అక్కినేని నాగేశ్వరరావు 5 వర్ధంతి ప్రత్యేక కథనం..

నడిచే నట భాండాగారం.. నవరస నటభూషణుడు.. నటసామ్రాట్.. ఈ తరం నటులకు ఓ గ్రాంథాలయం. తెలుగు సినిమా చరిత్రలో ఆయన లేకపోతే సగానికి పైగా పేజీలన్నీ ఖాళీ అయిపోతాయి. ఆయన 90 ఏళ్ళ జీవితంలో 75 ఏళ్ళు కళామతల్లి ఒడిలోనే గడిపారు. ఆయనే ది గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావ్. నేడు ఈ మహానటుడి జయంతి. 1923, సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా రామాపురంలో అక్కినేని జన్మించారు. జనవరి 22న ఈయన 5వ వర్ధంతి. ఆయన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగేశ్వరరావ్ తొలి సినిమా సీతారామ జననం.. చివరి సినిమా మనం. రాముడి పాత్రతో మొదలైన అక్కినేని సినీప్రయాణం.. రామరాజ్యంలో వాల్మీకితో పూర్తికావడం విశేషం.
అక్కినేని అంటే అంగబలం కాదు.. అర్ధబలం కాదు.. అదృష్టం కాదు. అక్కినేని అంటే పట్టుదల, మొక్కువోని అకుంఠిత దీక్ష, కృషి, క్రమశిక్షణ. పుట్టుక తోనే నటుడిగా పుట్టలేదు అక్కినేని. తన శరీరాన్ని, మనసుని, అలవాట్లని, అభిరుచుల్ని, ఆకర్షణల్ని, ఆశల్నీ అన్నింటిని అదుపులో ఉంచుకుని.. గొంగళిపురుగు సీతాకోకచిలకలా రూపాంతరం చెందారు అక్కినేని నాగేశ్వరరావ్. అక్కినేని అంటే సినిమాలు మాత్రమే కాదు.. సినిమా చూడని తెరవెనక ప్రపంచం ఆయన జీవితంలో ఉంది. ఆయన నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కడానికి పడిన కష్టం అందరికీ స్పూర్థిదాయకం. రాత్రికి రాత్రే ఆయన సూపర్ స్టార్ కాలేదు.
తనలోని లోపాలేంటో అక్కినేనికి బాగా తెలుసు. అక్కినేని ఉన్నత కుటుంబంలో పుట్టలేదు.. గొప్ప చదువులు చదవలేదు. ఆయనది అందమైన రూపం కాదు.. ఆకట్టుకునే స్వరం లేదు.. కానీ ఇవేవీ అక్కినేని ఎదుగుదలకు అడ్డుకాలేదు. తన లోపాల్ని అధిగమించి భారతీయ సినీచరిత్రలోనే మేటినటుడిగా ఎదిగారు అక్కినేని నాగేశ్వరరావ్. ఎన్టీఆర్ తో పోలిస్తే.. తాను చాలా విషయాల్లో వెనకబడి ఉంటానని చెప్పేవారు అక్కినేని. ఇద్దరూ స్టార్ హీరోలే.. ఇద్దరికీ ఒకే అవకాశాలు వచ్చేవి. కానీ అక్కినేని ఏనాడూ పంథానికి పోలేదు.. తన ఇమేజ్ కు, బాడీలాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని క్లాస్ సినిమాలే చేసారు.. భగవంతుడి పాత్రలు ఎన్టీఆర్ కే సెట్టవుతాయి అని ఎలాంటి భేషజాలు లేకుండా ఒప్పుకున్న నటుడు అక్కినేని. భక్తుడి పాత్రల్లో అక్కినేని మినహా మరొకరు లేరని నిరూపించుకున్నారు ఏఎన్నార్. లేనదానికోసం పాకులాడటం అక్కినేనికి అలవాటు లేదు.. ఉన్నదాన్నే ఎలా వాడుకోవాలి.. వాటితోనే ఎలా అగ్రస్థానానికి ఎదగాలనేది అక్కినేని నేటి తరానికి మార్గం చూపారు. ఎన్టీఆర్ మాస్ సినిమాలతో రెచ్చిపోతుంటే.. అదే సమయంలో క్లాస్ సినిమాల్లో కింగ్ అనిపించుకున్నాడు అక్కినేని.
అక్కినేని జీవితంలో సవాళ్లెన్నో.. ఆయన ఎదుర్కొన్న కష్టాలెన్నో.. కానీ ఏనాడూ ఏ కష్టానికి ఆయన కుంగిపోయింది లేదు. అలాగని విజయాల్లో ఉన్నపుడు పొంగిపోలేదు. ఆయన దేవున్ని ఏనాడూ నమ్మలేదు.. నమ్మేవాళ్లకు అడ్డు చెప్పలేదు. నీ పని నీవు సక్రమంగా మనసుపెట్టి చేసినపుడు.. ఆ పనే దైవం చెప్పిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావ్. వ్యక్తిత్వంలోనూ అక్కినేని ఓ శిఖరమే. ధైర్యంగా ముందడుగేయడంలో అక్కినేనికి సాటిరారు. అన్నపూర్ణ స్టూడియోస్ కట్టొద్దని.. కడితే నష్టపోతారని ఇండస్ట్రీ అంతా ఏకమై బెదిరించినా, భయపెట్టినా వెనకడుగేయలేదు అక్కినేని. అలాగే ఇండస్ట్రీని హైదరబాద్ కు తరలించడంలోనూ అక్కినేనిదే కీలకపాత్ర.
ఇక క్యాన్సర్ మహమ్మారి విషయంలోనూ అక్కినేని చూపిన ధైర్యం హర్షనీయం. తనకు క్యాన్సర్ ఉంది అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన ధైర్యశీలి అక్కినేని నాగేశ్వరరావ్ మాత్రమే. బహుశా తన రోగాన్ని ప్రపంచానికి చెప్పి.. తాను మరణించబోతున్నానని ఒప్పుకున్న నటుడు ప్రపంచంలో అక్కినేని మినహా ఎవరూ లేరేమో. నటుడుగానే కాదు.. పద్దతిగల నిర్మాత, భాద్యత గల తండ్రి, మార్గదర్శి.. ఇలా ఎన్నో పాత్రల్లో సమర్థవంతంగా జీవించిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావ్. కెరీర్ లో 255 చిత్రాల్లో నటించిన ఏఎన్నార్.. చివరి సినిమా మనంలో తన కొడుకు, మనవళ్ళతో కలిసి నటించారు. జనవరి 22, 2014న అనారోగ్యంతో కన్నుమూసారు ఈ ఎవర్ గ్రీన్ దసరాబుల్లోడు.