English   

బాహుబ‌లి 2 మూవీ రివ్యూ రేటింగ్

Baahubali2-Movie-Review-Rating
2017-04-28 02:24:34

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు..? గ‌త రెండేళ్లుగా ఇండియాలో మోస్ట్ వాంటెడ్ ప్ర‌శ్న ఇది. ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలిసిపోయింది. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప చంపిన కార‌ణ‌మేంటి..? అస‌లు ఎందుకు అత‌డు రాజ‌ద్రోహం చేయాల్సి వ‌చ్చింది..? భ‌ల్లాలుడు చేసిన రాక్ష‌సాలేంటి..? మ‌ళ్లీ మ‌హేంద్ర బాహుబ‌లి మాహిష్మ‌తిని ఎలా ద‌క్కించుకున్నాడు..? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలుసుకోవాలంటే.. రివ్యూలోకి వెళ్లాల్సిందే..!

క‌థ‌: బాహుబ‌లి ఎక్క‌డైతే ముగిసిందో అక్క‌డ్నుంచే పార్ట్ 2 క‌థ మొద‌ల‌వుతుంది. మ‌హారాజుగా ప‌ట్టాభిషిక్తుడు కావ‌డానికి ముందే దేశాట‌న‌కు వెళ్లాలంటూ బాహుబ‌లిని శివ‌గామి ఆదేశిస్తుంది. అమ్మ ఆజ్క్ష శిర‌సావ‌హిస్తూ దేశాలు తిరిగేస్తుంటాడు బాహుబ‌లి. అలా కుంత‌ల రాజ్యానికి వెళ్లి అక్క‌డ దేవ‌సేన‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అక్క‌డే ఆమె నివాసంలోనే ఉంటాడు. అదే స‌మ‌యంలో ఇక్క‌డ మాహిష్మ‌తిలో భ‌ల్లాలుడు, బిజ్జ‌ల‌దేవుడు క‌లిసి ప‌న్నాగాలు ప‌న్నుతారు. ఆ ప‌న్నాగంలో దేవ‌సేన‌తో పాటు బాహుబ‌లి, శివ‌గామి కూడా ప‌డిపోతారు. అక్క‌డ్నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది..! అమ‌రేంద్ర బాహుబ‌లికి జ‌రిగిన అన్యాయ‌మేంటి.. అత‌న్ని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాల్సి వ‌చ్చింద‌నేది మిగిలిన క‌థ‌..!

క‌థ‌నం : చంద‌మామ క‌థ‌లా ఈ సినిమాను తెర‌కెక్కించాడు రాజ‌మౌళి. ఎక్క‌డ క‌న్ఫ్యూజ‌న్స్ లేకుండా ఐదేళ్ల పాటు తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు స్క్రీన్ పై ప్ర‌జెంట్ చేసాడు ద‌ర్శ‌క‌ధీరుడు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఎలా వాడుకోవాలో.. ఇండియాలో ఉన్న ద‌ర్శ‌కులంద‌రికీ ఓ డిక్ష‌న‌రీలా బాహుబ‌లిని తీర్చిదిద్దాడు జ‌క్క‌న్న‌. బాహుబ‌లి 2 క‌థ మొద‌లైన ఐదు నిమిషాల‌కే విజువ‌ల్ ట్రీట్ ఎలా ఉండ‌బోతుందో ప్ర‌భాస్ ఓపెనింగ్ సీన్ తోనే ప్రేక్ష‌కుల‌కు చూపించేసాడు. ఆ త‌ర్వాత కామెడీ సీన్లు అంటూ కాసేపు టైమ్ పాస్ చేసిన‌ట్లు క‌నిపించినా.. ఒక్క‌సారి క‌థ‌లో వెళ్ళిన త‌ర్వాత ఎక్క‌డా ఊపు త‌గ్గ‌లేదు. ఓ సీన్ చూసి అబ్బో అనుకునేలోపు మ‌రో సీన్ వ‌చ్చి అబ్బా అనిపిస్తుంది. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు క‌థ ఎక్క‌డా ఆగ‌కుండా వెళ్లిపోతుంది. బాహుబ‌లి ఇంట‌ర్వెల్ పార్ట్ మాదిరే.. ఇక్క‌డ కూడా బాహుబ‌లి అంటూ రాజ్య ప్ర‌జ‌లు అరుపుల‌తోనే విశ్రాంతి వేసాడు రాజ‌మౌళి. అది ద‌ర్శ‌కుడిగా త‌నపై ఉన్న న‌మ్మ‌కానికి.. క‌థ‌పై త‌న‌కు ఉన్న ప‌ట్టుకు నిద‌ర్శ‌నం.

