21 ఏళ్ల రాజకుమారుడు.. మహేష్ బాబు రెండు దశాబ్దాల ప్రయాణం..

చూడ్డానికి పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తాడు. కానీ 12 ఏళ్ల కుమారుడికి తండ్రి ఆయన. 45 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ కుర్ర హీరోలకు కూడా అర్థం కాని అందంతో కుళ్లు తెప్పిస్తుంటాడు. అతడే మహేశ్ బాబు. ఈయన ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఈ హీరో ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు గడిచిపోయింది. అది 1999.. జులై 30.. ఆ రోజే మహేశ్ రాజకుమారుడు విడుదలైంది. కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి దూసుకొచ్చాడు మహేశ్. అశ్వినీదత్ నిర్మాతగా రాఘవేంద్రరావ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. అప్పట్లో ఈ చిత్రం ఓ సంచలనం. రాజకుమారుడుతోనే ప్రిన్స్ అనే ముద్ర కూడా వేయించుకున్నాడు. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. మణిశర్మ అందించిన పాటలు అప్పట్లో సంచలన విజయం సాధించాయి. ముఖ్యంగా గోదారి గట్టు పైన.. చిన్నారి చిలుక ఉంది పాట, రామసక్కనోడమ్మ చందమామ, ఇందురుడో చందురుడో మామ పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
సూపర్ స్టార్ కృష్ణ గెస్ట్ అప్పియరెన్స్.. ప్రకాష్ రాజ్ స్పెషల్ పర్ఫార్మెన్స్.. బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా అందాలు.. మహేష్ బాబు అభినయం అన్ని కలిసి రాజకుమారుడిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేశాయి. ఆ తర్వాత యువరాజు.. మురారి.. ఒక్కడు.. అతడు.. పోకిరి.. దూకుడు.. సీతమ్మ వాకిట్లో.. బిజినెస్ మ్యాన్.. శ్రీమంతుడు.. భరత్ అనే నేను.. సరిలేరు నీకెవ్వరు మహర్షి.. లాంటి సినిమాలతో మహేశ్ ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్. దాంతో పాటు మరో రో సినిమాకు కమిటయ్యాడు. మొత్తానికి 21 ఏళ్ల జర్నీలో ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోకుండా మిస్టర్ క్లీన్ అనిపించుకున్నాడు మహేశ్ బాబు. ఈ ప్రయాణంలో 7 నందులు.. 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు మహేశ్. సూపర్ స్టార్ ప్రయాణం ఇలాగే కొనసాగాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.