English   

విజయశాంతి ఇక్కడ.. అలాంటి పాత్రలు నాకేం అవసరం..

shanthi
2019-06-24 01:25:32

తెలుగు ఇండస్ట్రీలో విజయశాంతి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇండియన్ సినిమాకు కూడా తానేంటో చూపించుకుంది ఈ సీనియర్ హీరోయిన్. ఇండస్ట్రీలో కూడా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి సంచలనం సృష్టించింది విజయశాంతి. ఒకప్పుడు హీరోలతో సమానంగా ఇంకా మాట్లాడితే హీరోలకంటే ఎక్కువ పారితోషకం తీసుకుంది. 30 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన విజయశాంతి 12 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది విజయశాంతి. ఈ సినిమాలో ఆమెది నెగిటివ్ పాత్ర అని చాలావరకు వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన విజయశాంతి ఇందులో చాలా విషయాలు మీడియాతో పంచుకుంది.

జూన్ 24 ఈమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా తాను బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను.. ఆ రోజు ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది. తన బర్త్ డే రోజు అభిమానులు విషెస్ పంపిస్తారని.. అలాగే తాను శివుడి గుడికి వెళ్లి వస్తానని.. తాను శివ భక్తురాలు అని చెబుతోంది విజయశాంతి. ఇన్నేళ్ళ తన కెరీర్లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని.. ఎంతో సంతృప్తి కరంగా ఉంటుందని చెబుతుంది లేడి అమితాబ్ బచ్చన్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పనే దైవంగా భావించి దాన్నని.. ఒక్కో ఏడాది 15 నుంచి 18 సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయని గుర్తు చేసుకుంది విజయశాంతి.

అప్పట్లో కనీసం తిండి తినడానికి నిద్రపోవడానికి కూడా సరైన సమయం ఉండేది కాదని.. ఇక షూటింగ్స్ లో తగిలిన దెబ్బల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది విజయశాంతి.  కొన్ని రోజులకే తాను ఊహించని స్టార్ డమ్ వచ్చేసిందని.. అది నిజంగానే ఇండస్ట్రీలో చాలామందికి షాక్ ఇచ్చిందని చెబుతోంది. ఇక ఒక టైమ్ లో హీరోల కంటే ఎక్కువ పారితోషికం అందుకుంది విజయశాంతి.. తమకు ఓ రేంజ్ క్రేజ్ వచ్చిన తర్వాత నిర్మాతలు క్యూలో నిలబడి ఇంత ఇస్తామంటూ ఆశ పెట్టే వాళ్ళని.. అందులో స్క్రిప్ట్ నచ్చి డేట్స్ ఖాళీగా ఉంటే సినిమాలు చేసేదాన్నని చెప్పింది విజయశాంతి. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం విజయశాంతిని ఎవరు ఒప్పించారని ప్రశ్న అడిగితే విజయశాంతిని ఒకరు ఒప్పించే అవకాశం లేదు.. తన నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. చాలా రోజుల నుంచి సినిమాలు చేయాలని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా తనను అడుగుతున్నారని.. అయితే సరైన కథ దొరకక సినిమాలకు దూరంగా ఉన్నట్లు చెప్పింది విజయశాంతి.

ఇన్నేళ్లకు అనిల్ రావిపూడి చెప్పిన కథ కాస్త బెటర్ గా అనిపించింది.. రీ ఎంట్రీకి ఇది బాగుంటుందని ఆలోచించి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు విజయశాంతి. ఇందులో ఆమెది నెగెటివ్ పాత్ర అని అడిగితే విజయశాంతి ఎప్పుడు నెగిటివ్ రోల్స్ చేయదు.. నేను పాజిటివ్ పర్సన్ అలాంటి పాత్రలు మాత్రమే చేస్తాను అంటోంది ఈ సీనియర్ హీరోయిన్. ఇకపై అమ్మ వదిన పాత్రలు చేస్తారా అంటే అసలు సమస్యే లేదు.. విజయశాంతిని అభిమానులు అలా చూడలేరు అంటూ సమాధానం చెప్పింది ఈమె. మదర్ ఇండియా లాంటి స్క్రిప్ట్ వస్తే తల్లి పాత్ర చేయడానికి తనకేం అభ్యంతరాలు లేవని.. అలా కాకుండా సింపుల్ రోల్స్ తన వల్ల కాదు అంటుంది విజయశాంతి. విభిన్నమైన పాత్రలు వచ్చినప్పుడు కచ్చితంగా ఇకపై సినిమాల్లో నటిస్తానని క్లారిటీ ఇచ్చింది ఈ లేడీ సూపర్ స్టార్. ఎలాగు ఎన్నికలు అయిపోయాయి. రాబోయే ఐదేళ్ల వరకు విజయశాంతి చేసేది కూడా ఏమీ ఉండదు. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించే పనిలో బిజీగా ఉన్నారు.

More Related Stories