ఇది అల్లు వారి రామాయణం.. 500 కోట్లతో భారీ సినిమాకు శ్రీకారం..

తెలుగు ఇండస్ట్రీలో భారీ సినిమాలకు పెట్టింది పేరు అల్లు అరవింద్. అసలు ఇండస్ట్రీ మార్కెట్ 40 కోట్లు సరిగ్గా లేని సమయంలోనే మేనల్లుడు రామ్ చరణ్ తో 40 కోట్లతో మగధీర సినిమా చేసాడు అల్లు అరవింద్. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే తెలుగులో భారీ సినిమాలు వచ్చాయి. ఇక ఈ మధ్యే మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం చేసుకున్నాడు మెగా నిర్మాత. ఏకంగా 500 కోట్లతో రామాయణం నిర్మించబోతున్నట్లు అనౌన్స్ చేసాడు. ఈయనకు తోడు మధు మంతెన, నమిత్ మల్హోత్రా కూడా నిర్మాణంలో భాగం పంచుకోనున్నారు. 3డిలో రామాయణం తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు అల్లు అరవింద్.
రామాయణం అనౌన్స్ అయి చాలా రోజులు దాటేసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనేది కూడా చెప్పాడు ఈయన. దంగల్ లాంటి సంచలన సినిమా తెరకెక్కించిన నితీష్ తివారితో పాటు మామ్ సినిమాను తెరకెక్కించిన రవి ఉడయార్ తెరకెక్కించబోతున్నారు. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రం తొలి పార్ట్ 2021లో విడుదల కానుంది. రామాయణం లాంటి మహాకావ్యం సినిమాగా తెరకెక్కించాలంటే చిన్న విషయం కాదు. కానీ దీనికి ముహూర్తం పెడుతున్నాడు అల్లు అరవింద్. అన్నీ కుదిర్తే.. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. రామాయణాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన ప్రేక్షకులకు.. అల్లువారి రామాయణం ఎలా ఉండబోతుందో చూడాలి..!