చిరంజీవి @ 42 ఏళ్ళ సినీ ప్రయాణం.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్..

ఆ పేరుకు ఇండస్ట్రీలో ఓ చరిత్ర ఉంది.. ఆయన కనబడితే బాక్సాఫీస్ దండయాత్ర ఉంది.. ఏ అండ లేకుండా వచ్చి.. ఎన్నో కోట్ల మందికి ఆదర్శంగా మారిన సుప్రీమ్ హీరో అతడు. ఒకప్పుడు ఆయన కోట్లలో ఒక్కడు.. అతడి స్వయంకృషే చేసింది కోటికి ఒక్కడు. నటనలో మగధీరుడు.. అందుకే ప్రేక్షకుల గుండెల్లో ఖైదీ అయ్యాడు. అభిమానులతో అన్నయ్య అని పిలిపించుకున్నా.. మాస్ ఇమేజ్ లో గ్యాంగ్ లీడర్ అనిపించుకోవాలన్నా.. తెలుగు సినిమాను పాతికేళ్ల పాటు శాసించిన హిట్లర్ అయినా.. టాలీవుడ్ కు కొత్త లెక్కలు నేర్పించిన మాస్టర్ అయినా.. అభినయంతో కంటతడి పెట్టించిన విజేత అయినా.. అన్నీ ఆయనే.. హీరోలెందరు ఉన్నా.. అగ్రపీఠంపై కూర్చున్న ఇంద్రుడు ఆయనే. పదేళ్లు గ్యాప్ ఇచ్చి వచ్చినా.. రికార్డులు ఆపని ఎవర్ గ్రీన్ మెగాస్టార్. తెలుగు ఇండస్ట్రీ చిరంజీవికి ముందు.. తర్వాత అనేంతగా మార్చేసాడు మెగాస్టార్. ఈయన ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 42 ఏళ్లు గడిచిపోయాయి. సెప్టెంబర్ 22.. 2020తో ఆయన నట జీవితానికి 42 ఏళ్లు నిండి.. 43వ ఏట అడుగేస్తున్నారు. చిరంజీవి నటించిన తొలి సినిమా పునాది రాళ్లు. కానీ విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. ఈ చిత్రం 1978, సెప్టెంబర్ 22న విడుదలైంది. కే వాసు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని క్రాంతికుమార్ నిర్మించారు.
తన సినిమా ప్రయాణం 42 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో చిరంజీవి కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. తన జీవితంలో ఆగస్టు 22కు ఎంత ప్రాముఖ్యత ఉందో.. సెప్టెంబర్ 22 కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అంటూ ట్వీట్ చేశాడు. ఆరోజు నేను పెడితే.. సెప్టెంబర్ 22న నటుడిగా మళ్ళీ పుట్టాను అంటున్నాడు చిరంజీవి. ప్రాణం ఖరీదు విడుదలై తనకు నటుడిగా మరో జన్మ ఇచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యాడు మెగాస్టార్.
ప్రాణం ఖరీదు తర్వాత పునాది రాళ్లు విడుదలైంది. ఎన్టీఆర్.. ఏఎన్నార్.. శోభన్ బాబు.. కృష్ణ లాంటి హేమాహేమీల మధ్యలో అనామకుడిగా వచ్చి.. అసామాన్యుడిగా ఎదిగాడు మెగాస్టార్. ఒక్కో ఇటుక పేర్చి ఇళ్లు కట్టినట్లు.. ఒక్కో సినిమాతో అభిమాన గణాన్ని పెంచుకున్నాడు. అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ కలల సౌధాన్ని నిర్మించుకున్నాడు చిరంజీవి. తొలి నాళ్లలో పునాది రాళ్లు.. ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్యా.. న్యాయం కావాలి లాంటి హిట్ సినిమాలు చేసిన చిరు.. ఖైదీతో స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ఏడాదికో ఇండస్ట్రీ హిట్ ఇస్తూ సుప్రీమ్ హీరో అయ్యాడు. పసివాడి ప్రాణంతో తొలిసారి తెలుగు ఇండస్ట్రీకి 5 కోట్ల మార్క్ చూపించాడు చిరంజీవి. ఆ తర్వాత యముడికి మొగుడు.. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలు కూడా కొత్త రికార్డులు సృష్టించాయి. తెలుగు ఇండస్ట్రీకి తొలి 10 కోట్లు.. 15 కోట్లు.. 20 కోట్లు.. 30 కోట్ల సినిమాలను పరిచయం చేసిన మగధీరుడు.. ఇవన్నీ సాధించింది ఒకే ఒక్కడు.
ఇక 90ల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి.. గ్యాంగ్ లీడర్.. ఘరానామొగుడు.. రౌడీఅల్లుడు.. హిట్లర్.. మాస్టర్.. బావగారు బాగున్నారా.. స్నేహం కోసం.. ఇలా ఎన్నని చెప్పాలి..? ఇక మిలీనియం మొదట్లోనే అన్నయ్య లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు మెగాస్టార్. ఆ తర్వాత ఇంద్ర.. ఠాగూర్.. శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి వరస విజయాలు అందించాడు. శంకర్ దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి.. అక్కడ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు చిరంజీవి. మళ్లీ పదేళ్ళ తర్వాత ఖైదీ నెం.150తో రీ ఎంట్రీ ఇచ్చి.. తన ఛరిష్మా ఏం తగ్గలేదని నిరూపించుకున్నాడు మెగాస్టార్. తాను సినిమాల్లో ఎప్పటికీ కింగ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. బాహుబలి కాకుండా 100 కోట్లు షేర్ సాధించిన తొలి హీరోగా చరిత్ర సృష్టించాడు. ఇక గతేడాది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో చేసిన సైరా కూడా 140 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటు మరో మూడు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చాడు చిరంజీవి.