బాహుబలి 5 ఏళ్లు.. రాజమౌళి సంచలనానికి అరదశాబ్ధం..

ఏంటి.. బాహుబలి వచ్చి అప్పుడే ఐదేళ్లు అయిపోయిందా అనే అనుమానాలు వస్తున్నాయి కదా.. కాలం ఎంత వేగంగా వెళ్లిపోతుందో అనడానికి ఇదే నిదర్శనం. ఇంకా ఆ సినిమా సంచలనాలు ఆగలేదు. నిన్నగాక మొన్న వచ్చినట్లు అనిపిస్తుంది. ఇప్పటికీ ఆ సినిమాపై చర్చ ఆగలేదు. కానీ అప్పుడే ఐదేళ్లు అయిపోయింది. జులై 10, 2015 న బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దాదాపు 5000 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా తొలిరోజు 50 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. రెండు రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది బాహుబలి. ఓవరాల్ గా 500 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు తిరగరాసింది బాహుబలి. అవార్డుల పరంగానూ బాహుబలి తిరుగులేని స్థానంలో నిలిచింది. జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డ్ అందుకుంది బాహుబలి. ఇక దేశీయ అవార్డుల విభాగంలో బాహుబలి సృష్టించిన అంచనాలకు అంతేలేదు. ఎన్నో అవార్డులు బాహుబలి సొంతం. ఇండియాలోనే కాదు.. చైనా, జపాన్, జర్మనీ ఇలా ఎన్నో దేశాల్లో బాహుబలి సంచలనాలు సృష్టించింది. బాహుబలికి సీక్వెల్ గా వచ్చిన రెండో భాగం కూడా చరిత్ర తిరగరాసింది. కానీ తొలిభాగం మాత్రం విజువల్ గా చాలా ముందు నిలిచింది. మొత్తానికి బాహుబలి బ్లాక్ బస్టర్ జర్నీకి ఐదేళ్లు పూర్తయ్యాయి.