English   

అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌ రివ్యూ

Aravinda Sametha Veera Raghava Movie Review and Rating
2018-10-11 06:49:29

అర‌వింద స‌మేత‌.. కొన్ని రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీని ఊపేస్తున్న పేరు ఇది. ఎన్టీఆర్ వ‌ర‌స విజ‌యాల‌కు తోడు త్రివిక్ర‌మ్ క‌సి ఈ చిత్రంపై అంచ‌నాలు పెంచేసింది. మ‌రి నిజంగానే ఈయ‌న క‌సి సినిమాలో కూడా క‌నిపిస్తుందా..?

క‌థ‌:

వీర‌రాఘ‌వ‌రెడ్డి(ఎన్టీఆర్) లండ‌న్ లో చ‌దువుకుని వ‌స్తాడు. వ‌చ్చీ రాగానే సీమ‌లో అత‌డిపై అటాక్ జ‌రుగుతుంది. ఆ గొడ‌వ‌లో తండ్రి న‌ర‌పారెడ్డి(నాగ‌బాబు)ను పోగొట్టుకుంటాడు. ఆ కోపంతో ప్ర‌త్య‌ర్థి బ‌సిరెడ్డి(జ‌గ‌ప‌తిబాబు) మంది మార్బ‌లంపై విరుచుకుప‌డ‌తాడు. అయితే నాయ‌న‌మ్మ చెప్పిన మాట‌లు విని సీమ‌లో ప‌గ‌లు కాదు ప్రేమ కావాల‌ని బ‌య‌టికి వ‌చ్చేస్తాడు. సిటీకి వ‌చ్చేస్తాడు. ఆ ప్ర‌యాణంలోనే అర‌వింద‌(పూజాహెగ్డే)ను క‌లుస్తాడు. ఆమె కూడా ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల‌ను ఎలా అంత‌మొందించాల‌నే కోర్స్ చేస్తుంది. ఆమె స‌ల‌హాలతో వీర‌రాఘ‌వ ఏం చేసాడ‌నేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం:

త్రివిక్ర‌మ్ సినిమాల్లో ఏదో తెలియ‌ని మ్యాజిక్ ఉంటుంది. అది అజ్ఞాత‌వాసిలో పూర్తిగా మిస్ అయిపోయింది. దాంతో అభిమానులు కూడా చాలా ఫీల్ అయ్యారు. త్రివిక్ర‌మ్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా చూసేలా ఉంటాయ‌నే న‌మ్మకాన్ని అజ్ఞాత‌వాసి తుడిచేసింది. ఆ క‌సితోనే తొమ్మిది నెల‌ల్లోనే ఇప్పుడు అర‌వింద స‌మేత‌తో వ‌చ్చాడు త్రివిక్ర‌మ్. ఈ సారి మాత్రం అజ్ఞాత‌వాసిలో మిస్ అయిన మ‌సాలాల‌న్నీ ప‌క్కాగా ద‌ట్టించి తీసుకొచ్చాడు త్రివిక్ర‌మ్. ఫ‌స్టాఫ్ కాస్త స్లోగా అనిపించినా కూడా అక్క‌డ‌క్క‌డా త‌న మార్క్ ఛ‌మ‌క్కుల‌తో మ‌రిపించాడు. ఎన్టీఆర్, పూజాహెగ్డే ల‌వ్ స్టోరీ ప‌ర్లేదు. అయితే సునీల్ మాత్రం త‌న మార్క్ అందుకోలేదు. తొలి 20 నిమిషాల పూన‌కాలు తెప్పించాడు త్రివిక్ర‌మ్. అస‌లు ఇలా ఉంటుందా హీరో ఇంట్రో అనేలా ర‌చ్చ చేసాడు. అభిమానులు అయితే ష‌ర్టులు చించేసుకుని అర‌వ‌డం ఒక్క‌టే త‌క్కువ‌.

