత్రం. ఇందులో రైతుగా నటిస్తున్నాడు శర్వా.

4. ఉప్పెన: వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎప్రిల్ 2న విడుదల కానుంది ఈ చిత్రం.

5. రెడ్: ఇస్మార్ట్ శంకర్ లాంటి సంచలన విజయం తర్వాత రామ్ నటిస్తున్న సినిమా రెడ్. తమిళనాట విజయం సాధించిన తడమ్ సినిమాకు రీమేక్ ఇది. కిషోర్ తిరుమల తొలిసారి మాస్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఎప్రిల్ 9న ఈ సినిమా రానుంది.  

6. మాస్టర్: విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా మాస్టర్. ఈ చిత్రం ఎప్రిల్ 10న విడుదల కానుంది. తెలుగు, తమిళంలో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

7. లవ్ స్టోరీ: ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమా లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఎప్రిల్ 17న విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

8. సోలో బ్రతుకే సో బెటరూ: సాయి ధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటరూ. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే లాంటి విజయాలతో దూకుడు మీదున్న సాయి.. ఈ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఎప్రిల్ 24న ఈ సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

9. నారప్ప: అసురన్ సినిమాకు రీమేక్‌గా వెంకటేష్ నటిస్తున్న సినిమా నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మే 1న విడుదల కానుంది.

10. క్రాక్: రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా క్రాక్. తమిళ సినిమా సేతుపతి ఫ్రీమేక్‌గా ఈ చిత్రం వస్తుందని తెలుస్తుంది. మే 8న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

11. పింక్ రీమేక్: పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా పింక్ రీమేక్. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుంది. కేవలం 25 రోజుల్లోనే పవన్ పార్ట్ పూర్తి చేయనున్నారు దర్శక నిర్మాతలు. మే 15న పింక్ రీమేక్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇదే.

12. వైల్డ్ డాగ్: నాగార్జున అక్కినేని హీరోగా కొత్త దర్శకుడు సోల్మోన్ తెరకెక్కిస్తున్న సినిమా వైల్డ్ డాగ్. ఈ చిత్రంలో NIA అధికారిగా ఇందులో నటిస్తున్నాడు నాగ్. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. ఈ సినిమాను మే 22న విడుదల చేయబోతున్నారు.

13. విరాటపర్వం: రానా, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా విరాటపర్వం. వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమాను మే లోనే విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

14. రంగ్ దే: నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమా రంగ్ దే. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే వేగంగా జరుగుతుంది. మేలోనే సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్.

15. అఖిల్ 4: హ్యాట్రిక్ ఫ్లాపులతో డీలా పడిన అఖిల్.. తన నాలుగో సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా సమ్మర్‌లోనే విడుదల కానుంది. మే లోనే సినిమా విడుదల కానుంది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్.

16. సీటీమార్: యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా సీటీమార్. మేలోనే సినిమా విడుదల కానుంది. ఈ సమ్మర్ చివరి సినిమా ఇదే కావచ్చు.

More Related Stories