English   

వామ్మో ఒకే రోజు 9సినిమాలా..?

Goodachari
2018-07-30 18:25:44

కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ చూస్తే ఇదేదో క్లియరెన్స్ సేల్ లా ఉంటుంది. కానీ ఆ సేల్ లో కూడా కన్ని సేలబుల్ మెటీరియల్ ఉంటాయి. అందులో ఏవి సేలబుల్ అనేది అప్పుడే చెప్పలేం కానీ ఆగస్ట్ 3న వస్తోన్న సినిమాల లిస్ట్ చూస్తే షాక్ అవడం ఖాయం.  అంటే ఇది యూట్యూబ్ షాక్ కాదులెండి.. ఆగస్ట్ 3న ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల కాబోతున్నాయి. బట్.. ఒక్కరోజు ఇన్ని సినిమాలంటే ప్రేక్షకులకు కనీసం టికెట్ తీసుకునే గ్యాప్ అయినా ఉండాలి కదా.. అయినా వీటిలోనూ కొన్ని మస్ట్ వాచ్ మూవీస్ ఉండటం విశేషం. 

ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న పేరు గూఢచారి. అడవి శేష్, శోభిత ధూళిపాల్ల జంటగా నటించిన ఈ మూవీ ఓ రా ఏజెంట్ కు సంబంధించిన కథ. ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదే భారీ అంచనాలు కూడా పెంచింది. మరోవైపు శేష్ గత సినిమా క్షణం థ్రిల్లర్ గా సూపర్ హిట్ కావడం ఈ సినిమాకు కలిసొస్తుంది. 

ఇక చాన్నాళ్లుగా ఓ హిట్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తోన్న సుశాంత్ చిలసౌ కూడా ఈ రోజునే వస్తోంది. ట్రైలర్ బావుంది. సుశాంత్ మాస్ కోసం ఆరాటం వదిలేశాడు. హీరో రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాతో దర్శకుడుగా మారుతుండంతో పాటు ఈ ట్రైలర్ చూసిన సెలబ్రిటీస్ అంతా ఈ ట్రైలర్ ను తెగ పొగడేస్తున్నారు.. అందువల్ల చిలసౌ కు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. 

దర్శకుడు బ్రాండ్ తో వస్తోన్న సినిమా బ్రాండ్ బాబు. సుమంత్ శైలేంద్ర హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోంది. బిజినెస్ లో పెద్దగా హడావిడీ అయితే లేదు కానీ.. కొన్ని వర్గాల వారిని థియేటర్స్ కు రప్పించే అవకాశం ఉంది. ఇక వరుసగా హారర్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న శివకాశీపురం సినిమా వస్తోంది. మొన్నటి తరం సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఇక ఇదే బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న మరో సినిమా తర్వాత ఎవరు..? ఇది కూడా 3నే వస్తోంది. అలాగే అంతా కొత్తవారితో వస్తోన్న యువతరం అనే సినిమా ఇదే డేట్ ను లాక్ చేసుకుంది. 

ఇక జ్యోతిక నటించిన తమిళ సినిమాను తెలుగులో ఝాన్సీగా డబ్ చేశారు. ఈ ఝాన్సీ కూడా 3నే వస్తోంది. ఇక వీటితో పాటు రెండు హిందీ సినిమాలు కూడా 3న వస్తున్నాయి. దుల్కర్ సాల్మన్, ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన కర్వాతో పాటు అనిల్ కపూర్, ఐశ్వర్య రాయ్ నటించిన ఫన్నీఖాన్ 3తారీఖునే వస్తోంది. మరి ఈ తొమ్మిదికి తోడు మరో రెండు సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఇంత సడెన్ గా వీళ్లంతా ఇదే డేట్ ను ఎందుకు లాక్ చేసుకున్నారో తెలుసా.. ఆ తర్వాత రెండు వారాల వరకూ ‘పెద్ద నిర్మాతల’ సినిమాలు వస్తున్నాయి. అంటే ఇంకెవరికీ థియేటర్స్ ఉండవు అనేది అందరికీ తెలిసిందే కదా.. 

More Related Stories