ఇక సెకండాఫ్ లోనూ క‌థ ఎక్క‌డా ప‌ట్టు జార‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. అయితే ముందే తెలిసిపోయే స‌న్నివేశాలు.. స్క్రీన్ ప్లేను విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మాయ చేయ‌డం లాంటివి కాస్త నిరాశ ప‌రుస్తాయి. ముఖ్యంగా రెండేళ్లుగా ఇండియాను ఊపేసిన క‌ట్ట‌ప్ప ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని చాలా ఈజీగా తేల్చేసాడు రాజ‌మౌళి. ఆ సీన్ రావ‌డానికి అర‌గంట ముందే స‌మాధానం తెలిసిపోతుంది. ఇది స్క్రీన్ ప్లే లోపం అయి ఉండొచ్చు గానీ ఆ సీన్ వ‌చ్చిన‌పుడు మాత్రం ప్రేక్ష‌కుల‌కు రోమాలు నిక్క‌బొడుచుకునేలా తెర‌కెక్కించాడు రాజ‌మౌళి. ఒక్క‌సారి బాహుబ‌లి చ‌నిపోయిన త‌ర్వాత‌.. మిగిలిన పార్ట్ అంతా సుల‌భంగా ఊహించుకోవ‌చ్చు. బాహుబ‌లి క్లైమాక్స్ ను న‌భూతో అన్న‌ట్లు తెర‌కెక్కించిన ద‌ర్శ‌క‌ధీరుడు.. ఈ సారి మాత్రం కాస్త ప‌ట్టు జారాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్ పై చూడ‌న‌టువంటి విజువ‌ల్ ఫీస్ట్ తో సినిమాను నింపేయడంతో ప్రేక్ష‌కుడికి ఈ ప‌ట్టు జార‌డంపై పెద్ద‌గా ప‌ట్టు కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. తెర‌పై క‌నిపిస్తోన్న మాయ‌ను అలా చూస్తూ ఉండిపోవ‌డం త‌ప్ప‌.

న‌టీన‌టులు : ప‌్ర‌భాస్, రానా, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్ త‌దిత‌రులు. తొలి భాగంలో శివుడిగా అల‌రించిన ప్ర‌భాస్.. ఇక్క‌డ అమ‌రేంద్ర బాహుబ‌లిగా విశ్వ‌రూప‌మే చూపించాడు. ప్ర‌భాస్ లేక‌పోతే బాహుబ‌లి లేదు అని రాజ‌మౌళి ఎందుకు అన్నాడో ఈ సినిమా చూస్తే అర్థ‌మైపోతుంది. తండ్రీ కొడుకులుగా రెండు పాత్ర‌ల్లోనూ అద‌ర‌గొట్టాడు ప్ర‌భాస్. ముఖ్యంగా క‌ట్ట‌ప్ప త‌న‌ను చంపే సీన్ లో ప్ర‌భాస్ అభిన‌యం పీక్స్ కు వెళ్లిపోతుంది. ఇక సినిమా మొత్తం క‌ట్ట‌ప్ప‌తో వ‌చ్చే ప్ర‌తీ సీన్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. ప్ర‌భాస్ త‌ర్వాత అనుష్క బాహుబ‌లి 2 లో కెరీర్ లో ఎప్ప‌టికీ నిలిచిపోయే పాత్ర చేసింది. తొలి పార్ట్ లో త‌మ హీరోయిన్ పాత్ర కొంచెమే ఉంద‌ని ఫీలైన ఆమె అభిమానులు పార్ట్ 2తో పండ‌గ చేసుకోవ‌చ్చు.

క‌ట్ట‌ప్ప‌గా స‌త్య‌రాజ్ న‌ట‌న తొలి భాగంతో పోలిస్తే వంద రెట్లు ఎక్కువంటే.. సినిమాలో ఆయ‌న పాత్ర‌కు ఉన్న ప్రాధాన్య‌త ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. రానా కూడా విల‌నిజాన్ని అద్భుతంగా పండించాడు. అయితే తొలి భాగంతో పోలిస్తే రానాకు ఇక్క‌డ స్క్రీన్ స్పేస్ త‌క్కువ‌. అయితే ఉన్న అన్ని సీన్ల‌లో రానా అద‌ర‌గొట్టాడు. ముఖ్యంగా బాహుబ‌లి సీన్ లో త‌న‌లోని రాక్ష‌సున్ని రానా బ‌య‌టికి తెచ్చిన స‌న్నివేశం మాత్రం సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్తుంది. శివ‌గామిగా ర‌మ్య‌కృష్ణ గురించి కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు. కొడుకునే చంపమ‌ని క‌ట్ట‌ప్ప‌కు చెప్పిన‌పుడు శివ‌గామిగా త‌న‌లో తాను ప‌డిన అంత‌ర్మ‌థ‌నం ఆమెలోని న‌టి ఏ స్థాయిలో ఉందో చూపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు న‌ర‌సింహాలో నీలాంబ‌రి పాత్రే అనుకుంటే.. శివ‌గామిగా దాన్ని మ‌ర్చిపోయేలా చేసింది ర‌మ్య‌కృష్ణ‌. నాజ‌ర్ బాగా చేసాడు. త‌మ‌న్నా క‌నిపించింది ఒక్క సీన్ లోనే. ఆమె గురించి చెప్ప‌డానికేం లేదు.

