English   

ఆదిత్య 369 రీమేక్ ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా...?

Krish
2018-12-31 12:16:52

కొందరు హీరోల కెరీర్ లో కొన్ని అద్భుతాలు ఉంటాయి. వాటిని అలా వదిలేయాలి అంతే. రీమేక్ చేయాలని అస్సలు అనుకోకూడదు. బాలయ్య కెరీర్ లో కూడా అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రం పాతికేళ్ల కింద విడుదల అయింది. అప్పట్లోనే అత్యాధునిక టెక్నాలజీ తో తెరకెక్కిన ఆదిత్య 369 సంచలన విజయం సాధించింది. బాలయ్య కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు క్రిష్. అయితే అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ నెంబర్ వన్ యారీ షో కు వచ్చిన క్రిష్ ఈ విషయాన్ని చెప్పాడు. బాలయ్యతో కలిసి ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్ కోసం నెంబర్ వన్ యారి షో కు వచ్చాడు క్రిష్. ఇందులో భాగంగానే రానా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆదిత్య 369 పేరు చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. 

బాలయ్య సినిమా రీమేక్ చేయాల్సి వస్తే ఆదిత్య 369 ఏ హీరోతో రీమేక్ చేస్తారంటూ రానా అడిగిన ప్రశ్నకు మరో మొహమాటం లేకుండా మోక్షజ్ఞతో చేస్తానంటూ సమాధానం చెప్పాడు క్రిష్. ఈయన తీరు జోరు చూస్తుంటే మోక్ష తొలి సినిమా దర్శకుడు అని వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ కూడా తన వారసున్ని క్రిష్ చేతుల్లో పెట్టాలని చూస్తున్నాడు. గత కొన్నేళ్లలో బాలయ్యని బాగా అర్థం చేసుకున్న దర్శకుడు క్రిష్. ఇప్పటికే ఈయ‌న‌తో మూడు సినిమాలు చేశాడు బాలయ్య. గౌతమీపుత్ర శాతకర్ణితో పాటు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఈ కాంబినేష‌న్ లో వ‌చ్చాయి. పైగా క్రిష్ ప‌నితీరు బాల‌య్య‌కు బాగా తెలుసు. అందుకే తన వారసున్ని తీసుకెళ్లి ఈ దర్శకుడి చేతిలో పెట్టాలని చూస్తున్నాడు బాల‌య్య‌. అన్నీ కుదిరితే నిజంగానే ఆదిత్య 369 రీమేక్ చేసినా ఆశ్చర్యం లేదేమో.

More Related Stories