పవన్ గారూ.. 25 రోజులు చాలు.. పూర్తి చేస్తామంటున్న నిర్మాత..

పవన్ సినిమాలు చేయాలని మరింత ఒత్తిడి పెరిగిపోతుంది.రాజకీయాల కోసం విపరీతంగా గడ్డం పెంచిన పవన్.. ఇప్పుడు మళ్లీ హీరోలా మారిపోయాడు. ఆ మధ్య కొత్త లుక్ లో తానా మహాసభలలో కనిపించాడు. అప్పట్నుంచి ఈయన మళ్లీ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక నిర్మాతలు అయితే ఈయన కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ తో పాటు పవన్ స్నేహితుడు రామ్ తాళ్ళూరి, ఏ.ఎమ్. రత్నం లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు పవన్ అనుమతి కోసం చూస్తున్నారు. 2024 ఎన్నికలకు మరో ఐదేళ్ల సమయం ఉందని.. ఆ లోపు కనీసం రెండు సినిమాలు అయినా చేయాలంటూ కోరుకుంటున్నారు.
ఇప్పుడు పవన్ కూడా ఈ విషయం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మూడేళ్ల పాటు ఏడాదికో సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన కూడా పవన్ ముందుకు వచ్చిందని.. దాని వైపు ఆయన ఆలోచిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఏఎం రత్నంను కూడా కలిసి మాట్లాడాడని వార్తలు వినిపిస్తున్నాయి. తన కోసం కథలు సిద్ధం చేసుకోవాలంటూ చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈయన కానీ ఒక్కసారి ఓకే అంటే పారితోషికం ఎంత కావాలంటే అంత ఇస్తామని పవన్ కు సందేశాలు పంపుతున్నారు నిర్మాతలు.
ఇది ఇప్పుడు వినిపిస్తున్నా కూడా మొన్న కూడా పవన్ తనకు సినిమాలు చేయడానికి ఆసక్తి లేదని చెప్పాడు. కొంతకాలం తనకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ ప్రశాంతంగా ఉంటానని చెబుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ మళ్లీ మేకప్ వేసుకునే టైమ్ దగ్గరికి వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పింక్ సినిమా రీమేక్ లో నటించబోతున్నాడు పవర్ స్టార్. దీనికోసం కథ కూడా సిద్ధమైపోయింది. ఈ సినిమా కోసం కేవలం 25 రోజులు డేట్స్ చాలు.. పని పూర్తి చేస్తామని చెబుతున్నాడు దిల్ రాజు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కు త్రివిక్రమ్ ద్వారా తెలియచేస్తున్నాడని తెలుస్తుంది. పవన్ కూడా ఈ కథపై ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. హూందాతనం ఉన్న పాత్ర కావడంతో సినిమా చేస్తాడని నమ్ముతున్నారు ఫ్యాన్స్.