English   

అభిమ‌న్యుడు రివ్యూ

Abhimanyudu Review
2018-06-01 08:38:22

ఒక‌ప్పుడు ఊర మాస్ సినిమాలు చేస్తూ రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ హీరోగా ముద్ర వేయించుకున్నాడు విశాల్. కానీ ఈ మ‌ధ్య ఈయ‌న సినిమాల్లో క‌థ చాలా కొత్త‌గా ఉంటుంది. ఏం చేసినా కూడా అందులో సందేశం కూడా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఈయ‌న చేసిన అభిమ‌న్యుడు కూడా అలాంటి క‌థే. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది..? 

క‌థ‌: క‌ర్ణాక‌ర్ (విశాల్) ఇండియ‌న్ మిల‌ట‌రీలో మేజ‌ర్. అయితే కోపంతో సీనియ‌ర్ ఆఫీస‌ర్స్ తో ఎప్పుడూ తిట్లు తింటుంటాడు. ఓ సారి బ్యాంక్ ఉద్యోగిని కొట్టినందుకు గానూ మిల‌ట‌రీ నుంచి స‌స్పెండ్ చేస్తూ.. సైక్రియాటిస్ట్ ద‌గ్గ‌రికి క్లీన్ చీట్ కోసం పంపిస్తారు సీనియ‌ర్ ఆఫీస‌ర్స్. అలా డాక్ట‌ర్ ల‌తాదేవి (స‌మంత‌)తో క‌ర్ణ‌కు ప‌రిచ‌యం అవుతుంది. తాను సంత‌కం పెట్టాలంటే ఊరికి వెళ్లి రావాల‌ని కండీష‌న్ పెడుతుంది ల‌తాదేవి. అదే స‌మ‌యంలో చెల్లి పెళ్లి కోసం బ్యాంక్ లోన్ తీసుకుంటాడు క‌ర్ణ‌. కానీ వ‌చ్చిన డ‌బ్బుల‌న్నీ మ‌రుక్ష‌ణంలో మాయ‌మైపోతాయి. అలా తాను ఒక్క‌డే కాదు.. వేలాది మంది డ‌బ్బును అక్ర‌మంగా త‌మ‌కే తెలియ‌కుండా దొంగిలిస్తుంటాడు వైట్ డెవిల్ అలియాస్ స‌త్య‌మూర్తి(అర్జున్). అక్క‌డ్నుంచి త‌న డ‌బ్బుతో పాటు అంద‌రి డ‌బ్బును క‌ర్ణ ఎలా తీసుకొచ్చాడు అనేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం: బ్యాంకుల్ని మోసం చేసి లోన్ లు తీసుకోవ‌డం.. లేని ఆస్తుల్ని చూపించి రుణాలు అందుకోవ‌డం.. ఇవ‌న్నీ నిత్యం జ‌రిగే ప‌నులే. బ్యాంకులు ఏం చెక్ చేస్తాయిలే అనుకుంటూ అంతా ఈ సోష‌ల్ క్రైమ్స్ చేస్తుంటారు. ఇదే నేప‌థ్యానికి డిజిట‌ల్ క్రైమ్ ను అద్దుకుని మిత్ర‌న్ రాసుకున్న క‌థే ఈ అభిమ‌న్యుడు. ఇది సినిమా కాదు.. మ‌న జీవిత‌మే. రోజూ మ‌న లైఫ్ లో జ‌రిగే చాలా సంఘ‌ట‌న‌లే సినిమాలో క‌నిపిస్తుంటాయి. మ‌నం ఓ బ్యాంక్ వెళ్తాం.. అక్క‌డ లోన్ రాదు.. ఏదో దొంగ డాక్యుమెంట్ల‌తో ఆ లోన్ తీసుకుంటాం. ఆ త‌ర్వాత తిప్ప‌లు ప‌డ‌తాం. స్మార్ట్ ఫోన్ ఉంది క‌దా అని ప్ర‌తీ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటాం. ఆ త‌ర్వాత ఆ యాప్ నుంచి మ‌న వివ‌రాల‌న్నీ ఎవ‌డికో వెళ్ళిపోతాయి. ఆధార్ కార్డ్ కోసం తీసుకునే ఫోటోలో కూడా మ‌న జీవితం ఉంటుంది. మ‌న‌కు తెలియ‌కుండానే ఇలా చేసే ఎన్నో ప‌నులు సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు ఆస‌ర‌గా మారుతున్నాయి. ఇదే ఈ చిత్రం క‌థ‌. డిజిట‌ల్ క్రైమ్.. సైబ‌ర్ నేర‌గాళ్లు అనే పెద్ద నెట్ వ‌ర్క్ ను ఈ చిత్రంలో చూపించాడు ద‌ర్శ‌కుడు మిత్ర‌న్. ఇలాంటి క‌థ‌ను చెప్పాలంటే అంత చిన్న విష‌యం కాదు.. దానికి స్క్రీన్ ప్లే చాలా ప‌క్కాగా ఉండాలి. 

ముఖ్యంగా తొలి సీన్ నుంచే సైబ‌ర్ క్రైమ్ ఎలా సాగుతుందో ప‌క్కాగా చూపించాడు ద‌ర్శ‌కుడు. దాంతో ప్రేక్ష‌కుల బుర్ర కూడా క్లీన్ అయిపోయింది. అక్క‌డ్నుంచీ క‌థ తిరిగే మ‌లుపులు చూస్తుంటే.. థియేట‌ర్స్ లో చూస్తున్న ప్రేక్ష‌కుల వెన్నులో వ‌ణుకు పుట్ట‌డం ఖాయం. అంత ప‌క్కాగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా.. ఇంకెక్క‌డా క‌థ దారి త‌ప్ప‌కుండా అల్లుకున్నాడు. సైబ‌ర్ క్రైమ్ ఎలా చేస్తారు అనే విష‌యాన్ని చాలా చ‌క్క‌గా ఆవిష్క‌రించాడు ద‌ర్శ‌కుడు. ఇందులో క‌థ కంటే ఎక్కువగా మ‌న జీవిత‌మే మ‌న‌కు క‌నిపిస్తుంటుంది. స్క్రీన్ ప్లే జోడించి చివ‌రి సీన్ వ‌ర‌కు దాన్ని ఆస‌క్తిక‌రంగా న‌డిపించాడు ద‌ర్శ‌కుడు మిత్ర‌న్. ముఖ్యంగా కొన్ని సీన్లు చూస్తుంటే మ‌న లైఫ్ లోనే ఎక్క‌డో జ‌రిగిన సీన్స్ అన్నీ గుర్తుకు వ‌స్తుంటాయి. సైబ‌ర్ క్రైమ్ బారిన ప‌డి రోజూ ల‌క్ష‌ల మంది ప్రజ‌లు ఎలా న‌లిగిపోతున్నారో కంటికి కట్టిన‌ట్లుగా చూపించాడు ద‌ర్శ‌కుడు. చిన్న‌పాటి నిర్ల‌క్ష్యం ఎంత‌టి దారుణం చేస్తుందో చూపించాడు. 

న‌టీన‌టులు: విశాల్ ఎప్ప‌ట్లాగే త‌న పాత్ర‌కు ప్రాణం పోసాడు. రోబోటిక్ మాస్ హీరో ఇమేజ్ నుంచి అద్భుత‌మైన న‌టుడిగా మారుతున్నాడు విశాల్. ఆర్మీ ఆఫీస‌ర్ గా ఎంత రూడ్ గా ఉన్నాడో.. డిజిట‌ల్ క్రైమ్ ను చేధించే క్ర‌మంలో అంతే ప‌క్కా ఆర్మీ మ్యాన్ గా అనిపించాడు. ఇక యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఈ చిత్రానికి ప్రాణం. ఇతడి పాత్ర కాస్త ఆల‌స్యంగా క‌థ‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఇచ్చిన త‌ర్వాత ఇంకెవ‌రూ క‌నిపించ‌లేదు. క్లైమాక్స్ వ‌ర‌కు ఆయ‌నదే రాజ్యం. స‌మంత బాగా చేసింది. డాక్ట‌ర్ గా మెప్పించింది. హీరో తండ్రిగా ఢిల్లీ గ‌ణేష్ ప‌ర్లేదు. మిగిలిన వాళ్ళంతా క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి వెళ్లే పాత్ర‌లే. 

టెక్నిక‌ల్ టీం: ఈ చిత్రానికి నూటికి నూరు మార్కులు సంపాదించింది యువ‌న్ శంక‌ర్ రాజా. ఈయ‌న బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది. రెండున్న‌ర గంట‌ల కంటే ఎక్కువగానే ఉన్నా ఎక్క‌డా బోర్ అనిపించ‌దు. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ఇక ద‌ర్శ‌కుడు మిత్ర‌న్ గురించి చెప్పాలి.. ఈయ‌న తీసుకున్న క‌థ‌పై చేసిన స్ట‌డీ ఏంటో సినిమా చూస్తే అర్థ‌మైపోతుంది. ప్ర‌తీ సీన్ ను ప‌క్కాగా రాసుకున్నాడు. ఎక్క‌డా చిన్న డౌట్ కూడా రానివ్వ‌లేదు ప్రేక్ష‌కుల బుర్ర‌ల్లో. అయితే పాట‌లు అసంద‌ర్భంగా రావ‌డం.. అన‌వ‌స‌ర‌పు కామెడీకి ట్రై చేయ‌డం ఒక్క‌టే సినిమాకు కాస్త మైన‌స్. 

చివ‌ర‌గా: అభిమ‌న్యుడు.. డిజిట‌ల్ క్రైమ్.. జ‌ర భ‌ద్రం.. 

రేటింగ్: 3/5

More Related Stories