బిగ్ బాస్ 3కి నిజంగానే వాళ్లంతా రాబోతున్నారా.. వస్తే రచ్చ రచ్చే..

బిగ్‌బాస్ సీజన్ 3 మొదలు కాకముందే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పటికే తొలి రెండు సీజన్లు మంచి పేరు తెచ్చుకోవడంతో మూడవ సీజన్ కూడా అలాగే ఉండాలని ప్లాన్ చేస్తున్నారు షో నిర్వాహకులు. ఇంకా చెప్పాలంటే తొలి రెండు సీజన్లతో పోలిస్తే మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్న బిగ్‌బాస్ సీజన్ వన్ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత నాని పోస్ట్ చేసిన రెండో సీజన్ పర్లేదనిపించింది. దాంతో మూడవ సీజన్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలనే ఉద్దేశంతో నాగార్జునను హోస్ట్‌గా తీసుకొస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ప్రోమోలు కూడా రచ్చ చేస్తున్నాయి. నాగార్జున కూడా మూడో సీజన్ కోసం తనను తాను బాగానే సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన మన్మధుడు 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయిన తర్వాత బిగ్‌బాస్ సీజన్ 3 కోసం నాగార్జున సిద్ధం కానున్నాడు. మొత్తం 26 ఎపిసోడ్లు ఇందులో నాగ్ కనిపిస్తాడు.
ఈ ఎపిసోడ్స్ కోసం నాగార్జున ఏకంగా 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇది చేస్తూనే మరోవైపు బంగార్రాజు సినిమా కూడా చేయబోతున్నాడు మన్మథుడు. ఇక మూడో సీజన్ కోసం తొలి రెండు సీజన్స్ మాదిరి కాకుండా ఈ సారి అంతా స్టార్ మెటీరియల్ ను తీసుకొస్తున్నారు. రాజకీయాల్లో ఫుల్ కామెడీ చేస్తూ కడుపుబ్బా నవ్వించిన కేఏ పాల్ బిగ్‌బాస్ సీజన్ 3లో ఉన్నాడని తెలుస్తుంది. ఆయనతో పాటు యాంకర్ శ్రీముఖి, హీరో తరుణ్, వరుణ్ సందేశ్, ఉదయభాను, వైవా హర్ష, సింగర్ హేమచంద్ర, కొరియోగ్రఫర్ రఘు మాస్టర్, టిక్ టాక్ ఫేమ్ ఉప్పల్ బాలు లాంటి వాళ్లు ఈ సారి ఇంట్లోకి వస్తున్నారని తెలుస్తుంది. దాంతో బిగ్‌బాస్ సీజన్ 3పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తమిళ బిగ్ బాస్ మొదలైపోయింది. దాంతో తెలుగు కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని చూస్తున్నారు నిర్వాహకులు. చూడాలిక.. చివరికి ఏం జరుగుతుందో..?