English   

జగన్ ఉన్నాడు.. ఎన్టీఆర్‌తో పని లేదంటున్న 30 ఇయర్స్ పృథ్వీ..

 Prudhvi Raj
2020-07-22 07:44:51

జూనియర్ ఎన్టీఆర్ తన పాటికి తాను సినిమాలు చేసుకుంటున్నా కూడా కొందరు మాత్రం ఇప్పటికీ ఈయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఒకప్పుడు వెలిగిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉనికి చాటుకోవడానికి కూడా వణికిపోతుంది. మొన్నటికి మొన్న ఎన్నికల్లో వైసీపీ చేతిలో దారుణంగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమి ఇది. ప్రస్తుతం తన అస్తిత్వం కూడా పోగొట్టుకొని దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో పడిపోయింది తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆ పార్టీని ఇంకెంతకాలం నెట్టుకొస్తాడు అంటూ రాజకీయ వర్గాల్లో వేడివేడి చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో తెలుగుదేశం గట్టెక్కాలంటే కచ్చితంగా ఒక బలమైన నాయకుడు కావాల్సిందే. అది జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కాకూడదు అని అంతా ప్రశ్నిస్తున్నారు.

ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ తో మరోసారి చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య హరికృష్ణ సంవత్సరీకం కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చాడు చంద్రబాబు. అక్కడే కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తో చాలా సేపు ముచ్చటించిన విజువల్స్ మీడియా కంట పడ్డాయి. ఇందులో రాజకీయ పరమైన చర్చలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు రాజకీయ ప్రముఖులు కూడా తెలుగుదేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి మెరుగైన స్థితికి రావాలంటే కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు అందుకోవాల్సిందే అంటున్నారు. ఎవరు ఎంతగా ప్రయత్నిస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలంటే ఆసక్తి లేదు అంటున్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల్లో నటించడమే అని చెబుతున్నాడు నందమూరి వారసుడు. భవిష్యత్తులో ఎప్పుడైనా తన తాత పార్టీ కోసం అవసరం పడితే వస్తానేమో అంటున్నాడు కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన రాజకీయాల వైపు అడుగులు వేయడం అనేది కలలో మాట.

చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకా ఎంత మంది ప్రయత్నించినా ఎన్టీఆర్ మనసు మారదు అనేది కొందరు చెబుతున్న మాట. మరోవైపు నారా లోకేష్ సహా బాలయ్య కూడా ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ వచ్చినా చేసేదేం లేదని స్టేట్ మెంట్స్ ఇచ్చారు. అలాంటి అవసరం కూడా లేదని చెప్పారు. ఇప్పుడు కమెడియన్ కమ్ వైసీపీ లీడర్ 30 ఇయర్స్ పృథ్వీ కూడా ఇదే అన్నాడు. జగన్ ఉండగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో అవసరం లేదని చెప్పాడాయన. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అద్భుతంగా ఉందని.. ఎన్టీఆర్ సినిమాల్లో ఉండటమే మంచిదని ఆయన సలహా ఇస్తున్నాడు. ఇప్పటికిప్పుడు వచ్చినా ఆయన చేయడానికి కూడా ఏం లేదంటున్నాడు పృథ్వీ. వైఎస్ జగన్ ఏపీని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నాడని చెప్పాడు పృథ్వీ. 55 ఏళ్లు దాటిన తర్వాత సరికొత్త ఎజెండాతో జూనియర్ వస్తే అప్పుడు బాగుంటుందేమో అని సూచించాడు పృథ్వీ.

మరోవైపు చాలా మంది విశ్లేషకులు కూడా ఇప్పుడు జూనియర్ రాకపోవడమే మంచిది అంటున్నారు. కొందరు మాత్రం పార్టీ బతకాలంటే బలమైన నాయకుడు కావాలి.. అందులోనూ యువ నాయకుడు కావాలి.. అతడు ఎన్టీఆరే అయ్యుండాలి అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం వైపు జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా రాడా అనేది చూడాలి. మరోవైపు పార్టీ నుంచి బయటికి వెళ్తున్న వల్లభనేని వంశీ లాంటి నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. వాళ్లు జూనియర్ కు అత్యంత సన్నిహితులు కావడం ఇక్కడ గమనార్హం. దానికి తోడు నారా లోకేష్ పప్పు అంటూ ఆయన కంటే జూనియర్ ఎన్టీఆర్ వెయ్యి రెట్లు నయం అంటూ తెలుగుదేశంలో కొందరు కీలక నేతలు బాహాటంగానే చెబుతున్న మాట. మరి తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

More Related Stories