గ్యాంగ్ లీడర్ ప్రివ్యూ.. నాని 50 కోట్ల మార్క్ అందుకుంటాడా..

న్యాచురల్ స్టార్ నాని, విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరికొన్ని గంటల్లో విడుదల కానుంది గ్యాంగ్ లీడర్. దీనికోసం నాని అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. పైగా జెర్సీ లాంటి ఎమోషనల్ ఎంటర్ టైనర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే జెర్సీ చాలా బరువైన సినిమా అయితే ఇది మాత్రం పూర్తిగా ఎంటర్ టైనర్.
విక్రమ్ కూడా ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల్లో గ్యాంగ్ లీడర్ పూర్తిగా కామెడీ ఎంటర్ టైనర్ అంటున్నాడు. ట్రైలర్ చూసినపుడే ఇదంతా అర్థమవుతుంది. ఇక ఇప్పుడు బిజినెస్ కూడా బాగానే జరిగింది. 29 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం.. నైజాంలో 8 కోట్లకు అమ్ముడైంది. ఓవర్సీస్ లో కూడా 5.50 కోట్లకు అమ్మడైంది గ్యాంగ్ లీడర్. కచ్చితంగా ఈ చిత్రంతో నాని మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడని ధీమాగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ కూడా డియర్ కామ్రేడ్ ఇచ్చిన షాక్ గ్యాంగ్ లీడర్ తీరుస్తుందని నమ్ముతున్నారు. బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాలో కార్తికేయ విలన్ గా నటించాడు. ఐదుగురు ఆడవాళ్లు తమ పగ తీర్చుకోడానికి మార్గాలు కావాలంటూ ఫేమస్ రివేంజ్ రైటర్ పెన్సిల్ పార్థసారథి అంటే నాని దగ్గరికి వస్తారు. వాళ్లకు సాయం చేసే క్రమంలోనే నిజంగానే విలన్ దేవ్ అంటే కార్తికేయతో వైరం పెట్టుకుంటాడు నాని. అప్పుడు అసలు కథ మొదలవుతుంది.
అసలు దేవ్ ఆ ఐదుగురు ఆడవాళ్లకు ఏం అన్యాయం చేసాడు. నాని వాళ్లకు ఎలా సాయం చేస్తాడనేది అసలు కథ. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నాడు. జెర్సీ సినిమా తర్వాత మరోసారి నాని సినిమాకు పని చేస్తున్నాడు అనిరుధ్. ఇక ఈ సినిమాకు విదేశీ సినిమాటోగ్రఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ పని చేస్తున్నాడు. మరోసారి ఈ చిత్రంతో సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు విక్రమ్ కే కుమార్. తన స్క్రీన్ ప్లే మార్క్ చూపించడానికి సిద్ధమవుతున్నాడు ఈ దర్శకుడు. హలో, 24 సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో నిరాశలో ఉన్నాడు విక్రమ్. మరి నాని సినిమాతో ఏం మాయ చేస్తాడో చూడాలిక. పైగా తన కెరీర్లో ఇప్పటి వరకు 50 కోట్ల షేర్ అందుకోలేదు నాని. ఈ సినిమాతో అది కూడా చేయాలని చూస్తున్నాడు.