బన్నీ ఫ్యూచర్ విజయ్ దేవరకొండ చేతుల్లో..

అల్లు అర్జున్ తన కెరీర్ లో ఇప్పటి వరకు సస్పెన్స్ డ్రామా చేయలేదు. కానీ ఇప్పుడు రియల్ లైఫ్ లో మాత్రం చేస్తూనే ఉన్నాడు. తన నెక్ట్స్ సినిమా కోసం అభిమానులు వేచి చూస్తున్నారని తెలిసినా కూడా ఆ ఒక్క విషయంలో మాత్రం రిస్క్ తీసుకోలేకపోతున్నాడు ఈ హీరో. నా పేరు సూర్య తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు బన్నీ. ఆ మధ్య గీతాగోవిందం ఆడియో వేడుకలో కూడా ఫ్యాన్స్ ఇదే ప్రశ్న అడిగితే నవ్వి తప్పించుకున్నాడు. వీలైనంత త్వరలో చెప్తాను ఇంకొన్ని రోజులు వేచి చూడండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఈయన తర్వాతి సినిమా కోసం చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే ఇప్పటి వరకు ఎవర్నీ ఫైనల్ చేయలేదు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం పరుశురామ్ తో ఈ హీరో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. గీతగోవిందం విడుదల వరకు ఆగి ఆ తర్వాత నిర్ణయం తీసుకోనున్నాడు బన్నీ. అందుకే ఇన్ని రోజులు సైలెంట్ గానే ఉన్నాడు అల్లు వారబ్బాయి. పైగా ఈ చిత్రం కూడా సొంత బ్యానర్ లోనే ఉండబోతుంది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అప్పుడు అనుకున్న విక్రమ్ కే కుమార్ సినిమా ఇక పూర్తిగా ఆగిపోయినట్లే..! నా పేరు సూర్య తర్వాత ప్రయోగాలకు కాస్త దూరంగా ఉన్నాడు బన్నీ. ఇప్పుడు పరుశురామ్ తో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలని చూస్తున్నాడు ఈ హీరో. మరి చూడాలిక.. గీత రిలీజ్ అయితే కానీ బన్నీ ఫ్యూచర్ పై క్లారిటీ రాదిప్పుడు.