English   

రాజు గారి గది 3 రివ్యూ

Raju Gari Gadhi 3 Review
2019-10-18 15:19:00

రాజుగారిగది సినిమాను బ్రాండ్ గా మార్చేస్తున్నాడు దర్శకుడు ఓంకార్. ఇప్పుడు మూడో భాగాన్ని కూడా తీసుకొచ్చాడు. తొలిభాగం హిట్ అయినా రెండో పార్ట్ నిరాశపరిచింది. మరిప్పుడు మూడో భాగం ఎలా ఉందో చూద్దాం..

కథ..

అశ్విన్ (అశ్విన్ బాబు) ఆటోడ్రైవర్. హ్యాపీగా జాలీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి వాడి జీవితంలోకి డాక్టర్ మాయా (అవికా గోర్)వస్తుంది. చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. కానీ ఆమెకు ఐ లవ్ యు చెప్పిన వెంటనే యక్షి అనే ఒక దయ్యం వచ్చి అందర్నీ కొడుతుంటుంది. అలాంటి సమయంలో అశ్విన్ కూడా మాయకు ప్రపోజ్ చేస్తాడు. అనుకున్నట్లుగానే యక్షి వస్తుంది. అసలు ఆ యక్షి ఎవరు.. ఎందుకు ఆమెకు కాపలా కాస్తుంటుంది.. దెయ్యం ఎందుకు ఎప్పుడు బయటికి వస్తుందనేది అసలు కథ. అలాంటి సమయంలో అశ్విన్ ఏం చేశాడు.. తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు.. అదే సమయంలో మాయను వెంబడిస్తున్న దెయ్యం నుంచి ఆమెను ఎలా కాపాడాడు అనేది కథ.

కథనం..

దయ్యంతో కాపురం.. మన దర్శకులకు ఇది బాగా అలవాటైన వ్యవహారం.. హిట్ కొట్టాలి అనుకున్న ప్రతి దర్శకుడు దయ్యంతో సావాసం చేస్తున్నాడు. తమిళంలో లారెన్స్.. తెలుగులో ఓంకార్.. దయ్యాలను దత్తత తీసుకున్నారు.. రాజు గారి గది 3 అంటూ మళ్లీ వచ్చేసాడు ఓంకార్. కానీ ఫస్ట్ ఇంపాక్ట్ మళ్లీ ఎప్పుడూ ఇవ్వలేదు అనేది వాస్తవం.. ఎన్ని సీక్వెల్స్ చేసినా కూడా ఫస్ట్ పార్ట్ చేసిన మాయ రిపీట్ చేయడం కష్టమే.. రాజు గారి గదిలో వాటంతటవే కడుపులు చెక్కలయ్యేలా నవ్వులు వచ్చేస్తాయి.. కానీ ఇప్పుడు పార్ట్ 3 లో మాత్రం మనకు మనమే గిలిగింతలు పెట్టుకోవాలి.. ఫస్ట్ హాఫ్ లో కథ లేనట్టు అక్కడక్కడా తిప్పేశాడు.. సారీ చుట్టేసాడు ఓంకార్.. ఇంటర్వెల్ కు కానీ అసలు కథ మొదలు కాదు.. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ చాలా బెటర్.. అప్పుడే దయ్యాలు ఎంటర్ కావడంతో.. కథలోకి కామెడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. అజయ్ ఘోష్, ఊర్వశి, అలీ, ధనరాజ్ లాంటి వాళ్ళతో సెకండాఫ్ బాగానే కవర్ చేశాడు ఓంకార్.. అక్కడక్కడా కామెడీ సీన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి.. కానీ పూర్తిస్థాయిలో మాత్రం కాదు.. క్లైమాక్స్ ఎంత ఊహించుకుంటే ఈజీగా తేల్చేశారు. అశ్విన్ బాబును స్టార్ హీరో రేంజ్లో ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు ఓంకార్. కొన్ని సన్నివేశాల్లో అది కాస్త ఓవర్ అనిపించింది.. నటుడిగా మాస్ పాత్రలో బాగానే చేశాడు అశ్విన్.. అవికా గోర్ క్యారెక్టర్ నుంచి చాలా ఊహిస్తాం కానీ.. క్లైమాక్స్ తప్ప ఆమెకు పర్ఫార్మ్ చేసే అవకాశం రాలేదు. ఓవరాల్ గా రాజు గారి గది 3.. అక్కడక్కడ ఓకే కానీ ఊహించనంత లేదు. పైగా ఈ చిత్రం దిల్లకు దుడ్డు 2 సినిమాకు రీమేక్ కావడం.. అక్కడి సన్నివేశాలు ఎత్తేయడం మైనస్. ఉన్నదున్నట్లు కాకుండా ఇంప్రోవైజ్ చేసి ఎటూ కాకుండా అయిపోయింది కథ.

నటీనటులు..

అశ్విన్ బాబు మాస్ హీరో అయిపోయాడు. అయితే నటనలో చిరంజీవితో పాటు రవితేజ లాంటి హీరోలను అచ్చంగా దించేసే ప్రయత్నం చేసాడు. ఇమిటేషన్ తో సొంత మార్క్ లేకుండా చేసుకున్నాడు అశ్విన్. డాన్సులు, ఫైట్లు బాగా చేసాడు. అవికా గోర్ నుంచి ఎంతో ఊహిస్తాం కానీ అక్కడ అంత అనిపించలేదు. ఇలాంటి పాత్ర కోసం తమన్నాను తీసుకోవాలనుకోవడం కాస్త అత్యాశే. ఇప్పుడు అవికాకు కూడా క్లైమాక్స్ లో మాత్రమే నటించే ఆస్కారం దొరికింది. అలీ చాలా వరకు నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగిలిన పాత్రల్లో అజయ్ ఘోష్, శివాజీ రాజా, ధన్ రాజ్, బ్రహ్మాజీ, ప్రభాస్ శీను మిగిలిన గ్యాంగ్ పర్వాలేదనిపించారు.

టెక్నికల్ టీం..

షబ్బీర్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలాంటి కథల్లో పాటల కంటే కూడా నేపథ్య సంగీతం కీలకం. అక్కడక్కడా ఈ సంగీతం పర్లేదు.. కానీ పాటలు ఆకట్టుకోలేదు. గౌతంరాజు ఎడిటింగ్ పర్లేదు. అయితే ఫస్టాఫ్ మాత్రం చాలా సన్నివేశాలు స్లోగా సాగినట్లు అనిపించాయి. అవి కత్తిరించి ఉంటే బాగుండేదేమో..? సినిమాటోగ్రఫీ పర్వాలేదు.. దర్శకుడు ఓంకార్ మరోసారి దెయ్యం కథనే తీసుకొచ్చాడు కానీ ఆకట్టుకోలేదు. రాజుగారిగదిలో వర్కవుట్ అయిన కామెడీ తర్వాత రెండు భాగాల్లోనూ కుదర్లేదు. ఇక్కడ సెకండాఫ్ పై పెట్టిన శ్రద్ధ ఫస్టాఫ్ లో కాస్త పెట్టుంటే సినిమా రేంజ్ మారిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు.. పైగా తెలిసిపోయే స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా అనిపించలేదు.

చివరగా.. రాజుగారిగది 3.. బ్రాండ్ ఓకే.. కామెడీ ఎక్కడ ఓంకార్ గారూ..

రేటింగ్: 2.5/5

More Related Stories