టెక్నిక‌ల్ టీం : సంగీతం అందించిన కీర‌వాణి, సినిమాటోగ్ర‌ఫీ సెంథిల్ కుమార్, విజువ‌ల్ ఎఫెక్ట్స్ క‌మల్ క‌ణ్ణ‌ణ్, క‌థ‌: విజ‌యేంద్ర‌ప్ర‌సాద్, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: ఎస్ఎస్ రాజ‌మౌళిబాహుబ‌లి 2 గురించి ముందుగా చెప్పుకోవాలంటే కీర‌వాణి గురించి చెప్పాలి. ఆయ‌న బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం. తొలి భాగంలోనే అద్భుత‌మైన నేప‌థ్య సంగీతం అందించిన కీర‌వాణి.. పార్ట్ 2లో త‌న‌లోని ప్రావీణ్య‌త‌ను మొత్తం బ‌య‌టికి తీసాడు. త‌న అనుభ‌వాన్ని మొత్తం త‌మ్ముడి కోసం ప‌నంగా పెట్టాడనే చెప్పాలి. ఇక సెంథిల్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. రాజ‌మౌళి త‌ర్వాత మ‌రో క‌న్ను సెంథిల్. ఆయ‌న కెమెరా క‌న్ను ఇప్ప‌టివ‌ర‌కు మ‌న క‌న్నులు చూడ‌ని అద్భుతాల్ని ఆవిష్క‌రించింది. క‌మల్ క‌ణ్ణ‌ణ్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ సినిమా రేంజ్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాయి. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ కూడా అద్భుతంగా అల్లాడు. చిన్న‌పుడు చ‌దివిన చంద‌మామ క‌థ‌ల్ని కంటికి క‌ట్టిన‌ట్లు చూపించాడు సినిమాలో రాజ‌మౌళి.

ఇక ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి గురించి చెప్పాలి. ఈయ‌న‌లో ఉన్న గొప్ప ల‌క్ష‌ణం.. త‌న త‌ప్పుల‌ను అందంగా క‌ప్పి పుచ్చ‌డం. సినిమా క‌థ ఇదేనంటూ రెండేళ్లుగా నెట్ లో హ‌ల్ చల్ చేస్తోన్నా.. ఏ రోజు రాజ‌మౌళి భ‌య‌ప‌డ‌లేదు. సినిమా లీకైంద‌నే వార్త‌లొచ్చినా చ‌లించ‌లేదు. ఎందుకంటే త‌న‌పై త‌న‌కు ఉన్న న‌మ్మ‌కం. అదే సినిమాను ఈ స్థాయిలో నిల‌బెట్టింది. ఆ చిన్న సీనే క‌దా అని.. సినిమాలో ఒక్క స‌న్నివేశాన్ని కూడా రాజ‌మౌళి త‌క్కువ‌గా చూపించ‌లేదు. అది సుబ్బ‌రాజ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన సీన్ అయినా.. బిజ్జ‌ల‌దేవుడి క‌టిల‌త్వాన్ని బ‌య‌ట పెట్టే సీన్ అయినా.. ఏదైనా ప్ర‌భాస్ పై ఎంత శ్ర‌ద్ధ చూపించాడో మిగిలిన పాత్ర‌ల‌పై అదే స్థాయి దృష్టి పెట్టాడు. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వం గురించి ఇంత‌కు ముందు తీసిన సినిమాల గురించి విశ్లేషిస్తే బాగుంటుందేమో గానీ.. బాహుబ‌లి 2 తీసిన త‌ర్వాత ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం గురించి మాట్లాడడానికేం లేదు. ఒక్క‌టి మాత్రం నిజం.. ఈ సినిమా చూసిన త‌ర్వాత బాలీవుడ్ ద‌ర్శ‌కులు సైతం సాహో రాజమౌళి అంటూ ఆయ‌న ముందు మోక‌రిల్లాల్సిందే..! తెలుగు సినిమా స్థాయిని ఆ స్థాయిలో నిల‌బెట్టాడు జ‌క్క‌న్న‌. ఆయ‌న ఐదేళ్ల క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ఈ సినిమా.

చివ‌ర‌గా : క‌థ గురించి.. లాజిక్ గురించి ఆలోచించ‌కుండా ఓ విజువల్ వండ‌ర్ ను ఎంజాయ్ చేయాలి అనుకునే ప్ర‌తీ ప్రేక్ష‌కుడికి బాహుబ‌లి 2 ఓ అద్భుతం. నిస్సందేహంగా ఈ సినిమా తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే కాదు.. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఎప్ప‌టికీ నిలిచిపోయే ఓ గొప్ప చిత్రరాజం.

బాహుబ‌లి 2 మూవీ రివ్యూ రేటింగ్: 3.5/5

More Related Stories