English   

ఈ ప్యాన్ ఇండియన్ సినిమాల్లో దేనికి ప్రేక్షకుల ఓటు..

RRR rajamouli
2020-10-30 11:25:20

ఒకప్పుడు మన హీరోలంతా తెలుగు ప్రేక్షకులను అలరిస్తే చాలు.. ఇక్కడ విజయం అందుకుంటే చాలు కానీ ఆశపడే వాళ్ళు. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో.. అప్పట్నుంచి నుంచి మన దర్శకులు హీరోలు ఆలోచన శైలి మారిపోయింది. తెలుగు సినిమాలకు ఇతర భాషల్లో కూడా మంచి డిమాండ్ వుందని తెలుసుకున్న తర్వాత పాన్ ఇండియా కథల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహారెడ్డి తెలుగులో తప్ప అన్ని భాషల్లో డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు బాలీవుడ్ ను ఎక్కువగా ఫోకస్ చేసి సాహో సౌత్ లో డిజాస్టర్ అయ్యింది. పాన్ ఇండియా కథలు అనుకుంటూ వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కావడం లేదు. బాహుబలికి మాత్రమే అది సాధ్యమైంది.

ఆ సినిమా అండ చూసుకొని ఇప్పుడు మన హీరోలు చాలామంది పాన్ ఇండియా వైపు పరుగులు తీస్తున్నారు. మంచు మనోజ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, నితిన్ లాంటి హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో తమ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. తక్కువ మార్కెట్ ఉన్న హీరోలు కూడా ప్యాన్ ఇండియన్ కథల వైపు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తోడు దర్శక ధీరుడు అండగా ఉన్నాడు. అయితే మిగిలిన సినిమాలపై మాత్రం అంతగా అంచనాలు కనిపించడం లేదు. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ఫైటర్ సినిమా కూడా ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది.

ఇక మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి కూడా అన్ని భాషల్లో విడుదల కానుంది. తాజాగా ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా అన్ని భాషలపై ఫోకస్ చేశారు. దాంతోపాటు రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలు కూడా ఫ్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్నాయి. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో వస్తున్న సినిమాను ఇండియా అంతా కూడా విడుదల చేయాలని ప్లాన్ చేసినా బడ్జెట్ మరీ ఎక్కువ అవుతుండటంతో వెనక్కి తగ్గుతున్నారు నిర్మాతలు. మరోవైపు కేజీఎఫ్ 2 గురించి ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో అన్ని భాషల్లోకి వెళ్తున్నాడు. నితిన్ కూడా చల్ మోహన్ రంగా దర్శకుడు చైతన్య కృష్ణతో పవర్ పేట అనే సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇది దాదాపు 80 కోట్లకు పైగానే బడ్జెట్ తో రెండు భాగాలుగా వస్తుందని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ప్రస్తుతం తెలుగులో ప్యాన్ ఇండియన్ సినిమాల హవా ఎక్కువగా కనిపిస్తుంది. మరి వీటిలో ఏది ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
 

More Related Stories