English   

24 కిస్సెస్ రివ్యూ

24-Kisses
2018-11-23 06:52:14

కుమారి 21 ఎఫ్ త‌ర్వాత హెబ్బాప‌టేల్ కు మంచి క్రేజ్ వ‌చ్చింది. అయితే దాన్ని యూజ్ చేసుకుంటూ స్టార్ మాత్రం కాలేక‌పోయింది. మ‌ళ్లీ ఇన్నేళ్ళ త‌ర్వాత ఇప్పుడు 24 కిస్సెస్ అంటూ మ‌రో సినిమాతో వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాలు ఎంత‌వ‌ర‌కు నిజం చేసింది..? 

క‌థ‌:

ఆనంద్(ఆదిత్ అరుణ్) ఓ ద‌ర్శ‌కుడు. షార్ట్ ఫిల్మ్స్ తో పాటు సినిమాలు కూడా చేస్తుంటాడు. చిన్న పిల్ల‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడుతుంటాడు. కానీ అదే స‌మ‌యంలో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే సెక్స్ కూడా చేస్తుంటాడు. అమ్మాయిల‌తో రిలేష‌న్ షిప్స్ లో ఉంటాడు. అలాంటి వ్య‌క్తి లైఫ్ లోకి శ్రీ‌ల‌క్ష్మి (హెబ్బాప‌టేల్) వ‌స్తుంది. 24 ముద్దులు పెట్టుకుంటే ప్రేమించిన వాడితో పెళ్లైపోతుంద‌ని న‌మ్ముతుంది. త‌ను ప్రేమించిన ఆనంద్ తో 24 ముద్దుల‌కు రెడీ అయిపోతుంది. ఆ క్ర‌మంలోనే ఇద్ద‌రూ శారీర‌కంగా క‌లుస్తారు. కానీ పెళ్లి వ‌ర‌కు వ‌చ్చేస‌రికి త‌న‌కు పెళ్లిపై న‌మ్మ‌కం లేద‌ని చెప్తాడు ఆనంద్. ఆ త‌ర్వాత ఏమైంది అనేది 24 ముద్దుల క‌థ‌. 

క‌థ‌నం:

24 కిస్సెస్.. టైటిల్ లోనే ముద్దులున్నాయి.. సినిమాలోనూ అవే ఉన్నాయి. క‌థ ఉంటుందేమో కంటెంట్ బ‌లంగా చెప్తాడేమో.. ఎంతైనా తొలి సినిమా మిణుగురులులో మంచి క‌థ ఉంటుంది క‌దా అనుకున్న ప్రేక్ష‌కుల‌కు త‌న క‌థ‌తో బొప్పి క‌ట్టించాడు ద‌ర్శ‌కుడు అయోధ్య కుమార్. క్లారిటీ లేని క‌థ‌లో ముద్దులు మాత్ర‌మే క‌నిపిస్తుంటే.. క‌థ కంగాళీ అయిపోయి ఎక్క‌డికి పోతుందో దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో బ‌య‌టికి రాలేని విధంగా థియేట‌ర్స్ లోనే సంగ్రామం చేస్తుంటారు ప్రేక్ష‌కులు. అంత నీర‌సంగా ఈ చిత్రం తెర‌కెక్కించాడు అయోధ్య కుమార్. 24 ముద్దులు పెట్టుకుంటే పెళ్లి అవుతుంద‌నుకునే కాన్సెప్ట్ చాలా కొత్త‌గా.. వింత‌గా ఉంది. కానీ ఫ‌స్టాఫ్ అంతా క‌థ లేకుండా కేవ‌లం ముద్దుల కోస‌మే ఇద్ద‌రూ క‌లుస్తున్న‌ట్లు ఉంటుంది. అదే చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ‌.. ఎప్పుడు ప‌డితే అప్పుడు ముద్దుల వ‌ర్షం కురిపించ‌డం అల‌వాటుగా మార్చేసాడు ద‌ర్శ‌కుడు. మ‌రోవైపు తాను తీసింది బూతు సినిమా కాదు అని చెప్ప‌డానికి మ‌ధ్య‌మ‌ధ్య‌లో మురికివాడ‌లు చూపించి.. హీరోను అక్క‌డ స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్న‌ట్లు చూపిస్తాడు. మ‌రోవైపు అదే స‌మ‌యంలో అత‌డు ఇతర స్త్రీల‌తో సెక్స్ చేస్తుంటాడు. అడిగితే అపోజిట్ సెక్స్ క‌దా.. ఆడ‌మ‌గా అలా క‌ల‌వ‌డం కామ‌న్ అంటాడు. ప్రేమిస్తున్నాన‌ని చెప్తాడు.. పెళ్లంటే నో అంటాడు. అస‌లు క‌న్విక్ష‌న్ లేని క‌థను తీసుకుని క‌న్ఫ్యూజ‌న్ లో ప‌డేసి ప్రేక్ష‌కుల బుర్ర‌లో ఫుట్ బాల్ ఆడేసుకున్నాడు ద‌ర్శ‌కుడు అయోద్య‌. 24 ముద్దులు పెట్టుకుంటే పెళ్లి అవుతుంద‌నేంత అమాయ‌కంగా హెబ్బాప‌టేల్ కారెక్ట‌ర్ ఉంటుంది.. అత‌డు త‌న‌ను మోసం చేస్తున్నాడు అంటుంది.. కానీ మ‌ళ్లీ హీరోతోనే తిరుగుతుంటుంది. సారీ చెప్ప‌గానే మ‌ళ్లీ సెక్స్ అంటుంది. అస‌లు ఇలాంటి క‌థ‌ను ఎలా తెర‌కెక్కించాల‌నుకున్నాడో.. ఎంత క్లారిటీ ఉందో తెలియ‌దు కాదు థియేట‌ర్స్ లో మాత్రం చాలా బుర్ర‌లు హీట్ ఎక్క‌డం మాత్రం ఖాయం. బోల్డ్ క‌థ మాత్ర‌మే కాదు.. దాన్ని తెర‌కెక్కించే స్క్రీన్ ప్లే కూడా ఉండాలి. 

