English   

మనం 6 ఏళ్లు.. ఈ చిత్రం వెనక అసలు కథ తెలుసా..

manam
2020-05-23 16:50:59

మనం.. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే ఓ అద్భుతమైన దృశ్యకావ్యం. అక్కినేని కుటుంబం అంతా కలిసి నటించిన కుటుంబ కథా చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు లాంటి లెజెండరీ నటుడికి ఘనమైన నివాళి ఈ చిత్రం. ఆయన సుధీర్థ సినిమా ప్రయాణానికి అందమైన వీడ్కోలు ఈ చిత్రం. ఏఎన్నార్ మరణించిన నాలుగు నెలల తర్వాత విడుదలైంది మనం సినిమా. 2014 మే 23న విడుదలైన ఈ చిత్రానికి నేటితో సరిగ్గా ఆరేళ్లు గడిచాయి. అయితే ఈ చిత్రం వెనక అందమైన కథ కూడా ఉంది. అప్పటికే తెలుగులో యిష్టం.. హిందీలో 13బి లాంటి సినిమాలు చేసి గుర్తింపు కోసం పాకులాడుతున్న దర్శకుడు విక్రమ్ కే కుమార్. నితిన్ కు వరసగా 12 ఫ్లాపుల తర్వాత ఇష్క్ రూపంలో హిట్ ఇచ్చాడు. 2012లో విడుదలైన ఈ చిత్రం సందడి లేకుండా వచ్చి సంచలనం విజయం సాధించింది. ఇష్క్ తర్వాత విక్రమ్ కు తెలుగు నుంచి చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం తొందర పడలేదు.మంచి అవకాశాలు వచ్చినా కూడా అద్భుతమైన కథ సిద్ధం చేయడానికి రెడీ అయ్యాడు విక్రమ్ కే కుమార్. 

ఈ క్రమంలోనే ఇష్క్ సినిమాకు మాటలు రాసిన హర్ష వర్ధన్ తో కలిసి ఓ లైన్ అనుకున్నాడు విక్రమ్. అయితే అది ఎవరికి చెప్పాలో తెలియక.. తను ఇష్క్ చేసిన నితిన్ కే వెళ్లి చెప్పాడు విక్రమ్ కే కుమార్. అయితే కథ విన్న తర్వాత నితిన్ కు కూడా బాగా నచ్చేసింది. కానీ అది తనకు సూట్ కాదని ముందు నుంచే అనుకున్నాడు నితిన్. అక్కడే ఉన్న నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మాత్రం ఈ కథ ఎవరికి సరిపోతుందో తనకు తెలుసు అంటూ వెంటనే నాగార్జునకు ఫోన్ చేసాడు. ఇష్క్ దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఇప్పుడు మాకు ఓ కథ చెప్పాడు.. అది మీ కుటుంబానికి బాగా సరిపోతుంది ఓ సారి వినండి అంటూ నాగ్ కు రిఫర్ చేసాడు సుధాకర్ రెడ్డి. సరే రమ్మనండి అంటూ విక్రమ్ ను పిలిచాడు నాగార్జున. వెళ్లిన వెంటనే సింగిల్ సిట్టింగ్ లో కథను ఓకే చేసాడు. తన తండ్రి చివరి సినిమా ఇదే అవుతుందని నాగార్జునకు ముందే తెలుసు.

అలాంటి తమ కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే కథను తీసుకొచ్చావంటూ విక్రమ్ కు ఇప్పటికే కొన్ని వేలసార్లు కృతజ్ఞతలు చెప్పాడు నాగార్జున. కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి.. స్క్రీన్ ప్లే రాసి దాన్ని అందమైన దృశ్యకావ్యంగా మలిచాడు విక్రమ్ కే కుమార్. ఒకే సినిమాలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ కలిసి నటించడం అనేది చిన్న విషయం కాదు. ఇక కోడలు కాకముందే సమంత కూడా ఇందులో భాగం అయిపోయింది. అమల అక్కినేని కూడా చిన్న పాత్రలో మెరిసింది. ఇలా ఓ కుటుంబం అంతా కలిసి నటించిన ఈ చిత్రం తెలుగులో ఎప్పటికీ నిలిచిపోయే సువర్ణాధ్యాయమే. మనం సినిమా వచ్చిందంటే దానికి కారణం నితిన్.. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి అన్నమాట. మనం ఈ రోజు చూసిన మనం సినిమా వెనక ఇంత పెద్ద కథ ఉంది మరి. అందుకే అంటారు అద్భుతాలు ఊరికే రావని. ఆ రోజు నితిన్ ఈ కథ తానే చేస్తానని చెప్పుంటే హిట్ అయ్యుండేదేమో.. కానీ ఇంతగా చరిత్ర మాత్రం సృష్టించేది కాదు.

More Related Stories