English   

నేను నాన్న అంటున్న త్రివిక్రమ్.. సరే అంటున్న బన్నీ.. 

 Allu Arjun
2019-08-13 13:42:06

ఎందుకో తెలియదు కానీ తన ప్రతి సినిమాలో తండ్రి సెంటిమెంట్ బాగా వాడుకుంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తెలియకుండానే ప్రతి కథలో కూడా తండ్రి సెంటిమెంట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అది మరీ ఎక్కువైపోయింది. డిజాస్టర్ అయిన అజ్ఞాతవాసిలో కూడా తండ్రి సెంటిమెంట్ కనిపిస్తుంది. అరవింద సమేతలో కూడా తెలియకుండానే నాన్న సెంటిమెంట్ బలంగా చూపించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక దానికి ముందు బన్నీతో చేసిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా మొత్తం తండ్రి చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ తో ఈ దర్శకుడు చేయబోయే సినిమాలో కూడా తండ్రి సెంటిమెంట్ కీలకపాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. మరోసారి నాన్నకు ప్రేమతో లాంటి కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. నాన్నకు ప్రేమతో అంటే ఎన్టీఆర్ చేసిన సినిమా కాదు.. నాన్నకు అంకితం ఇచ్చే కథ అనమాట. ఈ సినిమాపై అల్లు అర్జున్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడు. నా పేరు సూర్య లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈయన కెరీర్ కు కూడా త్రివిక్రమ్ సినిమా కీలకంగా మారింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ కూడా బన్నీ కోసం ఎమోషనల్ కథ సిద్ధం చేసాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే 40 శాతం షూట్ పూర్తైంది కూడా. ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ ను ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. సంక్రాంతి 2020కి సినిమా విడుదల కానుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

More Related Stories