English   

వేణు మాధవ్ 50వ జయంతి.. గుర్తు చేసుకున్న అభిమానులు..

Venu Madhav 50th jayanthi
2019-12-31 11:15:12

తెలుగు సినిమాలో ఎందరో కమెడియన్స్ ఉన్నారు. అందులో వేణుమాధవ్ ప్రముఖంగా చెప్పుకునే వ్యక్తి. ఆ నవ్వు ఆగిపోయి కూడా మూడు నెలలు దాటిపోయింది. ఆయన చనిపోయిన తరువాత తొలి జయంతి వచ్చింది. డిసెంబర్30న ఈయన 50వ జయంతి. దానంతో అభిమానులు ఆయన్ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. కొన్నేళ్లుగా ఏమైందో తెలియదు కానీ వరసగా కమెడియన్లు ఒక్కొక్కరుగా పరలోకానికి పయనం అవుతున్నారు. వేణుమాధవ్ కూడా అంతే. చనిపోయే ముందు కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధ పడ్డాడు. చికిత్స తీసుకుంటూ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఆయన యశోద హాస్పిటల్‌లో వెంటిలేటర్‌ సాయంతోనే ఉన్నారు. చివరివరకు ఆయన్ని బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆయన శరీరంలో కొన్ని అవయవాలు పని చేయడం మానేయడంతో చికిత్సకు కూడా స్పందించలేదు ఆయన. దాంతో మరణంతో పోరాడి ఓడిపోయాడు వేణు మాధవ్. గతంలోనూ ఈయన చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అదే నిజమైంది. దాంతో తెలుగు ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. 

300 సినిమాలకు పైగా నటించి తనదైన శైలిలో నవ్వించాడు వేణు మాధవ్. కాలేయ సంబంధ వ్యాధితో పాటు కిడ్నీ సమస్య కూడా తలెత్తడంతో.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు కూడా ఏం చేయలేకపోయారు. తెలుగులో వేణు మాధవ్ ది ప్రత్యేకమైన శైలి. ఆయన కామెడీలో చాలా వేరియేషన్ ఉంటుంది. తనకంటూ ప్రత్యేకమైన ఒరవడి సృష్టించుకున్నాడు వేణు. మిమిక్రీ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. అనతికాలంలోనే మంచి పేరు సంపాదించారు. కమెడియన్స్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముందు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఉన్న అభిమానంతో టీడీపి ఆఫీసులోనే టెలిఫోన్ బాయ్ గా కూడా పని చేసాడు వేణు. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నాడు. తెలుగుదేశంతోనే కడవరకు ఉన్నాడు. రాజకీయాల తర్వాత ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'సంప్రదాయం' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు వేణు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ' సినిమాతో వేణు మాధవ్ దశ తిరిగిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు వేణు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా 300లకు పైగా చిత్రాల్లో ఆయన నటించాడు. 

సైలో నల్లబాలు నల్లతాచు లెక్క.. నాకి సంపేస్తా అంటూ నవ్వించాడు. దిల్ లో అప్పట్లో భుట్టో ఇప్పుడు ముషారఫ్ అంటూ రప్ఫాడించాడు. పోకిరిలో బాబ్బాబూ అంటూ దుమ్ము దులిపేసాడు. ఇలా ఒకటా రెండా లక్ష్మీ సినిమాలో అయితే వేణు మాధవ్ కామెడీకి కడుపులు చెక్కలు కావడం ఖాయం. ఈ సినిమాతో నంది అవార్డు కూడా అందుకున్నాడు వేణు మాధవ్. 300 సినిమాల్లో 100 సినిమాలకు పైగా ఈయన పాత్రలు అలా గుర్తుండిపోయాయి ప్రేక్షకులకు. కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అనారోగ్యం కారణంగా వెండితెరకు దూరంగా బతుకుతున్నాడు వేణు. ఇప్పుడు ఉన్నట్లుండి ఈయన మరణవార్త వినాల్సి రావడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా ఆయన చేసిన సినిమాలు మాత్రం ఎప్పుడూ వేణును మన మధ్యే ఉంచేలా చేస్తాయి.  

More Related Stories