ఎన్టీఆర్ అక్కడికి వెళ్తున్నాడు..

కొన్ని రోజుల నుంచి ఫ్రీ టైమ్ లో ఉన్నాడు ఎన్టీఆర్. అరవింద సమేత షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాడు త్రివిక్రమ్. దాంతో తన బ్రాండ్స్ తో పాటు మరిన్ని పనులు కూడా చేసుకుంటున్నాడు జూనియర్. ఇక ఇప్పుడు మళ్లీ షూటింగ్ కు టైమ్ అయింది. ఆర్ఎఫ్సీలో రెండు వారాల షూట్ కు అంతా సిద్ధం చేసుకుంటున్నాడు త్రివిక్రమ్. అక్కడి నుంచి మరో పది రోజులు పొల్లాచ్చికి వెళ్లనున్నారు. పొల్లాచ్చి అంటే త్రివిక్రమ్ కు సెంటిమెంట్. సినిమా హిట్టైనా.. ఫ్లాపైనా అక్కడ కనీసం ఒక్క షెడ్యూల్ అయినా షూట్ చేస్తుంటాడు ఈ దర్శకుడు. ప్రతీ సినిమాలోనూ కేరళ అందాలను చూపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా దీనికి మినహాయింపు కాదు.
ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇషారెబ్బా మరో ముఖ్యపాత్రలో నటించబోతుంది. ఈమె ఎన్టీఆర్ మాజీ లవర్ గా నటించబోతుందని తెలుస్తుంది. దసరాకు విడుదల కానుంది అరవింద సమేత వీర రాఘవ. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా కూడా ఈ చిత్ర బిజినెస్ పై అది పెద్ద ప్రభావం చూపించినట్లు అనిపించట్లేదు. 100 కోట్ల వరకు ఈ చిత్రాన్ని అమ్మేస్తున్నారు. మొత్తానికి ఆర్ఎఫ్సీ రెండు వారాలు.. పొల్లాచ్చి 10 రోజుల షెడ్యూల్ తో సినిమా షూట్ దాదాపు 70 శాతం పూర్తి కానుంది. ఆ తర్వాత హైదరాబాద్ లోనే చిన్న షెడ్యూల్ ముగించుకుని పాటల కోసం ఫారెన్ వెళ్లనున్నారు చిత్రయూనిట్. మొత్తానికి చూడాలిక.. ఈ చిత్రంతో ఎన్టీఆర్ ఏం మ్యాజిక్ చేస్తాడో..?