అంత‌గా డిజైన్ చేసాడు. ఆ త‌ర్వాత ఇంట‌ర్వెల్ వ‌ర‌కు ప‌డుతూ లేస్తూ క‌థ సాగుతుంది. మ‌ళ్లీ ఆ త‌ర్వాత ప్రీ ఇంట‌ర్వెల్ సీన్ తో లేస్తుంది. అక్క‌డ్నుంచి క్లైమాక్స్ వ‌ర‌కు కూడా ఎమోష‌న‌ల్ గా క‌థ‌ను న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. రొటీన్ క‌థ అయినా కూడా డీసెంట్ గా అనిపిస్తుంది. అభిమానుల‌కు రోమాలు నిక్క‌బొడుచుకునేలా మూడు ఫైట్ సీన్స్ డిజైన్ చేసాడు త్రివిక్ర‌మ్. సెకండాఫ్ లో వ‌చ్చే కాంప్ర‌మైజ్ ఎపిసోడ్ కూడా అద్భుతంగా ఉంది. అక్క‌డ మాట్లాడుతూనే ఎన్టీఆర్ ఫైట్ చేయ‌డం కొత్త‌గా అనిపిస్తుంది. సినిమా అంతా చూసిన త‌ర్వాత ఇది క‌దా అజ్ఞాతవాసిలో తాము మిస్ అయింది అంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ నిట్టూర్చిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇలా తీసినా అజ్ఞాత‌వాసి రికార్డులు తిర‌గ‌రాసేది క‌దా అంటున్నారు. తండ్రి చ‌నిపోయిన ఎపిసోడ్ చాలా ఎమోష‌న‌ల్ గా ఉంటుంద‌నుకున్నా పెద్ద‌గా అనిపించ‌లేదు. ఓవ‌రాల్ గా అర‌వింద స‌మేత క‌థ ఔట్ డేట్ అయినా స్క్రీన్ ప్లేతో మాయ చేసాడు.

న‌టీన‌టులు:

ఎన్టీఆర్ ఎప్ప‌ట్లాగే న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. త్రివిక్ర‌మ్ రాసుకున్న వీర‌రాఘ‌వ‌రెడ్డి పాత్ర‌కు ప్రాణం పోసాడు. గొడ‌వ‌లు ఆపాలి.. ఆపినోడే గొప్పోడు అనే పాత్ర‌కు త‌న న‌ట‌న‌తో నూటికి నూరు శాతం న్యాయం చేసాడు. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సీన్స్ లో ఎన్టీఆర్ న‌ట‌న మ‌రో స్థాయిలో ఉంది. అర‌వింద స‌మేత‌తో తాను ఎంత గొప్ప న‌టున్నో మ‌రోసారి నిరూపించుకున్నాడు ఎన్టీఆర్. ఇక పూజాహెగ్డే కూడా ఈ చిత్రంలో మంచి పాత్ర‌లో న‌టించింది. త‌న పేరుతోనే టైటిల్ కూడా పెట్టాడు త్రివిక్ర‌మ్. డ‌బ్బింగ్ కూడా బాగానే చెప్పుకుంది. పూజా చెల్లిగా ఇషారెబ్బా న‌ట‌న బాగుంది. చిన్న పాత్రే అయినా మెప్పించింది. ఇక చాలా ఏళ్ళ త‌ర్వాత సునీల్ ను పెద్ద సినిమాలో చూసి సంతోషించారు అభిమానులు. త‌న మార్క్ తో పాటు న‌ట‌న‌ను కూడా చూపించాడు. జ‌గ‌ప‌తిబాబు విల‌న్ గా క‌ర్క‌శంగా ఉన్నాడు. ఆయ‌న్ని చూస్తే నిజంగానే భ‌యంతో పాటు కోపం కూడా వ‌స్తుంది. నాగ‌బాబు, న‌వీన్ చంద్ర లాంటి వాళ్లు కూడా చాలా బాగా న‌టించారు.

టెక్నిక‌ల్ టీం:

థ‌మ‌న్ పాట‌లు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ఈ చిత్రానికి ఊహించిన పాట‌లు అయితే ఇవ్వ‌లేదు థ‌మ‌న్. అన‌గ‌న‌గా మాత్రం అదిరిపోయింది. అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాట‌ల లోపం క‌ప్పి పెట్టాడు. ముఖ్యంగా పెనివిటి సాంగ్ ఎమోష‌న‌ల్ గా బాగుంది. సినిమాటోగ్ర‌ఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ అక్క‌డ‌క్క‌డా త‌ప్పిస్తే ప‌ర్లేదు. మ‌రీ రెండు గంట‌ల 50 నిమిషాల కావ‌డంతో స్లో అయింది అక్క‌డ‌క్క‌డా. ఇక నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి. చివ‌ర‌గా త్రివిక్ర‌మ్ లో ముందు ఆ క‌సి క‌నిపించింది. ఒక్క సినిమాతోనే త‌న‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేస్తారా అనే క‌సితో అర‌వింద స‌మేత రాసుకున్నాడు త్రివిక్ర‌మ్. త‌న మార్క్ బాగానే చూపించుకున్నాడు. అయితే ఊహించినంత మాత్రం కాదు.

చివ‌ర‌గా: అర‌వింద స‌మేత‌.. త్రివిక్ర‌మ్ చెప్పిన ఫ్యాక్ష‌’నిజాలు‘..

రేటింగ్ - 3/5

More Related Stories