English   

2020 ఫస్టాఫ్ రివ్యూ.. కరోనా కాటుకు ఇండస్ట్రీ బలి.. 

 Tollywood 2020 First Half Review
2020-07-02 14:27:47

చూస్తుండగానే 2020 మొదలై ఆర్నెళ్లు గడిచిపోయాయి. ఏ క్షణంలో ఈ ఏడాది మొదలైందో కానీ అందరికీ చుక్కలు చూపిస్తుంది. ఒక్క సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. అన్నీ 2020లో నష్టాలే చూసాయి. మాయదారి కరోనా వైరస్ వచ్చి అందరి కలలను కల్లలు చేసింది. ముఖ్యంగా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మూడు నెలలకు పైగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కొత్తగా ఓటిటి విడుదలకు డిమాండ్ కూడా పెరిగిపోయింది. మొత్తంగా కేవలం 50 సినిమాల లోపే విడుదలయ్యాయి ఈ ఆర్నెళ్లలో. మరి ఈ రివ్యూ ఎలా ఉందంటే..

విజయాలు:

1. అల వైకుంఠపురములో: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం 150 కోట్లకు పైగా వసూలు చేసి 2020కి అద్భుతమైన ఆరంభం ఇచ్చింది.

2. సరిలేరు నీకెవ్వరు: భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో జోరు మీదున్న మహేష్ బాబు.. 2020 ఆరంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

3. భీష్మ: సంక్రాంతి సినిమాలు ఇచ్చిన ఆరంభం చూసి ఏడాది అదిరిపోతుందేమో అనుకున్నారు.. కానీ ఆ తర్వాత విజయాలు రాలేదు. ఫిబ్రవరిలో భీష్మ సినిమాతో నితిన్ వచ్చి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించాడు ఇండస్ట్రీని. ఈ చిత్రం 30 కోట్ల వరకు వసూలు చేసింది. కానీ అప్పటికే కరోనా ఎంట్రీ ఇచ్చేసింది.

4. హిట్: పేరుకు తగ్గట్లే హిట్ కొట్టిన సినిమా హిట్. విశ్వక్ సేన్ హీరోగా కొత్త దర్శకుడు శేలేష్ కొలను తెరకెక్కించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను నాని నిర్మించాడు. సినిమా మంచి వసూళ్లనే సాధించింది.
 
అపజయాలు:


1. డిస్కో రాజా: రవితేజ జాతకం ఈ ఏడాది కూడా మారలేదు. విఐ ఆనంద్ తెరకెక్కించిన డిస్కో రాజా దారుణంగా డిజాస్టర్ అయింది. కనీసం 10 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు ఈ చిత్రం.

2. ఎంత మంచివాడవురా: సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలతో పోటీ పడుతూ తన సినిమా ఎంత మంచివాడవురా విడుదల చేసాడు కళ్యాణ్ రామ్. సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది.

3. దర్బార్: రజినీకాంత్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ అంచనాలు అందుకోవడంలో దారుణంగా విఫలమైంది.

4. జాను: సమంత, శర్వానంద్ జంటగా తమిళనాట చరిత్ర సృష్టించిన 96 సినిమాకు రీమేక్‌గా వచ్చిన జాను కూడా డిజాస్టర్ అయిపోయింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు.

5. వరల్డ్ ఫేమస్ లవర్: విజయ్ దేవరకొండ కష్టాలు 2020లో కూడా కంటిన్యూ అయ్యాయి. గతేడాది డియర్ కామ్రేడ్ సినిమాతో డిజాస్టర్ ఇచ్చిన ఈయన.. ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్‌తో కంటిన్యూ చేసాడు. ఈ సినిమా కనీసం 10 కోట్లు వసూలు చేయలేకపోయింది.

ఓటిటి రిలీజ్:

1. అమృతరామమ్: 2020లో కొత్తగా మొదలైన ట్రెండ్ ఓటిటి విడుదల. థియేటర్స్ మూసేయడంతో తెలుగులో తొలి ఓటిటి విడుదలగా వచ్చిన అమృతరామమ్ నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

2. పెంగ్విన్: కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కార్తిక్ సుబ్బరాజ్ నిర్మించిన పెంగ్విన్ సినిమా కూడా ఓటిటిలో అంతగా ఆకట్టుకోలేదు.

3. క్లైమాక్స్, నేక్డ్: రామ్ గోపాల్ వర్మ నుంచి ఈ ఏడాది రెండు ఆణిముత్యాలు వచ్చాయి. ఓటిటిలో 100, 200 అంటూ టికెట్ పెట్టి మరీ క్లైమాక్స్, నేక్డ్ సినిమాలు విడుదల చేసి కొత్త ట్రెండ్‌కు తెరతీసాడు వర్మ. 

4. కృష్ణ అండ్ హిస్ లీల: 2020లో థియేటర్స్‌ను బాగా మిస్ అయిన సినిమా కృష్ణ అండ్ హిస్ లీల. సురేష్ బాబు సమర్పకుడిగా వచ్చిన ఈ చిత్రం ఓటిటిలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి అప్లాజ్ అందుకుంటుంది. మొత్తంగా 2020 తొలి ఆర్నెళ్లు ఇండస్ట్రీకి గడ్డుకాలమే. 

More Related Stories