English   

శ్రీనివాస కళ్యాణం పాటలు సూపర్ హిట్టు( ఆడయో రివ్యూ)

srinivasa kalyanam
2018-07-22 15:25:27

శ్రీనివాస కళ్యాణం కు హిట్టు కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కారణం.. ఈసినిమాలోని పాటలే. పాటలు హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే అనేది మనకు ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ.. దాన్ని కంటిన్యూ చేస్తే శ్రీనివాస కళ్యాణం ఖచ్చితంగా ఓ బెస్ట్ మూవీగా నిలుస్తుంది. శతమానం భవతి వంటి ఫ్యామిలీ ఎంటర్టైననర్ ను అందించిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు రూపొందించిన సినిమా ఇది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన శ్రీనివాస కళ్యాణం ఆడియో లాంచింగ్ ఈ సాయంత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాలోని అన్ని పాటలను(జ్యూక్ బాక్స్) యూట్యూబ్ లో విడుదల చేశారు. ఏపాటకాపాట ఓ సూపర్ హిట్ లా ఉంది. ఏదీ మరోలా లేదు. సింగర్స్ విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు మిక్కీ జే మేయర్. ఆరు పాటల్లో ఐదు పాటలను శ్రీమణి రాయగా ‘మొదలవుదాం’ అనే పాట మాత్రం రామజోగయ్య శాస్త్రి రాశారు. అన్నిటికంటే హైలెట్ టైటిల్ సాంగ్ వచ్చే ‘కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం’అనే పాట. చాలాకాలం తర్వాత మరోసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటిది. సోలోగా సాగే ఈ పాటలో ఆయన తనకే సొంతమైన మాధుర్యాన్ని మరోసారి నింపేశారు. ఈ పాట ఇకపై ప్రతి పెళ్లిపందిరిలో ఆనవాయితీగా వినిపించేంతగా ముద్ర వేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక అందమైన పదాలు పొదిగి శ్రీమణి చాలా బాగా రాశాడీ పాట. 

ఇక హీరో క్యారెక్టర్ ను తెలియజేసేలా ఎక్కడ నువ్వుంటే అక్కడ ఆనందాలే పాట ఆల్బమ్ లో రెండోది. ఇది కూడా శ్రీమణి రాసిందే. ధనుంజయ్ పాడాడు. హీరో పాట కదా అనవసరమైన బిల్డప్పులు లేకుండా చాలా హాయిగా సింపుల్ గా సాగుతుందీ పాట. పైగా క్యాచీ ట్యూన్ కూడా కావడంతో యూత్ కుబాగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి.

మూడో పాట ఇతడేనా ఇతడేనా నా జత అంటున్నదీ.. అంటూ సాగుతుంది. ఇది కూడా శ్రీమణి రాశాడు. శ్రేయా ఘోషల్ సాహిత్యానికి మరోసారి తనదైన శైలిలో ప్రాణం పోసింది. ఇది హీరోను చూశాక హీరోయిన్ పాడుకునే పాటలా ఉంది.. అందుకు తగ్గట్టుగానే అద్భుతమైన ట్యూన్ ఉంది. అమ్మాయిల కలల రాకుమారుడి కోసం ఇక పై ఇదే పాడుకుంటారేమో.. 

మొదలవుదాం తొలిప్రేమగా.. అపుడో ఇపుడో ఎపుడైతేనే కొత్తగా అంటూ గిలిగింతలు పెట్టే సాహిత్యంతో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ఆల్బమ్ లో నాలుగోది. సునిత, అనురాగ్ కులకర్ణి సూపర్ గా పాడేశారు. ఇది కూడా సింపుల్ ఆర్కెస్ట్రైజేషన్ తో సాగే పాటే. సునిత గొంత కొత్తగా ఉంటే అనురాగ్ గాత్రం ఆకట్టుకునేలా ఉంది. 

ఎంత ఫ్యామిలీ సినిమా అయినా హీరో, హీరోయిన్ల మధ్య డ్యూయొట్ లేకుంటే ఎట్టా అనుకున్నారేమో సమ్ థింగ్  సమ్ థింగ్ రా కొత్తగా ఏదో చేద్దాం రా అంటూ శ్రీ మణి రాసిన ఓ హుషారైన గీతం వినగానే ఆకట్టుకుంటోంది. అనురాగ్ కులకర్ణితో పాటు శ్రావణ భార్గవి పాడిన ఈ పాటలో రాశిఖన్నా కూడా గొంతు కలపడం విశేషం. 

ఇక కాస్త ఫోక్ ను మిక్స్ చేసుకుని సునిత గాత్రంలో చిత్రంగా వినిపిస్తోన్న పాట వినవమ్మ తూరుపు చుక్కా.. సునిత సోలోగా పాడిన పాట. కాకపోతే తన గాత్రానికి మరింత అందం తెస్తూ కోరస్ కూడా అద్భుతంగా కుదిరింది. దీని తర్వాత మరోసారి టైటిల్ సాంగ్ వినిపిస్తుంది. దీనికి క్లైమాక్స్ వెర్షన్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. సో.. ఈపాటతో కథ సుఖాంతం అవుతుందని అనుకోవచ్చు. 

మొత్తంగా మిక్కీ జే మేయర్ మార్క్ పాటలని వినగానే అర్థమౌతుంది. తన కెరీర్ లో ఇలాంటి బెస్ట్ ఆల్బమ్స్ చాలానే ఇచ్చి ఉన్న మిక్కీ మరో బ్యూటీఫుల్ ఆల్బమ్ తో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాడు. ఈ పాటలు సినిమాకు మరిన్ని  టికెట్లు తెగడానికి ఉపయోగపడతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదేమైనా నితిన్ కు శ్రీనివాస కళ్యాణం ఓ మెమరబుల్ మూవీగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. 

More Related Stories