ఆవిరి రివ్యూ

సస్పెన్స్ హారర్ తో కూడిన సినిమాలను తెరకెక్కించడంలో రవిబాబు చేయితిరిగిన వాడు. గతంలో ఆయన రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ అవును తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 'అవును 2' తరువాత ఈ జోనర్ లో సినిమా చేయని ఆయన మళ్ళీ ఆవిరితో మన ముందుకు వచ్చాడు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో ఈ సినిమా శుఖ్రవారం విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం.
కథ :
రాజ్ కుమార్ (రవిబాబు) పెద్ద బిజినెస్ మేన్. చింతా చీకు లేని కుటుంబం. భార్య ఇద్దరు పిల్లలతో హాయిగా గడుస్తుంటుంది. వారికి శ్రేయ, మున్ని అనే ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు. ఆ ఇద్దరికి కూడా ఆస్తమా ఉంటుంది. అయితే ఒకరోజు స్విమ్మింగ్ పూల్‌లో ఇద్దరూ స్విమ్ చేస్తుంటారు. అయితే ఆ టైమ్‌లో శ్రేయ కి ఊపిరి అందక ఆమె చనిపోతుంది. ఆ అమ్మాయిని మరచిపోలేక రాజ్ భార్య లీనా(ప్రియ) మానసికంగా కుంగిపోతుంటుంది. ఆ జ్ఞాపకాలకు దూరం కావాలనే ఉద్దేశంతో, రెండవ కూతురైన 'మున్నీ'ని తీసుకుని మరో ఇంటికి మారతారు. ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే మున్నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆమెకి ఒక ఆత్మ కనిపిస్తుంటుంది. ఆ ఆత్మ మాటవిని ఇంట్లోనుండి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆమెని ఆపడానికి రాజ్, లీనా చాలా ప్రయత్నిస్తారు కానీ మున్ని మాత్రం ఇంట్లో నుండి మాయం అవుతుంది. మున్ని ఏమయ్యింది అని వెదికే క్రమంలో లీనాని కూడా ఆత్మ ఆవహిస్తుంది. రాజ్ గురించి కూడా అనేక ఆసక్తికర విషయాలు బయటపడతాయి. ఇంతకీ మున్నికి కనిపించిన ఆత్మ ఎవరిది? మున్నీని ఆ ఆత్మ ఎక్కడికి తీసుకెళ్లింది?, లీనాని ఆవహించిన ఆత్మ ఎవరిది?, అది రాజ్ పై ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంటుంది?, అసలు ఈ కథకి ఆవిరి అనే టైటిల్ ఎందుకు పెట్టారు? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి.
విశ్లేషణ :
ఇది హారర్ సినిమా కాదు థ్రిల్లర్ అనచ్చు. తండ్రి నిర్లక్ష్యం వల్ల ఒక కూతురు చనిపోతుంది. మిగిలి బిడ్డనైనా జాగ్రత్తగా కాపాడుకోవాలని తల్లి ప్రయత్నిస్తుంటుంది. అందులో తల్లి ప్రేమను చూపి, సంపాదన కోసం బిజీగా ఉంటూ పిల్లలను పట్టించుకోకపోతే వాళ్లు ఎలా ఫీలవుతారనే విషయాన్ని చెప్పే సోషల్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే అది ప్రేక్షకులకు అర్థమయి కానట్టు ఉంటుంది. ఆత్మతో మాట్లాడుతూ ఇంట్లో నుంచి వెళ్లేందకు మున్ని పదే పదే ప్రయత్నించే సన్నివేశాలతో ఫస్ట్ ఆఫ్ నెమ్మదిగా సాగుతుంది. అసలు కథ సెకండాఫ్‌లోనే మున్నీ మిస్ అవడంతో రాజ్ స్నేహితుడు పోలీసాఫీసర్, అతని డాక్టర్ ఫ్రెండ్ ఎంటర్ అవ్వడంతో కథనం కాస్త ముందుకు వెళ్తుంది. రాజ్ నిర్లక్ష్యం వల్లే అతని పెద్ద కూతురు చనిపోయిందని తెలుసుకున్న డాక్టర్ మున్నీ మిస్సింగ్ కేసును హ్యాండిల్ చేసే విధానం బాగుంది. ఇక్కడ రైటర్ సక్సెస్ అయినట్టే అలా లీనానే మున్నీని దాచేసిందని కనిపెట్టడం, రాజ్ పై లీనా దాడి చేయడం, లీనాలో ఉన్న ఆత్మ ఎవరిదో తెలుసుకోవడంతో ఊహించని ట్విస్ట్ వచ్చి దాంతో క్లయిమాక్స్ ప్రేక్షకుల ఊహకు అందుతుంది.
ఎవరెలా చేశారంటే ?
రవిబాబు చాలా ఈజీగా నటించేశాడు. కామెడీ పండించడానికి ట్రై చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. సినిమా మొత్తం సీరియస్ లుక్‌లోనే కనిపించాడు రవిబాబు. ఇక లీనా పాత్రలో నటించిన నెేహా చౌహాన్ ఫస్ట్ హాఫ్‌లో పర్వాలేదు అనిపించినా దెయ్యం పట్టిన పాత్రలో మాత్రం చికాకు తెప్పించింది. రాజ్, లీనా, మున్నీల చుట్టే కథ తిరిగినా.. అప్పుడప్పుడూ వచ్చే పోలీస్ పాత్ర డాక్టర్ జాన్వీ పాత్రలు బాగా ఆకట్టుకుంటాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిది మేర బాగా నటించారు.
టెక్నీషియన్స్ :
కెమెరామెన్ కెమెరా పనితనం హార్రర్ సన్నివేశాలల్లో బాగుంది. సంగీతం ఆకట్టుకోలేదు. ఎడిటర్ దర్శకుడు ఏది చెబితే అది కట్ చేసుకుంటూ వెళ్ళిన్నట్లు అనిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.
ఫైనల్ గా : ఆవిరి...ఆకట్టుకోని థ్రిల్లర్..!!
రేటింగ్: 2 /5