English   

చిన్న సినిమాకు పెద్ద పండగే.. నా..?

AP-govt
2018-08-23 03:26:30

సినిమాకు పెద్ద వరాలు అంటూ ప్రస్తుతం మీడియాలో ఆంధ్రప్రదేశ్ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిజంగా వాళ్లు చెప్పినట్టు చేస్తే అందరికీ మంచిదే. కానీ ఇప్పుడే ఈ విషయం ఎందుకు తెరపైకి వచ్చింది. ఎవరిని టార్గెట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. అసలు వాళ్లు చెబుతున్నట్టు అక్కడ సినిమాలు తీయడం, చేయడం సాధ్యమేనా.. అంటే సమాధానాలు అంత ఈజీగా దొరకవు. అయినా ఈ వరాల వెనక వాస్తవాలను ఓసారి చూద్దాం.. 

సినిమా వారికి రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు.. చాలారోజులు నుంచీ వినిపిస్తోన్న మాట. కానీ బ్రెయిన్ అండ్ హార్ట్ మాత్రం హైదరాబాదే.  ఇది ముందు నుంచీ ఉణ్నదే. కానీ ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సినిమా వారి నుంచి పెద్దగా ఆదాయం రావడం లేదు. దీంతో అక్కడ సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని గట్టిగా సంకల్పించుకున్నారు. పైగా చంద్రబాబు నాయుడుకు సినిమా వారితో మంచి అనుబంధం ఉంది. కానీ ఆ బంధంతో ప్రతిసారీ వీళ్లు అక్కడికి, ఆయన ఇక్కడకీ రాలేడు కదా.. అందుకే వీరినే అక్కడికి రప్పించాలనే ప్రయత్నాలు చాలాకాలంగా మొదలుపెట్టారు. విశాఖపట్నం బీచ్ దగ్గర ఉన్న మూణ్ణాలుగు వందల ఎకరాలు స్టూడియోలు కట్టుకుంటామంటే సబ్సిడీ ఇస్తామని చెప్పారు. రేట్ కూడా తగ్గిస్తామన్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి వారు అక్కడ స్టూడియో కట్టబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. లేటెస్ట్ గా బాలయ్య అక్కడ స్టూడియో కట్టడానికి అప్లికేష్ కూడా పెట్టుకున్నాడు. అయినా అక్కడి ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ పెద్దగా టెంప్టింగ్ గా లేదు. కారణం.. అక్కడ హైదరాబాద్ లో ఉన్నన్ని సౌకర్యాలుండవు. పైగా వాతావరణం తేడాగా ఉంటుంది. అక్కడి ప్రధాన నగరాలన్నీ అంత ‘లివబుల్’ కాదు. ఈ కారణంగానే ఇప్పటికే అక్కడ 360ఎకరాల్లో స్టూడియో కోసం కొన్న రామానాయుడు స్టూడియోను పెద్దగా అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఆయన వారసులు కూడా ఆ వైపు సీరియస్ గా తీసుకోవడం లేదు. మరోవైపు ముందు నుంచీ సినిమా వాళ్లు హైదరాబాద్ నే వేదికగా చేసుకున్నారు. నిజానికి ఇండస్ట్రీ మద్రాస్ నుంచి తరలి వస్తున్నప్పుడే వైజాగ్, విజయవాడ అనే ప్రస్తావన వచ్చింది. కానీ ఈ కారణాల వల్లే హైదరాబాద్ చేరింది. సరే ఇక ఇప్పుడు అక్కడి ప్రభుత్వం చెప్పిన రాయితీల విషయానికి వద్దాం.. 

