English   

అఖిల్ కష్టాలు ఇప్పటికైనా తీరుతాయా.. కొత్తగా ట్రై చేస్తున్న అక్కినేని హీరో..

Akhil Akkineni
2020-07-01 16:29:21

కొండంత బ్యాగ్రౌండ్ ఉన్న కూడా రవ్వంత అదృష్టం లేక వరస ఫ్లాపులు అందుకుంటున్నాడు అక్కినేని అఖిల్. ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. హలో సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ రాలేదు. ఇక తొలి సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మూడో సినిమా మిస్టర్ మజ్ను కూడా అంతే. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు అఖిల్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. గీతా ఆర్ట్స్ 2 లో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 

ఇదిలా ఉంటే బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కొన్ని మార్పులు సూచించాడు నాగార్జున. షూటింగ్స్ తిరిగి ఓపెన్ అయిన తర్వాత రీ షూట్ కూడా చేయబోతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు ముందే తన ఐదో సినిమాను కూడా క్యూలో పెడుతున్నాడు అఖిల్. ఈసారి ఏకంగా కాస్త ప్రయోగాత్మక కథతో రాబోతున్నాడని తెలుస్తుంది. విశాల్ హీరోగా తెరకెక్కిన అభిమన్యుడు సినిమాతో తెలుగు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు మిత్రన్ చెప్పిన కథ అఖిల్ కు బాగా నచ్చిందని తెలుస్తుంది. ఈయన తర్వాతి సినిమా ఇదే ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. అసలే వరుస పరాజయాల మధ్యలో ప్రయోగం అవసరం లేదు అంటూ నాగార్జున కాస్త వారిస్తున్నా ఈయన మాత్రం కథ నచ్చి ముందడుగు వేస్తున్నాడు అని తెలుస్తోంది. ఏదేమైనా ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఒక విజయం అందుకోవాలని అఖిల్ కసిమీద కనిపిస్తున్నాడు. మరి ఈయన కోరికను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటు తర్వాత సినిమా ఎంతవరకూ నిజం చేస్తుందో చూడాలి. 

More Related Stories