గబ్బర్ సింగ్ @8 ఏళ్ళు.. పవన్ కళ్యాణ్ సంచలనం..

కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు దుమ్ము రేగ్గొట్టడానికి.. మార్కెట్లో అతడి ఫాలోయింగ్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది.. పదేళ్లు వరస ఫ్లాపులు వచ్చిన తర్వాత కూడా ఏ హీరోకైనా ఇలాంటి డైలాగులు రాస్తే నవ్వుతారు.. కానీ పవన్ విషయంలో అలా కాదు. పాటొచ్చి పదేళ్లైనా పవర్ తగ్గలేదన్నా ఆయనే.. నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పినా ఆయనే. అన్ని ఫ్లాపుల తర్వాత కూడా సంచలనం సృష్టించాడు పవర్ స్టార్. అందుకే ఆయన పవన్ కళ్యాణ్.. ఈ ఉపోద్ఘాతం అంతా గబ్బర్ సింగ్ కోసమే అని అర్థమైంది కదా.. ఈ సినిమా వచ్చి అప్పుడే 8 ఏళ్లైంది.. కానీ ఇప్పటికీ ఇంతే కొత్తగా ఉంది. అదే మరి పవన్ కళ్యాణ్ అంటే. ఆరు నుంచి అరవై వరకు గబ్బర్ సింగ్ తో ఊపేసాడు పవర్ స్టార్. పన్నెండేళ్ళ తర్వాత పవన్ కు అసలు సిసలైన నిఖార్సైన విజయం ఇది. ఇదొచ్చి ఎనిమిదేళ్లవుతుంది.
తెలుగు ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకున్న గబ్బర్ సింగ్ వచ్చి అప్పుడే 8 ఏళ్ళైయింది. నిన్నగాక మొన్నొచ్చినట్లే అనిపి స్తున్న ఈ చిత్రం వచ్చి అరదశాబ్ధం దాటేసి.. పై నుంచి మూడేళ్లు అయిపోయింది. 2012 మే 11న ఈ చిత్రం విడుదలైంది. అప్పట్లోనే ఈ చిత్రం 69 కోట్ల షేర్ వసూలు చేసింది. పవన్ ఇమేజ్ తో పాటు హరీష్ శంకర్ టేకింగ్.. అంత్యాక్షరి ఎపిసోడ్.. కబడ్డి ఎపిసోడ్.. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు అన్నీ సూపర్ గా కలిసొచ్చాయి. అప్పటి వరకు వరస ప్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్.. ఈ చిత్రంతో బాక్సాఫీస్ పైకి తన పంజా విసిరాడు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ మార్కెట్ మళ్లీ అలా అలా పెరిగిపోయింది. అత్తారింటికి దారేదితో మరోసారి రికార్డులు సృష్టించాడు ఈ హీరో. ఇక నిర్మాత గణేష్ కూడా ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ గణేష్ అయిపోయాడు. మొత్తానికి ఈ 8 ఏళ్ల విజయం 80 ఏళ్ల విజయం అయినా కూడా అప్పటికీ గబ్బర్ సింగ్ మాత్రం ఇంతే నిత్యనూతనంగా ఉంటాడేమో మరి..?