English   

ఎన్టీఆర్ తో అశ్వినీద‌త్.. ముంచినోడే తేలుస్తాడా..?

Ashwini-Dutt-NTR

వై జ‌యంతి మూవీస్ కు మ‌ళ్లీ మంచి రోజులు వ‌చ్చేసాయి. మ‌హాన‌టి పుణ్య‌మా అని వాళ్లు మ‌ళ్లీ నిల‌దొక్కుకుంటున్నారు. త‌మ ఉనికి చాటుకున్నారు. ఈ చిత్రం వాళ్ల‌కు డ‌బ్బుల‌తో పాటు గౌర‌వాన్ని కూడా తీసుకొచ్చింది. హీరోలు.. హీరోయిన్లే కాదు.. ఇప్పుడు నిర్మాత‌లు కూడా రీ ఎంట్రీలు ఇస్తున్నారు. ఇండ‌స్ట్రీలో ఒక్క‌సారి న‌ష్ట‌పోతే ఇక ఆ నిర్మాత దివాళా తీసిన‌ట్లే అంటుంటారు. కానీ అశ్వినీదత్ మాత్రం అలా కాదు. త‌న‌కు కొన్ని లెక్క‌లున్నాయి. వాటి ప్ర‌కార‌మే ఇన్ని ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మ‌రోసారి త‌న స‌త్తా ఏంటో చూపించ‌డానికి వ‌స్తున్నాడు ఈ మెగా ప్రొడ్యూస‌ర్. అది కూడా సంచ‌ల‌న సినిమాల‌తో వ‌స్తున్నాడు. ఇండ‌స్ట్రీలో గ‌తం ఎప్పుడూ ఎవ‌రికీ గుర్తుండ‌దు. ఇక్క‌డ చ‌రిత్ర‌ల‌కు కాలం చెల్లిపోయింది. గ‌తంలో మేమింత చేసాం.. మేమంత చేసాం అంటే కుద‌ర‌దు. ఇప్పుడు నువ్వేంటి అనేది ఇక్క‌డ కావాలి. 

తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు అద్భుత‌మైన సినిమాలు చేసిన నిర్మాత‌ల్లో అశ్వినీద‌త్ ఒక‌రు. వై జ‌యంతి మూవీ బ్యాన‌ర్ పై ఇండ‌స్ట్రీ హిట్లు తీసాడు ఈ నిర్మాత‌. టాలీవుడ్ లోని టాప్ హీరోలంద‌రితోనూ సినిమాలు నిర్మించాడు అశ్వినీద‌త్. అయితే కొన్నేళ్ల కింద వ‌ర‌స‌గా ఫ్లాపులు త‌గ‌ల‌డంతో నిర్మాణానికి కాస్త బ్రేక్ ఇచ్చాడు ఈ నిర్మాత‌. ముఖ్యంగా శ‌క్తి సినిమాతో బాగా న‌ష్ట‌పోయిన అశ్వినీద‌త్.. ప్రొడ‌క్ష‌న్ కు దూరమ‌య్యారు. ఈ సినిమా వ‌చ్చి ఎనిమిదేళ్లు పూర్తైనా.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా చేయ‌లేదు అశ్వినీద‌త్. మ‌హాన‌టి వ‌చ్చినా అది పూర్తిగా ఆయ‌న కూతుళ్లే చూసుకున్నారు. ఇన్నేళ్ళ త‌ర్వాత అశ్వినీద‌త్ మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తున్నారు. ఈయ‌న వ‌ర‌స‌గా సినిమాలు నిర్మిస్తున్నారు. 

ఇప్ప‌టికే నాని-నాగార్జున కాంబినేష‌న్ లో మ‌ల్టీస్టార‌ర్ సినిమా షూటింగ్ జ‌రుపుకుటుంది. త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది ఈ చిత్రం. దాంతో పాటు మ‌హేశ్ బాబుతో ఓ సినిమా నిర్మించ‌బోతున్నారు. వంశీ పైడిప‌ల్లి సినిమాను దిల్ రాజుతో క‌లిసి నిర్మించ బోతున్నారు అశ్వినీద‌త్. ఈ నిర్మాత న‌ష్ట‌పోవ‌డంలో మ‌హేశ్ పాత్ర కూడా కొంత ఉంది. ఈయ‌న నిర్మించిన సైనికుడు డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఆ వెంట‌నే కంత్రి, శ‌క్తి రూపంలో మ‌రో రెండు షాకులు త‌గిలాయి. దాంతో నిర్మాణానికి బ్రేకిచ్చారు. అయితే ఇప్పుడు న‌ష్ట‌పోయిన హీరోల‌తో మ‌ళ్లీ సినిమాలు చేస్తున్నాడు ద‌త్. ఎన్టీఆర్ తోనూ ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు అనౌన్స్ చేసాడు అశ్వినీద‌త్. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టిస్తున్న త్రివిక్ర‌మ్, రాజ‌మౌళి త‌ర్వాత ద‌త్ సినిమా ఉండ‌బోతుంది. మొత్తానికి ఈ మెగా ప్రొడ్యూస‌ర్ రీ ఎంట్రీ ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories