English   

ఆచారి అమెరికా యాత్ర‌ రివ్యూ

Achari-America-Yatra
2018-04-27 13:43:41

కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు విష్ణు అందుకున్న విజ‌యాల‌న్నీ కామెడీ సినిమాలతోనే. అందుకే మ‌రోసారి అదే కామెడీని న‌మ్ముకుని వ‌చ్చాడు విష్ణు. ఈ సారి ఆచారి అమెరికా యాత్ర అంటూ వ‌చ్చాడు. ఈయ‌న ఆశ‌ల్ని ఆచారి తీర్చాడా..? అమెరికా యాత్ర క‌లిసొచ్చిందా..? 

క‌థ‌: కృష్ణ‌మాచారి(విష్ణు).. అప్ప‌లాచారి(బ్ర‌హ్మానందం) బ్రాహ్మ‌ణులు. ఓ పెద్ద మ‌నిషి(కోట శ్రీనివాసరావు) ఇంట్లో హోమం జ‌రిపించ‌డానికి వ‌స్తారు. కానీ ఆ హోమంలో జ‌రిగిన పూజ‌ల వ‌ల్ల ఆ పెద్ద మ‌నిషి చ‌నిపోతాడు. దాంతో వాళ్ల‌పై ప‌గ పెంచుకుంటారు ఆ ఇంటి వాళ్లు. ఏం చేయాలో తెలియ‌క గురు శిష్యులు త‌మ గ్యాంగ్ తో క‌లిసి అమెరికా వెళ్లిపోతారు. అమెరికా పారిపోయి వ‌చ్చామ‌ని అప్ప‌లాచారి అనుకుంటాడు.. కానీ త‌న ప్రేమ కోస‌మే యుఎస్ తీసుకొచ్చాన‌ని త‌ర్వాత కృష్ణ‌మాచారి చెబుతాడు. అస‌లు రేణుక (ప్ర‌గ్య‌జైస్వ‌ల్) ఎవరు..? ఆ అమ్మాయితో కృష్ణమాచారికి ఏంటి ప‌రిచ‌యం.. అనేది మిగిలిన క‌థ‌..!

క‌థ‌నం: ఇంటికి ఒక్క‌తే వార‌సురాలు.. ఆమె హీరోయిన్. ఆ ఇంట్లో ఆస్తి కోసం చూసే గుంట‌న‌క్క‌ల్లాంటి మావ‌య్య‌లు. వాళ్ల‌కు ఆస్తి మీదే క‌న్ను. కానీ ఆ ఇంట్లో ఓ పెద్దాయ‌న ఉంటాడు. అత‌డికి మ‌న‌వరాలంటే ప్రాణం. ఆస్తి కోసం ఆ అమ్మాయిని త‌న కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేయాల‌ని మావ‌య్య‌ల ప్లాన్. దానికి అడ్డు ప‌డే హీరో.. ఇలాంటి క‌థలు చాలా సినిమాల్లో చూసాం క‌దా..! ఏం చేస్తాం ఆచారి అమెరికా యాత్ర క‌థ కూడా ఇదే. ఇప్ప‌టికే ఎన్నోసార్లు రాసామ‌ని తెలిసినా కూడా మ‌రోసారి అదే చేసాడు విష్ణు. ఏదో కామెడీతో న‌డిపించాల‌నే త‌ప‌నే త‌ప్ప‌.. క‌థ ఎక్క‌డుంది.. క‌నీసం కామెడీ పండ‌టానికి ఓ క‌థంటూ ఉండాల‌నే విష‌యాన్నే మ‌రిచిపోయారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దాంతో సినిమా ఎటుప‌డితే అటు వెళ్లిపోయింది. స్క్రీన్ ప్లే కూడా మ‌రీ రొటీన్ గా ఉండ‌టంతో ఎక్క‌డా ఆస‌క్తి పుట్టించ‌దు. పైగా అమెరికా సీక్వెన్సులు కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాల‌కు కూడా స్కోప్ లేదు. ఎన్నో సినిమాల్లో చూసిన సీన్లే మ‌ళ్లీ మ‌ళ్లీ క‌నిపించ‌డంతో ఆచారి ఏ కోశానా కూడా ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్న‌మే చేయ‌దు. బ‌ల‌వంతంగా న‌వ్వాల్సిందే కానీ ఎక్క‌డా కామెడీ వ‌ర్కవుట్ అయితే కాలేదు. ఫ‌స్టాఫ్ అంతా హీరో బ్యాచ్ అమెరికా క‌ష్టాల‌తోనే స‌రిపోయింది. క‌థ‌లోకి వెళ్లినా అక్క‌డ క‌థేం లేద‌ని తెలిసిన త‌ర్వాత ప్రేక్ష‌కుల‌కు ఓ నిట్టూర్పు త‌ప్ప‌దు. 

న‌టీన‌టులు: విష్ణు న‌ట‌న గురించి చెప్పాల్సిందేమీ లేదు. మ‌రోసారి బ్రాహ్మ‌ణ పాత్ర‌లో బాగా న‌టించాడు. కానీ ఈయ‌న బాడీ లాంగ్వేజ్ ఏ త‌ర‌హా పాత్ర‌లు సూట్ అవుతాయో ఆయ‌నే ఇక‌నైనా తెలుసుకోవాలి. ప్ర‌గ్య‌జైస్వ‌ల్ కేవ‌లం అందాల ఆర‌బోత కోస‌మే ఉంది. ఇంకెందుకు కాదు. బ్ర‌హ్మానందం మ‌రోసారి త‌న‌కు అల‌వాటైన పాత్ర‌లో న‌టించేసాడు. కామెడీ గురించి ఆరా తీయొద్దు. ప్ర‌వీణ్, ప్ర‌భాస్ శీను కూడా మ‌మా అనిపించేసారు. విల‌న్ గా అనూప్ సింగ్ ఠాకూర్ జ‌స్ట్ బొమ్మ‌లా నిల‌బ‌డిపోయాడు. పోసానీ, కోట ఉన్నంత‌లో ప‌ర్లేదు. మిగిలిన వాళ్ళంతా ఓకే.. 

టెక్నిక‌ల్ టీం: థ‌మ‌న్ ఈ మ‌ధ్య కాస్త కొత్త‌గా మ్యూజిక్ ఇస్తున్నాడు. కానీ ఇది ఇప్ప‌టి సినిమా కాదు క‌దా.. అందుకే ఇందులో పాత థ‌మ‌న్ క‌నిపించాడు. అవే పాత ట్యూన్స్ తో రోత పుట్టించాడు. ఆర్ఆర్ కూడా ఎక్క‌డో విన్న‌దే. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ఎడిటింగ్ చాలా వీక్ గా ఉంది. చాలా చోట్ల సీన్లు ట‌ప్ అని క‌ట్ అయిపోయాయి. పైగా అమెరికా, ఇండియా మ‌ధ్య వ‌చ్చే సీన్స్ క‌లిసిపోయాయి. ఏది ఎక్క‌డ జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. ద‌ర్శ‌కుడిగా నాగేశ్వ‌ర‌రెడ్డి మ‌రోసారి ఫెయిల్ అయ్యాడు. ఈయ‌న క‌న్ఫ్యూజ‌న్ కామెడీని న‌మ్ముకున్నా ఈ సారి మాత్రం వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు.

చివ‌ర‌గా: ఆచారి అమెరికా యాత‌రా.. ప్రేక్ష‌కుల‌కు తీర‌ని యాత‌నా..

రేటింగ్: 1.5/5

More Related Stories