English   

ఆ గ‌ట్టునుంటావా.. సిట్టిబాబు సించేసాడు..!

Ram-charan
2018-05-08 18:02:29

సినిమా వ‌చ్చి నెల రోజులు దాటేయ‌డంతో ఒక్కొక్క‌టిగా వీడియో సాంగ్స్ ను విడుద‌ల చేస్తున్నారు రంగ‌స్థ‌లం టీం. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి ఎంత స‌క్క‌గున్న‌వే.. రంగ‌మ్మ మంగ‌మ్మ పాటలు విడుద‌ల‌య్యాయి. వీటికి రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు మ‌రో పాట కూడా వ‌చ్చేసింది. అదే ఆ గ‌ట్టునుంటావా అంటూ సాగే పాట. నిజానికి ఈ పాట వెన‌క ఓ వివాదం కూడా ఉంది. అస‌లు కాంట్ర‌వ‌ర్సీల‌కు దూరంగా ఉండే దేవీ శ్రీ ప్ర‌సాద్.. ఈ పాట‌తో లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చుకున్నాడు. సినిమాలో ఈ పాట‌ పాడింది దేవీ.. కానీ ఆల్బ‌మ్ లో మాత్రం జాన‌ప‌ద గాయ‌కుడు శివ‌నాగులు. విడుద‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా ఈ పాట‌ శివ‌నాగులు వాయిస్ తోనే ఉంటుందనుకున్నారంతా. కానీ స‌డ‌న్ గా విడుద‌లైన త‌ర్వాత అది దేవీ శ్రీ ప్ర‌సాద్ స్వ‌రంతో రావ‌డం అంద‌రికీ షాకిచ్చింది. 

దానికి ఏదో టెక్నిక‌ల్ కార‌ణాలున్నాయ‌ని చెప్పాడు సుకుమార్. కానీ త‌న‌కు చెప్ప‌కుండా వాయిస్ మార్చేసారంటూ శివ‌నాగులు వాపోయాడు కూడా. అయితే అల్బ‌మ్ లో మాత్రం ఎప్ప‌టికీ శివ‌నాగులు పేరుతో పాటు ఆయ‌నే వాయిసే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసాడు సుకుమార్. ఇప్పుడు ఈ పాట దేవీ వాయిస్ తో విడుద‌లైంది. వీడియో సాంగ్ లో దేవీ వాయిస్ ఉన్నా.. ఆడియోలో మాత్రం శివ‌నాగులు పేరు అలాగే ఉంది. గ‌త రెండు పాట‌ల కంటే కూడా ఆ గ‌ట్టునుంటావా పాట‌కు రెస్పాన్స్ అయితే అదిరిపోతుంది. ముఖ్యంగా చ‌ర‌ణ్ మాస్ డాన్సుల‌కు పిచ్చెక్కిపోతున్నారు అభిమానులు.

ఆరు వారాలు కావ‌డంతో లైఫ్ టైమ్ ర‌న్ కు చేరువ‌లో ఉంది రంగ‌స్థ‌లం. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం 121 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అమ్మింది 78 కోట్ల‌కే. అంటే ఇప్ప‌టికే 43 కోట్ల లాభాలు తీసుకొచ్చాడు సిట్టిబాబు. తెలుగు రాష్ట్రాల్లో 90 కోట్లకు చేరువ‌గా వ‌చ్చింది ఈ చిత్రం. నాన్ బాహుబ‌లిలో ఏ సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల షేర్ అందుకోలేదు. కానీ మెగా వార‌సుడు చేసి చూపించాడు. మ‌ధ్య‌లో భ‌ర‌త్ వ‌చ్చినా.. నా పేరు సూర్య వ‌చ్చినా.. కృష్ణార్జునులు వ‌చ్చినా ఎవ‌రూ సిట్టిబాబు దూకుడు ఆప‌లేక‌పోయారు. ఇండియా, ఓవ‌ర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఆల్ టైమ్ రికార్డుల‌ను సెట్ చేసాడు సిట్టిబాబు. వీటిని కొల్ల‌గొట్టాలంటే మ‌ళ్లీ ఆ స్థాయి బ్లాక్ బ‌స్ట‌ర్ రావాల్సిందే..!

More Related Stories