50 లక్షలు పెట్టి కథ కొన్న నాని

నాచురల్ స్టార్ నాని తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘శ్యామ్ సింగరాయ్’ అనే టైటిల్ తో ఈ సినిమాని టాక్సీవాలా ఫేం దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నానికి 27వ సినిమా. పీరియాడికల్ మూవీగా చెబుతున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.
అదేంటంటే ఈ సినిమా కధ కోసం నాని ఏకంగా 50 లక్షలు ఖర్చు పెట్టినట్టు చెబుతున్నారు. ఎందుకంటే ఈ కథ రాహుల్ ది కాదట. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఆడియో కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి ఈ కథను రాసుకున్నాడట. ఆయనే ఈ కథని నానికి వినిపించగా నానికి బాగా నచ్చిందట. అయితే ఆయనకి ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వలన నాని నచ్చచెప్పి ఈ సినిమాని కొనుక్కున్నాడని అంటున్నారు.
టాక్సీవాలా తీసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాహుల్ ని పిలిచి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నానికి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నట్టు చెబుతున్నారు. అందులో ఒక హీరోయిన్ పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించినట్లు చెబుతున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.