English   

పాపం... బన్నీ మళ్ళీ ఇరుక్కున్నాడు

A lot of Satires Coming on Allu Arjun Through Social Media
2018-08-22 22:59:50

నోటిమాట‌.. తుపాకి తూటా చాలా డేంజ‌ర్. ఒక్క‌సారి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత ఏమీ చేయ‌లేం. అందుకే ఏదైనా మాట్లాడే ముందు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించాలంటారు పెద్ద‌లు. కానీ బ‌న్నీ మాత్రం అదేం ఆలోచించ‌డు. పాపం అనాల‌ని కాదు కానీ అప్ప‌టికి ఆవేశంలో ఏదో అనేస్తాడు. ఆ త‌ర్వాత ఆ మాట‌ల నుంచి వ‌చ్చే ఇబ్బందులు తెలుసుకుంటాడు. ఇక అప్పుడు చేసేదేం ఉండ‌దు. తీరిగ్గా కూర్చుని ఎందుకు అప్పుడు అలా అన్నాన‌ని బాధ ప‌డ‌టం త‌ప్ప‌. అస‌లే ఇది ఇండ‌స్ట్రీ.. ఇక్క‌డ కాస్త నోరు జారితే దాన్ని పెంచి పెంటంత చేస్తారు. అందుకే ఏం మాట్లాడినా కూడా ఒక‌టికి వంద‌సార్లు ఆలోచించాలి. అందులోనూ అల్లుఅర్జున్ లాంటి హీరో అయితే ఇంకాస్త ఆలోచించాలి.

తాజాగా ఈయ‌న చిరంజీవి బ‌ర్త్ డే వేడుక‌ల్లో పాల్గొన్నాడు. ఆయ‌న‌తో పాటు అంద‌రూ వ‌చ్చారు ఈ వేడుక‌కు.. ఒక్క చిరు త‌ప్ప‌. అయితే ఈ కార్య‌క్ర‌మంలో అభిమానుల‌ను చూసిన ఆనందంలో బ‌న్నీ కాస్త ఎక్కువే మాట్లాడేసాడు. చిరంజీవి ఎందుకు రాలేద‌ని ఎవ‌రో మీడియా ప‌ర్స‌న్ పొద్దున అడిగిన ప్ర‌శ్న‌ను గుర్తు చేసుకుని మ‌రీ సమాధానం ఇచ్చాడు బ‌న్నీ. సినిమాలో హీరో ఎంట్రీ ముందే ఉంటుంది.. కానీ ఇక్కడ మాత్రం చివ‌ర్లో ఉంటుంది. చిరంజీవి గారు ఎప్పుడు రావాలో.. ఎక్క‌డికి రావాలో ఆయ‌న‌కు బాగా తెలుసు. వ‌చ్చిన‌పుడు అదిరిపోతుందంటూ కామెంట్ చేసాడు. అంటే ఇప్పుడు ప్ర‌మోష‌న్ కు వ‌చ్చే హీరోలంతా తెలివి త‌క్కువ వాళ్లా లేదంటే వాళ్ల‌కేం ప‌ని లేదా..? బ‌న్నీ మాట‌ల్లో ఇలాంటి అర్థాలే వ‌స్తున్నాయిప్పుడు.

బ‌న్నీ ఇలా నోరుజార‌డం ఇదే తొలిసారి కాదు.. మొన్న గీత‌గోవిందం ఆడియో వేడుక‌లో ఇదే చేసాడు బ‌న్నీ. త‌న‌కు తెలియ కుండానే ఇరుక్కున్నాడు. నిజానికి ఇత‌ర హీరోల‌ను కానీ.. చిరంజీవిని కానీ త‌క్కువ చేయాల‌ని కాదు కానీ ఏదో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను పొగిడే క్ర‌మంలోనే కొన్ని కామెంట్స్ చేసాడు బ‌న్నీ. ఇవే ఇప్పుడు ఈయ‌న్ని దోషిగా మార్చేసాయి. మ‌రోసారి మెగా ఫ్యాన్స్ దృష్టిలో విల‌న్ గా మార్చేసాయి. గీత‌గోవిందం ఆడియో వేడుక‌లో మాట్లాడుతూ అర్జున్ రెడ్డి చూసిన త‌ర్వాత తాను వారం వ‌ర‌కు బ‌య‌టికి రాలేద‌ని.. ఈ సినిమా చూసిన త‌ర్వాత ఫిల్మ్ ఫేర్ అవార్డ్ విజ‌య్ కు త‌ప్ప మ‌రో హీరోకు వ‌స్తే అన్యాయం జ‌రిగిన‌ట్లే అనుకున్నానని చెప్పాడు.

మిగిలిన వాళ్లు కూడా బాగానే చేసినా అది విజ‌య్ కు వ‌చ్చిన‌పుడే వ్యాల్యూ అన్నాడు అల్లుఅర్జున్. ఇదే ఇప్పుడు చిరంజీవి అభిమానుల‌కు కాలేలా చేస్తుంది. ప‌దేళ్ల త‌ర్వాత చిరు న‌టించిన ఖైదీ నెం.150 కూడా నామినేష‌న్స్ లో ఉంది. చిరంజీవి ఉత్త‌మ న‌టుడి కేట‌గిరీలో నామినేట్ అయ్యాడు. అందులో చిరంజీవి కూడా ఉన్న విష‌యం తెలిసి మ‌రీ విజ‌య్ ను అంత‌గా ఎలా పొగుడుతున్నాడు బ‌న్నీ అంటూ సోష‌ల్ మీడియాలో బ‌న్నీపై ఫ్యాన్స్ ర‌చ్చ చేస్తున్నారు. అస‌లిది ప‌ట్టించు కోవాల్సిన పనేలేదంటూ కొంద‌రు కొట్టి పారేస్తుంటే.. బ‌న్నీ అయినా కాస్త చూసుకుని మాట్లాడాల్సింది అంటూ అత‌డికి కూడా చివాట్లే పెడుతున్న వాళ్లు మ‌రికొంద‌రు. ఇలా ప్రతిసారి ఏదో దాంట్లో ఇరుకుంటున్నాడు బన్నీ.

More Related Stories