English   

తెనాలి రామకృష్ణ BA BL రివ్యూ

Tenali Ramakrishna BA BL
2019-11-15 16:54:52

ఒకప్పుడు కామెడీ సినిమాలు చేసి ఇప్పుడు ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్న దర్శకుడు నాగేశ్వర రెడ్డి.. ఫామ్ లో లేని సందీప్ కిషన్ తో కలిసి ఇప్పుడు తెనాలి రామకృష్ణ అంటూ వచ్చారు. ఈ చిత్రంపై ముందు నుంచి కూడా పెద్దగా అంచనాలు లేకపోయినా కూడా కామెడీ వర్కవుట్ అవుతుందనే నమ్మకం మాత్రం కనిపించింది. మరి ఈ చిత్రంతో సందీప్ ఎంతవరకు ఆకట్టుకున్నాడు..?

కథ:

తెనాలి రామకృష్ణ (సందీప్‌ కిషన్‌) కేసుల్లేని కుర్ర లాయరు. సింపుల్ గా చెప్పాలంటే చెట్టు కింద ప్లీడర్ టైప్ అన్నమాట. ఒక్క కేస్ కూడా రాక.. వేచి చూస్తుంటాడు. ఎలాంటి కేసులు రాకపోవడంతో అదే కోర్టులో కాంప్రమైజ్ చేసుకుంటూ బతికేస్తుంటాడు. అదే కోర్టులో మరో పెద్ద లాయర్ (మురళీ శర్మ) ఉంటాడు. ఆయన కర్నూల్ జిల్లాలోనే పేరు మోసిన బిజినెస్ ఉమెన్ వరలక్ష్మీ (వరలక్ష్మీ శరత్ కుమార్) కేసు వాదిస్తుంటాడు. ఆమె ఓ హత్య కేసులో ఇరుక్కుటుంది. అందులోంచి తెనాలి రామకృష్ణ బయటికి తీసుకొస్తాడు. కానీ ఆ తర్వాత అసలు నిజం బయటపడుతుంది.. తాను తీసుకొచ్చింది మంచి మినిషిని కాదు.. వరలక్ష్మీ నిజమైన నేరస్థురాలు అని.. అప్పుడు ఈ తెనాలి ఏం చేస్తాడు.. అసలు ఆమె కథ ఎలా ముగిస్తాడు అనేది అసలు కథ..

కథనం:

సందీప్ కిషన్ రూట్ ఒకలా ఉంటుంది.. నాగేశ్వర రెడ్డి రూట్ మరోలా ఉంటుంది. కానీ ఈ ఇద్దరూ కలిసి కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చారు. ఎంటర్ టైనర్ అని పేరైతే పెట్టుకున్నారు కానీ అది పెద్దగా వర్కవుట్ అయితే కాలేదు. ఎక్కడో చూసినట్లుగానే ప్రతీ సీన్ రాసుకున్నాడు ఈ దర్శకుడు. దానికితోడు డబుల్ మీనింగ్ డైలాగులు కూడా బోనస్. తన స్థాయి తగ్గించుకుని మరీ సందీప్ కిషన్ కూడా కొన్ని సీన్స్ చేసాడు. హన్సిక అయితే ఎందుకు వస్తుందో.. ఎందుకు వెళ్తుందో తెలియని పరిస్థితి. తెనాలి రామకృష్ణ.. ఈ పేరు వినగానే మనకు పెదవులపై చిరునవ్వు వస్తుంది.. ఇప్పుడు సందీప్ కిషన్ కూడా ఇలాగే నవ్వించాలని అదే టైటిల్ తో వచ్చాడు.. హిట్ కొట్టడమే మర్చిపోయిన సందీప్.. మరోసారి రొటీన్ కామెడీ సినిమాతోనే వచ్చాడు.. ఒకప్పుడు స్టాండర్డ్ కామెడీ సినిమాలు అందించిన నాగేశ్వర్ రెడ్డి.. ఎందుకో ఇప్పుడు పోటీ తట్టుకోలేకపోతున్నాడు అనిపించింది. అప్పట్లో పేలినట్లు ఇప్పుడు ఆయన కామెడీ సీక్వెన్స్ లు నవ్వించడం లేదు.. తెనాలి రామకృష్ణ కూడా దీనికి మినహాయింపు కాదు. అక్కడక్కడ కాసిన్ని కామెడీ సీన్లు మినహాయిస్తే.. ఈ సినిమాలో చెప్పుకునే అంత పెద్ద కథ కానీ.. కామెడీ సన్నివేశాలు కానీ కనిపించలేదు. ఫస్టాఫ్ అంతా సందీప్ కిషన్ క్యారెక్టర్ చెట్టు కింద ప్లీడర్ టైప్ లో ఉంటుంది.. చిన్న ట్విస్ట్ ఇచ్చి ఇంటర్వెల్ మొదలుపెట్టిన దర్శకుడు.. అప్పటికే కథ మొత్తం చెప్పేయడంతో స్క్రీన్ ప్లే లో వెనుకబడి పోయాడు అనిపించింది. సెకండాఫ్ వెన్నెల కిషోర్ కామెడీ సన్నివేశాలు పర్లేదు.. సప్తగిరి కూడా బాగానే నవ్వించాడు. కుర్ర న్యాయవాది పాత్రలో సందీప్ కిషన్ కాస్త కొత్తగా కనిపించాడు. వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఓవరాల్ గా తెనాలి రామకృష్ణ యావరేజ్ రొటీన్ కామెడీ. కొన్ని కామెడీ సీన్స్ అయితే మరీ విసుగు తెప్పించాయి.

నటీనటులు:

సందీప్ కిషన్ మరోసారి ఆకట్టుకున్నాడు కానీ పెద్దగా ఈ పాత్ర తనకు వర్కవుట్ అవ్వలేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో అతి కనిపించింది. ఇక హన్సిక పాత్ర ఎందుకు ఉందో కూడా క్లారిటీ లేదు. కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయిపోయిన పాత్ర ఇది. మురళీ శర్మ ఉన్నంతలో కాస్త బెటర్. కానీ ఆయనతో కూడా డబుల్ మీనింగ్ కామెడీ చేయించాడు దర్శకుడు. చమ్మక్ చంద్ర, సప్తగిరి, వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్స్ ఉన్నా కూడా ఎక్కడో ఓ చోట కానీ నవ్వు రాదు. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో బాగానే ఆకట్టుకుంది. మిగిలిన వాళ్లంతా జస్ట్ ఓకే..

టెక్నికల్ టీం:

ఒకప్పుడు జి నాగేశ్వర్ రెడ్డి దర్శకుడు అంటే సినిమాలో కామెడీ ఉంటుంది కాస్త నవ్వుకోవచ్చు అనే గ్యారెంటీ ఉండేది. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. తెనాలి రామకృష్ణతో ఆ నమ్మకం కూడా మరింత సన్నగిల్లింది. తెలిసిన కథ.. మరింత తెలిసిన స్క్రీన్ ప్లేతో సినిమాను పూర్తిగా ముంచేసాడు దర్శకుడు నాగేశ్వర రెడ్డి. ఇంట్రస్టింగ్‌గా మొదలుపెట్టినా ఆ తర్వాత పూర్తిగా గాడితప్పాడు. సాయికార్తిక్ పాటలు ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా అనిపించలేదు.

చివరగా: తెనాలి రామకృష్ణ.. పేరులో ఉన్న కామెడీ సినిమాలో లేదు..

రేటింగ్: 2/5

More Related Stories