2.0 గురించి ఏఆర్ రెహ్మాన్ చెప్పిన సీక్రెట్

ఏఆర్ రెహ్మాన్.. ఈ పేరులోనే ఓ బ్రాండ్ ఉంది. ఇంక ఆయన చెబితే వినకుండా ఉంటారా ప్రేక్షకులు..? అందుకే ఇప్పుడు రెహ్మాన్ ఈ పని కూడా మొదలు పెట్టాడు. ఈయన బ్రాండింగ్ చేస్తోన్నది దేనికో తెలుసా..? 2.0 సినిమాకు.. అవును శంకర్, రజినీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్స్ ఉన్న సినిమాను ఈయన తన భుజాలపై మోస్తున్నాడు. 2.0 నవంబర్ 29న విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఏడాదిగా ఇదే పనిమీదుంది 2.0. ఈ సినిమాకు సంగీతం అందించింది ఏఆర్ రెహ్మాన్. గతేడాది నవంబర్ లో ఆడియో విడుదలైంది. ఇందులో పాటల కంటే కూడా ఆర్ఆర్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పాడు రెహ్మాన్.
ఇక ఈ మధ్యే సిజీ.. పోస్ట్ ప్రొడక్షన్ లేని పాట ఒకటి చూసానని చెప్పాడు ఈ సంగీత దర్శకుడు. చూసిన తర్వాత కళ్లు తిరిగాయని.. అంత అద్భుతంగా తీయడం బహుశా ఇండియాలో శంకర్ ఒక్కడికే సాధ్యం అవుతుందని కితాబిచ్చాడు రెహ్మాన్. అంతేకాదు.. క్లైమాక్స్ లో రజినీ, అక్షయ్ ను చూస్తుంటే అభిమానులు చూపు తిప్పుకోలేరని.. హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఈ సినిమాను శంకర్ తెరకెక్కించాడని చెబుతున్నాడు రెహ్మాన్. ముందు 2.0పై అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉండేవి కానీ శంకర్ చేసిన ఆలస్యానికి సినిమాపై హైప్ నానాటికి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అది పెంచే పనిలో బిజీగా ఉన్నాడు శంకర్. మరి రెహ్మాన్ చెప్పిన రేంజ్ లో సినిమా ఉంటుందా లేదా అనేది మరో మూడు నెలల్లో తేలిపోనుంది.