English   

30 సంవత్సరాల జగదేకవీరుడు అతిలోకసుందరి..

chiru
2020-05-09 08:20:02

జగదేకవీరుడు అతిలోకసుందరి.. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ మరపురాని మరవలేని చిత్ర రాజం. ఎన్నో ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించింది జగదేకవీరుడు అతిలోకసుందరి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాను కె.రాఘవేంద్రరావు తెరకెక్కించాడు. 1990 మే 9న విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఉన్న తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. చిరంజీవి ఇమేజ్ రెండింతలు చేసింది. ఈ సినిమా రూపొందడం వెనుక చాల కథలు ఉన్నాయి. అప్పటికి రాఘవేంద్రరావు వరస ఫ్లాపుల్లో ఉన్నాడు.. అలాంటి సమయంలో అశ్వినీదత్ తనకు ఓ సినిమా చేసి పెట్టాలని రాఘవేంద్రరావును అడగడం.. ఆయన ఓకే అనటం జరిగిపోయాయి. కానీ ఆయనకు మామూలు సినిమా కాదు.. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా కావాలి అని దర్శకేంద్రుడిని అడిగాడు అశ్వినీదత్. దాని కోసం ముగ్గురు రచయితలు పోటీపడి ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు. దేవకన్య భూమి మీదకు వచ్చినప్పుడు ఉంగరం చేజార్చుకొని అది హీరో దొరకడం అనే లైన్ సిద్ధం చేశారు. సోషియో ఫాంటసీలో అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడనటువంటి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్.. భారీ సెట్ లతో జగదేకవీరుడు అతిలోకసుందరి తెరకెక్కించాడు రాఘవేంద్రరావు.

అతిలోకసుందరి పాత్రకు శ్రీదేవి ప్రాణం పోసింది. ఇక రాజు పాత్రలో చిరంజీవి ఎప్పటికీ మరిచిపోలేని పర్ఫార్మెన్స్ చేశాడు. తీరా అంతా సిద్ధం అయిపోయి సినిమా విడుదలైన తర్వాత భారీ వర్షాలు ఆంధ్రదేశమంతా కురుస్తున్నాయి. దాంతో పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని దర్శక నిర్మాతలు కంగారు పడుతున్న వేళ.. మంచి సినిమా వస్తే ఎలాంటి పరిస్థితుల్లో అయినా చూస్తామని తెలుగు ప్రేక్షకులకు మరోసారి భరోసా ఇచ్చారు. దాని ఫలితమే జగదేకవీరుడు అతిలోకసుందరి థియేటర్లలో ఏడాది ప్రయాణం. అప్పటి వరకు తెలుగు సినిమాలో ఉన్న ఏ రికార్డును కూడా ఈ సినిమా వదల్లేదు. మెగాస్టార్ చిరంజీవి దెబ్బకు అన్ని రికార్డులు కదిలిపోయాయి. సినిమా వచ్చి 30 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు అదే క్రేజ్ వుంది.

More Related Stories