సినిమా షూటింగ్ అంతా అక్కడే జరగాలి అన్నారు. కాస్త ఇబ్బంది అయినా రాయితీలు కావాలనుకున్నవాళ్లు పడతారు. సింగిల్ విండో పర్మిషన్(ఇది మాత్రం ఖచ్చితంగా సినిమావారికి పెద్ద రిలీఫ్)అన్నారు. ఇది ఉపయోగకరమైనదే. అయితే జిఎస్టీలో 9శాతం టాక్స్ మినహాయింపు అనేది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ.. (అఫ్ కోర్స్ తెలంగాణలో అసలు లేదనుకోండి). అంటే తర్వాత ఈ విషయాలు కూడా మళ్లీ తెరపైకి వస్తాయి. ఇక నాలుగు కోట్ల లోపు బడ్జెట్ ఉన్న సినిమాలకు టాక్స్ ఫ్రీ అనడం కూడా బావుంది. అయితే ఉత్తమ చిత్రాలకు కేవలం 10కే పరిమితం చేయడం మాత్రం ఖచ్చితంగా విమర్శలకు తావిస్తుంది. అలాగే వీటిలో అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వాల ప్రేమేయం ఉంటుంది. లాబీయింగూ నడుస్తుంది. ఒక రకంగా రాయితీలు, టాక్స్ ఫ్రీ, ఉత్తమ చిత్రాలకు ప్రోత్సాహకం వంటి అంశాలన్నీ బానే ఉన్నట్టు చెప్పాలి. అలాగే అక్కడే చిత్రీకరణ కూడా జరపాలనే నిబంధన కూడా ఒప్పుకోవచ్చు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా అక్కడే జరపాలనే ప్రతిపాదన మాత్రం ఖచ్చితంగా తొందరపాటే అవుతుంది. ఎందుకంటే అందుకు తగ్గ సౌకర్యాలు అక్కడ లేవు. టెక్నికల్ సపోర్ట్ లేదు. పోస్ట్ ప్రొడక్షన్ కు అవసరమైన అన్ని స్టూడియోలూ అందుబాటులో లేవు. అందువల్ల పోస్ట్ ప్రొడక్షన్ నిబంధన బంధనమే అవుతుంది. 

ఇక ఇవన్నీ ఓకే అనుకున్నా.. ఇప్పుడీ గొడవ ఎందుకంటే.. ఇండస్ట్రీని అక్కడికి తరలించాలనే కారణమే తప్ప మరొకటి కనిపించదు. ఈ నాలుగేళ్లలో హైదరాబాద్ లో ఉన్న సినిమా వారిని ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో తాయిలాలు ప్రకటించింది. అందులో ఇవి కూడా ఉన్నాయి. కానీ వీటికి జీవో కూడా ఇచ్చింది. అంటే ఇక కొందరు ఔత్సాహికులు అటు వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని చెప్పొచ్చు. కొత్తగా వస్తోన్న కుర్రాళ్లకు ఈ ఇబ్బందులు పడటానికి వెనకాడరు. కాబట్టి నవతరం మేకర్స్ కు ఆంధ్రప్రదేశ్ నిర్ణయం వరం అనే చెప్పాలి. కానీ ఆ వరంతో పాటు సౌకర్యాలు కూడా మెరుగు చేస్తే నిజంగానే హైదరాబాద్ వాళ్లలో కొందరైనా అటువైపు ఆకర్షితులవుతారు. ఏదేమైనా సినిమా రంగంతో ఎక్కువ అనుబంధం పెంచుకునే చంద్రబాబు.. ఇప్పుడు తన రాష్ట్రంలో వారు లేని లోటును బాగా ఫీలవుతున్నట్టున్నారు. అందుకే ఈ తాయిలాలు. ఏదేతేనేం.. ఎక్కడైతేనేం సినిమాకు మంచి రోజులు ఉంటే చాలు.. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. చంద్రబాబు ఒక కన్ను అంటే తాన రెండు కళ్లు అనే కెసిఆర్ ఈ నిర్ణయానికి కౌంటర్ ఆఫర్స్  ప్రకటిస్తాడనేది కూడా నిజం. అవి ఎలా ఉంటాయనేదాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ తాయిలం టైమ్ ఆధారపడి ఉంటుంది. 

More Related Stories