న‌టీన‌టులు:

ఆదిత్ అరుణ్ బాగానే న‌టించాడు. ముద్దుల విష‌యంలో మ‌నోడు బాగానే ఆక‌ట్టుకున్నాడు. న‌ట‌న ప‌ర్లేదు. ఇక హెబ్బాప‌టేల్ కుమారి 21 ఎఫ్ త‌ర్వాత ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ రెచ్చిపోయింది. అప్పుడు ముద్దులు లేవు కానీ ఇప్పుడు ఫ్రెంచ్ కిస్సులు కూడా లాగించేసింది. ఛాన్సులు రాక‌పోతే ఈ స్థాయిలో రెచ్చిపోతారా అనిపిస్తుంది హెబ్బాను చూసిన త‌ర్వాత‌. డాక్ట‌ర్ పాత్ర‌లో రావు ర‌మేష్ ఆక‌ట్టుకున్నాడు. సీనియ‌ర్ న‌రేష్ తో పాటు మిగిలిన వాళ్లు ఓకే.. 

టెక్నిక‌ల్ టీం: 

జోయ్ బారువా సంగీతం ఆక‌ట్టుకోలేదు. ఒక్క పాట కూడా పెద్ద‌గా ఎక్క‌లేదు. విజువ‌ల్ గా ముద్దులున్నాయి కాబ‌ట్టి ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ నీర‌సం తెప్పించింది. చాలా సీన్లు తీసేయొచ్చేమో అనిపిస్తుంది. అనిల్ ఆల‌యం ఎడిటింగ్ చాలా వీక్. ద‌ర్శ‌కుడు అయోద్య కుమార్ అన్ని విష‌యాల్లోనూ ఫెయిల్ అయ్యాడేమో అనిపించింది. మిణుగురులు చూడ‌లేద‌నే క‌సితో మంచి సినిమా చేయాలి కానీ కిస్సులు మాత్ర‌మే పెట్టి కంటెంట్ మ‌రిచిపోతే ఎలా..? 

చివ‌ర‌గా: బోల్డుకు బూతుకు మ‌ధ్య‌లో ఆగిన 24 కిస్సెస్..

రేటింగ్ ; 1/5

More Related Stories