English   

3 మిలియన్ క్లబ్బులో చేరిపోయిన అల వైకుంఠపురములో.. 

 Ala Vaikunthapurramuloo
2020-01-21 15:12:39

విడుదలైన పది రోజుల తర్వాత కూడా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో అలలు ఆగడం లేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం సృష్టిస్తున్న సంచలనాలు చూసి దర్శక నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారు. నిజంగానే తాము ఇంత గొప్ప సినిమా తీసామా అనుకునేలా అల వైకుంఠపురములో కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తుంది. ఇంటా బయటా అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఈ చిత్రం కుమ్మేస్తుంది. 

ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా మళ్లీ సత్తా చూపిస్తుంది. కొన్ని రోజులుగా అక్కడ 2 మిలియన్ కూడా చూడటం లేదు మన తెలుగు సినిమా. సైరా, సాహో లాంటి సినిమాలు కూడా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్స్ అయ్యాయి అక్కడ. కానీ ఇప్పుడు బన్నీ మాత్రం అన్ని లెక్కలు ఒకేసారి సెట్ చేస్తున్నాడు. అల వైకుంఠపురములో ఇప్పటికే అక్కడ 3 మిలియన్ మార్క్ అందుకుంది. 

ఇపటి వరకు టాప్ 6లో ఉన్న ఈ చిత్రం భరత్ అనే నేనును వెనక్కి నెట్టి కచ్చితంగా టాప్ 5లోకి వచ్చేలా కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ ఇంకా దూకుడు తగ్గకపోవడంతో ఈ వారం కూడా అల వైకుంఠపురములో జోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ మహానటి, సైరా, శ్రీమంతుడు, గీతగోవిందం ఆల్ టైమ్ వసూళ్లను క్రాస్ చేసిన బన్నీ.. ఇప్పుడు సాహోపై కన్నేశాడు. మరో 23 వేల డాలర్లు తీసుకొస్తే సాహో పక్కకు వెళ్ళిపోతుంది.. తర్వాత భరత్ అనే నేను, రంగస్థలంపై కన్నేయబోతున్నాడు బన్నీ. 

మొత్తానికి అల వైకుంఠపురములో దూకుడు చూస్తుంటే బాపురే అనిపిస్తుంది. ఇక ఇండియాలో కూడా అల వైకుంఠపురములో జోరు మామూలుగా లేదు. నైజాంలో అయితే 30 కోట్ల షేర్ దాటేసి 35 కోట్ల వైపుగా పరుగులు తీస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 90 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయడానికి దూసుకుపోతుంది అల వైకుంఠపురములో. మళయాలంలో కూడా ఈ చిత్రం రప్ఫాడిస్తుంది. 

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అల వైకుంఠపురములో తొలివారంలోనే బయ్యర్స్ అందర్నీ సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లింది. ఇప్పటికే అంతా లాభాల్లోకి వచ్చేసారు.. రెండోవారం కూడా కుమ్మేసింది ఈ చిత్రం. పైగా ఇప్పుడు రవితేజ డిస్కో రాజా ఉన్నా కూడా అల వైకుంఠపురములో ధాటికి తట్టుకుని నిలబడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చూడాలిక.. బన్నీ జోరు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో..?

More Related Stories