English   

సంక్రాంతికి 400 కోట్ల బిజినెస్.. మొగుళ్లు కుమ్మేసారుగా..

theter
2020-01-21 20:24:07

2020 సంక్రాంతిపై ముందు నుంచి కూడా భారీ అంచనాలున్నాయి. ఒకేసారి అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుండటంతో కచ్చితంగా రికార్డుల షేపులు మారిపోతాయని ముందునుంచి అంచనాలు వేసుకున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సంక్రాంతి సంచలనాలు సృష్టించింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందితే ఎలాంటి రికార్డులు సొంతం అవుతాయో కళ్లకు కట్టినట్లు చూపించాయి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలు. ఈ రెండూ కూడా తొలివారంలోనే 100 కోట్ల షేర్ వసూలు చేసి తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచాయి. ఇందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అల వైకుంఠపురంలో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 11 రోజుల్లో 120 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందంటే ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్లో అయితే ఏకంగా 3 మిలియన్ మార్క్ అందుకుంది అల్లు అర్జున్ సినిమా. ఇక మహేష్ బాబు కూడా తన స్థాయికి తగ్గ దూకుడు చూపించాడు. చాలా రోజుల తర్వాత పక్కా మాస్ సినిమాతో వచ్చిన సూపర్ స్టార్ రికార్డులు తిరగ రాస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా ఇప్పటి వరకు 110 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

ఈ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ గా మరో మెట్టు పైకి ఎక్కాడు అనిల్ రావిపూడి. 200 కోట్లకు పైగా గ్రాస్ తమ సినిమా వసూలు చేసిందని చిత్ర నిర్మాతలు అఫీషియల్ గా పోస్టర్ విడుదల చేశారు. మరోవైపు అల్లు అర్జున్ సినిమా కూడా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ రెండు సినిమాలు కలిపి ఈ సంక్రాంతికి 400 కోట్లకు పైగా వసూలు చేయడం తెలుగు సినిమాకు శుభపరిణామం. గత కొన్నేళ్లలో ఏ సంక్రాంతికి కూడా మన సినిమాలు ఇంతగా పర్ఫార్మ్ చేయలేదు. 2017లో ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి సినిమాలు సంక్రాంతికి వచ్చి విజయం సాధించాయి. 2016లో సోగ్గాడే చిన్నినాయన, ఎక్స్ ప్రెస్ రాజా, నాన్నకు ప్రేమతో సినిమాలు ఒకే పండక్కి వచ్చి విజయం సాధించాయి. ఇక ఇప్పుడు కూడా మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు పండక్కి సంచలనాలు సృష్టించాయి. మొత్తానికి 2020 సంక్రాంతి తెలుగు సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇదే దూకుడు రాబోయే సినిమాలు కూడా కంటిన్యూ చేస్తాయని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. ఏదేమైనా ఒక్క పండక్కి 400 కోట్లు వ్యాపారం జరగడం నిజంగానే గొప్ప విషయం.

More Related Stories