English   

30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ట్రైలర్ రివ్యూ..

30 Rojullo Preminchadam Ela
2021-01-21 18:17:50

యాంకర్ ప్రదీప్ హీరోగా మారి కొత్త దర్శకుడు మున్నా తెరకెక్కించిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ సినిమాలో తమిళమ్మాయి అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. జనవరి 29న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత విషయం చాలానే ఉందని అర్థం అయిపోయింది. నిజానికి ప్రదీప్ హీరోగా నటించినా కూడా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా పై అంతగా ఆసక్తి లేదు. ఏదో నీలి నీలి ఆకాశం పాట సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమా వస్తున్న విషయం తెలిసింది. కానీ అంచనాలు మాత్రం అంతగా లేవు. అయితే ఇప్పుడు ట్రైలర్ చూసిన తరవాత సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. ఖచ్చితంగా ఈ సినిమాలో చాలా విషయం ఉంది అని రెండు నిమిషాల ట్రైలర్ తో దర్శకుడు మున్నా నిరూపించాడు.ప్రేమ కథకు పునర్జన్మల నేపథ్యం జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు మున్నా. 

గతంలో పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు సంచలన విజయం సాధించాయి. అందులో అక్కినేని నాగేశ్వరావు మూగమనసులు.. నాగార్జున జానకి రాముడు.. రామ్ చరణ్ మగధీర లాంటి సంచలన సినిమాలున్నాయి. ఇప్పుడు యాంకర్ ప్రదీప్ కూడా పునర్జన్మల నేపథ్యంలోనే తన సినిమాలో తీసుకొస్తున్నాడు. గత జన్మలో విడిపోయిన ఒక జంట మళ్ళీ పుట్టి ఈ జన్మలో ఎలా కలిశారు.. 30 రోజుల్లో వాళ్ళిద్దరూ ఎలా ప్రేమలో పడి తమ ప్రేమను గెలిపించుకున్నారు అనే లాజిక్ ముడిపెడుతూ ఈ సినిమా తెరకెక్కించాడు మున్నా. ట్రైలర్ లో అన్ని కమర్షియల్ హంగులు కనిపిస్తున్నాయి. కాలేజ్ కామెడీ.. అనూప్ రూబెన్స్ పాటలు.. అద్భుతమైన సినిమాటోగ్రఫీ అన్నీ బాగానే ఉన్నాయి. దాంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. కథ నచ్చింది కాబట్టి గీతా ఆర్ట్స్, uv creations లాంటి భారీ నిర్మాణ సంస్థలు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాను విడుదల చేస్తున్నాయి. మరి ఈ సినిమాతో ప్రదీప్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. సుమంత్ కపటదారి సినిమాతో పాటు ఈ సినిమా జనవరి 29న విడుదలవుతోంది.

More Related Stories