English   

పవన్ కల్యాణ్ టాలీవుడ్ ప్రయాణానికి 23 ఏళ్లు పూర్తి.. 

Pawan Kalyan
2019-10-11 15:32:21

అది 1996.. అక్టోబర్ 11.. అప్పుడే ఓ కుర్రాడు తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు. అతడి పేరు కల్యాణ్ బాబు.. కేరాఫ్ చిరంజీవి. దానికి ముందే గోడలపై పోస్టర్లు అంటించారు. సన్నగా పూచిక పుల్లలా ఉన్న కుర్రాడి బొమ్మ వేసి ఇతనెవరో తెలుసా అంటూ కొత్తరకం పబ్లిసిటీ చేసాడు దర్శకుడు ఇవివి సత్యనారాయణ. ఆ తర్వాత తనకు కావాల్సిన కథ రాసుకుని కల్యాణ్ బాబును ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. అప్పుడు ఆయనకు తెలియదు.. తాను పరిచయం చేస్తున్నది ఓ సునామిని అని. ఆ తర్వాత సినిమాకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే టైటిల్ పెట్టి కల్యాణ్ బాబును కాస్తా ఇప్పుడు మనమంతా ముద్దుగా పిలుచుకుంటున్న పవన్ కల్యాణ్ ను చేసారు అభిమానులు. పవన్ అనే ఒక్క పేరు చాలు అభిమానుల ఒంట్లో పవర్ పాస్ అవ్వడానికి. అందుకేనేమో ఈయనకు పవర్ స్టార్ అనే బిరుదు కూడా వచ్చేసింది. ఈయన ఇండస్ట్రీకి వచ్చి చూస్తుండగానే 23 ఏళ్లు గడిచిపోయింది. 1996 అక్టోబర్ 11న ఈయన నటించిన తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విడుదలైంది. పవన్ లోని టాలెంట్ అంతా తొలి సినిమాలోనే చూపించాడు ఇవివి సత్యనారాయణ. సుప్రియ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రేమకథను చూపించాడు ఇవివి. తొలి సినిమాలోనే కరాటే, మార్షల్ ఆర్ట్స్ కూడా చూపించాడు ఈయన. ఆ సినిమా యావరేజ్ అయినా కూడా ఆ తర్వాత చేసిన గోకులంలో సీతతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు పవన్. ఆ వెంటనే సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషీ సినిమాలతో పవన్ కల్యాణ్ ఓ చరిత్ర సృష్టించాడు. ఖుషీ తర్వాత 12 ఏళ్ల పాటు హిట్లు లేకపోయినా.. జల్సాతో పర్లేదనిపించాడు. గబ్బర్ సింగ్ తో 12 ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ అందుకుని ఔరా అనిపించాడు. ఆ మరుసటి ఏడాది అత్తారింటికి దారేది అంటూ మరోసారి ఇండస్ట్రీ రికార్డులతో ఆడుకున్నాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ బిజీ అయిపోయాడు పవర్ స్టార్. జనసేన పార్టీతో బిజీగా ఉండి.. ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసాడు పవన్ కల్యాణ్. 

More Related Stories