బిగ్ బాస్ 3 మొదలు.. ఇంట్లోకి 15 మంది రాయల్ ఎంట్రీ..

ఎన్నో వివాదాలను దాటుకుని బిగ్ బాస్ 3 షో మొదలైపోయింది. నిన్నమొన్నటి వరకు కూడా ఇది మొదలవుతుందా లేదా అనే ఆసక్తి అందర్లోనూ కనిపించింది. కానీ అనుకున్నట్లుగానే జులై 21 రాత్రి దీన్ని మొదలు పెట్టేసారు మా యాజమాన్యం. ఇక నాగార్జున కూడా తన హోస్టింగ్ తో అదరగొట్టేసాడు. మన్మథుడు 2 సినిమా షూటింగ్ స్పాట్ నుంచి నేరుగా బిగ్ బాస్ 3 హౌజ్ లోకి ఎంట్రీ వచ్చాడు నాగార్జున. అసలు ఈ షో ఎందుకు ఇంతగా జనాలు చూస్తున్నారో తెలుసుకోవాలని తాను రంగంలోకి దిగానంటూ వచ్చాడు మన్మథుడు. తొలి ఎపిసోడ్ అంతా సరదా సరదాగా సాగిపోయింది. 15 మంది కంటెస్టెంట్లను పరిచయం చేసే వేడుకతోనే ఈ ఎపిసోడ్ అయిపోయింది. అందరి కంటే ముందు బిగ్ బాస్ నాగార్జునకే టాస్క్ ఇచ్చాడు. తొలి ముగ్గురుని ఎంపిక చేసి ఇంట్లోకి పంపే బాధ్యతను నాగార్జున తీసుకున్నాడు. అలా ఆయన ఎంపిక చేసిన వాళ్లు తీన్మార్ సావిత్రి అంటే శివ జ్యోతి.. ఆ తర్వాత సీరియల్ నటుడు రవికృష్ణ.. ఆ వెంటనే జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అశు రెడ్డిలను ఇంట్లోకి పంపించాడు నాగార్జున. నాలుగో కంటెస్టెంట్ గా టీవీ 9 జాఫర్.. ఐదో కంటెస్టెంట్ గా నటి హిమజ రెడ్డి.. ఆరో కంటెస్టెంట్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. నెంబర్ సెవన్ గా సీరియల్ నటి రోహిణి.. 8వ కంటెస్టెంట్ గా కొరియోగ్రఫర్ బాబా భాస్కర్ వచ్చారు. నెంబర్ 9 పునర్ణవి భూపాలం.. 10 సీనియర్ నటి హేమ.. 11 మోడల్, సీరియల్ నటుడు అలీ రెజా.. 12గా మిల్కీ మహేష్.. 13గా రాములమ్మ శ్రీముఖి వచ్చారు. ఇక చివరగా కొత్తబంగారులోకం సినిమాలో నిజంగా నేనేనా పాటతో వరుణ్ సందేశ్.. నేనని నీవని పాటతో ఆయన భార్య వితికా షెరూ ఎంట్రీ ఇచ్చారు. ఇలా తొలి ఎపిసోడ్ మొత్తం వాళ్లు ఎంట్రీతో సరిపోయింది. చివర్లో చిన్న ట్విస్ట్ ఇస్తూ శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షెరూ, బాబా భాస్కర్, జాఫర్ లను నామినేట్ చేస్తూ ఎపిసోడ్ ముగించేసారు. ఇక అసలు రచ్చ జులై 22 నుంచి మొదలు కానుంది. రానున్న 100 రోజుల పాటు ఈ రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంటుంది.