English   

రివ్యూ: గుణ 369

guna
2019-08-02 19:51:49

నటీనటులు: కార్తికేయ, అనఘ, ఆదిత్య మీనన్, నరేష్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అర్జున్ జంధ్యాల
నిర్మాత: తిరుమల్ రెడ్డి, జ్ఞాపిక ఎంటర్ టైన్మెంట్స్

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకున్న హీరో కార్తికేయ. ఈ సినిమా తర్వాత ఈయన చేసిన హిప్పీ డిజాస్టర్ అయింది. మళ్లీ ఇప్పుడు గుణ 369 సినిమాతో వచ్చాడు. మరి ఈ చిత్రంతో కార్తికేయ ఎలాంటి ఫలితం అందుకున్నాడో చూద్దాం..

కథ:
గుణ (కార్తికేయ) ఓ స్టూడెంట్.. తను ఎదో ఓ విధంగా బీటెక్‌ పూర్తి చేసి తండ్రి కోరిక తీర్చాలనుకుంటాడు. అంత సాధారణ కుర్రాడు. తనుండే కాలనీలో అందరికీ సాయం చేస్తూ మంచోడిగా పేరు తెచ్చుకుంటాడు. ఇక అదే కాలనికి వచ్చిన గీత (అనఘ) తో ప్రేమలో పడతాడు. గుణ కారెక్టర్ నచ్చి ఆమె కూడా ఇష్టపడుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ అదే సమయంలో ఓ స్నేహితుడికి సాయం చేయబోయి ఇబ్బందుల్లో పడతాడు గుణ. గద్ధలగుంట రాధ(ఆదిత్య) అనే రౌడీ హత్య కేసులో గుణ జైలుకు వెళ్లిపోతాడు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న జీవితం జైలుకు వెళ్లిన తర్వాత ఛిన్నాభిన్నం అయిపోతుంది. గుణ కాస్తా ఖైదీ నెం గుణ 369గా మారిపోతాడు. ఆ తర్వాత గుణ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది.. అసలేం జరిగింది.. ఎందుకు అలా అయిపోతాడు అనేది అసలు కథ..

కథనం:
ఆర్ఎక్స్ 100 సినిమాలో పూర్తిగా కుర్రాళ్లను టార్గెట్ చేసి సినిమా చేసాడు కార్తికేయ. ఆ తర్వాత హిప్పీ కూడా అలాంటిదే. కానీ ఇప్పుడు ఈయన నటించిన గుణ 369 మాత్రం పక్కా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి చేసింది. పైగా ఈ చిత్ర దర్శకుడు అర్జున్ జంధ్యాల బోయపాటి శిష్యుడు. ఆ ఛాయలే సినిమా అంతా కనిపించాయి. వద్దన్నా కూడా గురువు మాదిరే ఎమోషనల్ సీన్స్ తెరకెక్కించాడు అర్జున్. కొన్ని సన్నివేశాల్లో గుణ భలే అనిపిస్తాడు.. కానీ మరికొన్ని సన్నివేశాల్లో మాత్రం విసుగు పుట్టిస్తాడు. ఇక తెలుగు సినిమా మారదా అనే స్థాయిలో రొటీన్ కథను కూడా వండి వార్చాడు అర్జున్. కానీ ఎమోషనల్ సీన్స్ తో పాటు మాస్ సన్నివేశాలు కూడా బాగా చిత్రీకరించడంతో అక్కడక్కడా గుణ గాడిన పడ్డట్లే అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా సోసోగా సాగిపోయింది. హీరో ఇంట్రో.. ఆ తర్వాత ఆయన ఇంట్లో తండ్రితో గొడవ.. ప్రేమ.. స్నేహితులతో తిరగడాలు ఇవన్నింటితోనే సరిపోయింది. ఇంటర్వెల్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్ పై హైప్ పెంచాడు దర్శకుడు. కానీ సెకండాఫ్ మళ్లీ రొటీన్ అయిపోవడంతో ట్విస్ట్ కూడా వేస్ట్ అయిపోయింది. రొటీన్ స్క్రీన్ ప్లే పూర్తిగా గుణ కొంప ముంచేసింది. అమ్మాయిల విషయంలో అన్యాయం చేయాలనుకునే వాళ్లను నిలువునా నరికేయాలి అనే కాన్సెప్టుతో వచ్చింది ఈ చిత్రం. సోషల్ మెసేజ్ కూడా ఉంది ఈ కథలో. కొన్ని అద్భుతమైన సన్నివేశాలున్నా కూడా రొటీన్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో వీటి ముందు అది తేలిపోయింది. క్లైమాక్స్ బాగుంది.. చివరి అరగంట సినిమాను బాగా తెరకెక్కించాడు దర్శకుడు. ఓవరాల్ గా చూసుకుంటే ముక్కలు ముక్కలుగా గుణవంతుడు అనిపించాడే కానీ మొత్తంగా మాత్రం కాదు.


నటీనటులు :
కార్తికేయ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ కుర్ర హీరోలో మంచి ఈజ్ ఉంది. మాస్ హీరో లక్షణాలు కూడా బాగానే కనిపించాయి. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ బాగా నటించాడు. హీరోయిన్ అనఘ కూడా బాగానే ఉంది. అందంతో పాటు అభినయం కూడా ఈమెకు బోనస్. హీరో తండ్రి పాత్రలో నరేష్‌ ఒదిగిపోయాడు. కామెడీ కూడా బాగానే పండించాడు ఈయన. రాధ లుక్‌లో ఆదిత్య మీనన్ అదిరిపోయాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో జబర్దస్త్ మహేష్‌ బాగానే చేసాడు.

టెక్నికల్ టీం:
ఆర్ఎక్స్ 100 కు అద్భుతమైన సంగీతం అందించిన చేతన్ భరద్వాజ్‌ దీనికి కూడా మంచి సంగీతం ఇచ్చాడు. పాటలు కూడా పర్లేదు. ఎడిటింగ్ ఓకే.. ఫస్టాఫ్ ల్యాగ్ ఉంది.. సెకండాఫ్ సీన్స్ కూడా అక్కడక్కడా బోర్ కొట్టించాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. యదార్థ సంఘటనల ఆధారంగా కథను రాసుకున్న అర్జున్ జంధ్యాల దానికి మాస్ అంశాలను కూడా బాగానే జోడించాడు. మొత్తంగా సమాజంలో జరుగుతున్న ఘటనలే కథగా రాసుకుని పర్లేదనిపించాడు అర్జున్. కానీ అక్కడక్కడా మంచి సీన్స్ పడుంటే సినిమా రేంజ్ మారిపోయుండేది.

చివరగా:
అక్కడక్కడా మాత్రమే ‘గుణ’వంతుడు..

More Related Stories