జూన్ 28న విజయనిర్మల అంత్యక్రియలు.. ఫిల్మ్ ఛాంబర్ కు భౌతికకాయం..

దర్శక నిర్మాత, గిన్నీస్ బుక్ హోల్డర్ విజయనిర్మల మృతితో తెలుగు ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలుగులో మహిళా దర్శకులకు క్రేజ్ తీసుకొచ్చిన ఘనత ఈమెదే. ఈమె కన్నుమూయడంతో ఒక శకం ముగిసిందని సినిమా పండితులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా ఈమె అనారోగ్యంగానే ఉన్నారు. ఈ మధ్యే మా అసోసియేషన్ ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చినపుడు కూడా చాలా అనారోగ్యంగా కనిపించారు. కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆమె. ఇకిప్పుడు ఆరోగ్యం విషమించడంతో గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నమూసారు ఈమె. విజయనిర్మల భౌతిక కాయాన్ని జూన్ 27 ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడలోని ఇంటికి తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత జూన్ 28 ఉదయం ఫిల్మ్‌ఛాంబర్‌కు ఆమె పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం అక్కడకి తీసుకెళ్లిన తర్వాత అంతిమయాత్ర మొదలు కానుంది. ఈ అంత్యక్రియల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.