వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ దసరా స్పెషల్ పోస్టర్ విడుదల

సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఇక దానికి సీక్వెల్‌గా రాబోతోన్న ఎఫ్ 3 చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. థియేటర్లో నవ్వుల ఝల్లు కురిపించేలా ఈసారి కామెడీ డోస్ పెంచుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. టాలీవుడ్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎఫ్ 3 చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తమన్నా భాటియా, మెహరీన్ పిర్జాడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, రాజేంద్ర ప్రసాద్, సోనాల్ చౌహాన్ ముఖ్యపాత్రల్లో కనిపించబోతోన్నారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో సుధీర్ఘ షెడ్యూల్‌ను చిత్రయూనిట్ నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు నటీనటులందరూ పాల్గొంటున్నారు. దసరా సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పోస్టర్లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్‌లు తమ తమ స్టైల్లో అదరగొట్టేశారు.
చిత్రయూనిట్ విడుదల చేసిన ఈ వీడియోలో అందరూ దసరా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ వీడియోను చూస్తుంటే సెట్లో ఎంతటి సందడి వాతావరణం ఉందో తెలుస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను రెడీ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.