రానా అరణ్య సినిమా రివ్యూ

నటీనటులు: రానా, విష్ణు విశాల్, పులకిత్ సామ్రాట్, జోయా హుస్సేన్, రఘుబాబు తదితరులు,
సంగీతం: శంతన్ మొయిత్రా,
సినిమాటోగ్రఫీ: ఏఆర్ అశోక్‌కుమార్ ,
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్,
రచన, దర్శకత్వం: ప్రభు సాల్మన్,
బ్యానర్: ఏరోస్ ఇంటర్నేషనల్.
కథ: నరేంద్ర భూపతి (రానా దగ్గుబాటి) లక్షకు పైగా మొక్కలు నాటి రాష్ట్రపతి చేత ఫారెస్ట్ మాన్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకుంటాడు. అడవిలోనే ఉంటూ అక్కడి ఏనుగులకు, గిరిజనులకు అండగా ఉంటాడు. కేంద్రమంత్రి కనకమేడల రాజగోపాలం (అనంత్ మహదేవన్) చిలకలకోన అడవిపై కన్నేస్తాడు. అక్కడ డీ.ఎల్.ఆర్ టౌన్షిప్ కట్టేందుకు రంగంలోకి దిగుతాడు. దీనిని ప్రకృతి ప్రేమికుడు అరణ్య ఏ విధంగా అడ్డుకున్నాడు? తన కలల ప్రాజెక్టుకు ఆటంకం కలిగించిన అరణ్యను మంత్రి ఏవిధంగా హింసించాడు? చివరకు అడవిని, ఏనుగులను అరణ్య ఎలా కాపాడాడు? అనేదే మిగతా కథ.
కథనం: కథ బాగున్నా.. తెరపై చూపించిన విధానం బాగాలేదు. బలమైన కథను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. టౌన్షిప్ కాంట్రాక్టర్‌కీ, అరణ్యకీ మధ్య పోరాటం నేపథ్యంలోనే ప్రథమార్ధం సాగుతుంది. కథలోకి నక్సలైట్లను ఎందుకు తీసుకువచ్చాడో అర్థం కాదు. అలాగే మహిళా మావోయిస్ట్‌తో సింగ ప్రేమను కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు. అయితే ద్వితీయార్ధంలో ఆ పాత్రలు అర్ధంతరంగా కనుమరుగవుతాయి. దాంతో ఆ ఉపకథలన్నీ అసంపూర్ణంగా ముగిసినట్టు అనిపిస్తాయి. పతాక సన్నివేశాలు ఈ సినిమాకి ప్రధాన బలం. రానాతో చెప్పించిన సంభాషణలు ఆలోచింపజేస్తాయి. సమాజంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో పర్యావరణం గురించి విలువైన విషయాలెన్నో ఉన్నాయి.
నటీనటులు: అరణ్య పాత్రలో రానా దగ్గుబాటి జీవించాడు.. ఈ సినిమాకు ఉన్న ఒకే ఒక ప్లస్ రానా..అరణ్య పాత్ర కోసం రానా పడిన కష్టమంతా సినిమాలో కనిపిస్తుంది. విష్ణు విశాల్ పాత్ర కథలో గందరగోళం.. మరో హీరోయిన్ పాత్ర కూడా అంతే.. ఇక విలన్ పాత్రలో మహదేవన్ ఒదిగిపోయాడు. కమెడియన్ రఘుబాబు నిడివి తక్కువే అయినా.. ఉన్నంతసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
టెక్నికల్ టీం: శంతను మొయిత్రా సంగీతం, రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ అడవిలో ఉన్న అనుభూతినిస్తుంది. వనమాలి మాటలు.. పాటలు బాగున్నాయి. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం విజువల్ ఎఫెక్ట్స్. అడవి అందాలని తెరపై చక్కగా చూపించారు.సినిమాటోగ్రఫీ ఏఆర్ అశోక్ కుమార్ కష్టం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. కథను గొప్పగా రాసుకున్న దర్శకుడు ప్రభు సాల్మన్.. కథనంలో మాత్రం పసలేకుండా చేశారు. ఇక అంతర్జాతీయ స్థాయి నిర్మాణ సంస్థ అయిన ఎరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ విలువలు ఎంత గొప్పగా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు.
చివరగా: ‘అరణ్య’ రానా వన్ మ్యాన్ షో..!!
రేటింగ్: 2.25/5.