బంగార్రాజుకు మూడ్ వచ్చేసింది... 2020లోనే విడుదల...

నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సోగ్గాడే చిన్నినాయనా. ఈ చిత్రం 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నాగార్జున రేంజ్ ఏంటో చూపించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని చాలా రోజులుగా చెబుతూనే ఉన్నాడు ఈ హీరో. ఇప్పటికి ఇది కుదిరిందని తెలుస్తుంది. కళ్యాణ్ కృష్ణ కురసాల సోగ్గాడే చిన్నినాయనా రేంజ్ నిలబడేలా ఓ సీక్వెల్ కథ సిద్ధం చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. బంగార్రాజు టైటిల్ తో ఈ చిత్రం వస్తుంది.
ఇప్పటికే ఈ చిత్రం గురించి చాలాసార్లు చెప్పాడు నాగార్జున. అయితే సరైన కథ దొరికినపుడు మాత్రమే సీక్వెల్ చేస్తానని చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ సమయం వచ్చేసింది. కళ్యాణ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సీక్వెల్ ముహూర్తం ఫిక్స్ చేసాడు నాగార్జున. అన్నీ కుదిర్తే మార్చ్ మూడో వారం నుంచి బంగార్రాజు పట్టాలెక్కనుంది. ఇందులో మరోసారి రమ్యకృష్ణతోనే జోడీ కట్టబోతున్నాడు నాగ్. ఆమెకు తోడు అనుష్క కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఇద్దరూ తనకు కలిసొచ్చిన హీరోయిన్లే కాబట్టి నాగార్జున కూడా పండగ చేసుకోవడం ఖాయం. ఈ కాంబినేషన్ తెరపై చూడ్డానికి అభిమానులు కూడా వేచి చూస్తున్నారు.
కళ్యాణ్ కృష్ణ కథకు సత్యానంద్ లాంటి సీనియర్ రైటర్లు కూడా స్క్రీన్ ప్లే సాయం చేసారు. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. ఈయన పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుంది. మొత్తానికి సోగ్గాడే ఎంత పెద్ద విజయం సాధించిందో.. అంతకంటే పెద్ద విజయం ఇప్పుడు బంగార్రాజు అవుతుందని చెబుతున్నాడు నాగ్. మరి ఈయన నమ్మకాన్ని కళ్యాణ్ ఎంతవరకు నిలబెడతాడో చూడాలిక. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయన.