English   

 అస్తమించిన కళాకిరణం

Balantrapu-Rajanikanta
2018-04-22 09:51:41

తెలుగు సినిమాతొలితరం సంగీత దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బాలాంత్రపు రజినీకాంతరావు కన్నుమూశారు. ఆయన సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, రేడియో సంచాలకులు.. కళారంగంలోని ఎన్నో విభాగాల్లో అద్వితీయ ప్రతిభ చూపిన ఆయన వయసు 98యేళ్లు. 

బాలాంత్రపు రజనీకాంత రావు బహుముఖ ప్రఙ్ఞాశాలి. గాయకుడు, వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు. ఆకాశవాణి కేంద్రంలో స్వరకర్తగా, గీతరచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించి రేడియో శ్రోతలను అలరించారు. ఆకాశవాణిని జనరంజకం చేసిన పలువురు కళాకారుల్లో రజనీకాంతరావు ముఖ్యులు.

'రజని' గా పిలవబడే రజనీకాంతారావు 1920 జనవరి 29న నిడదవోలులో జన్మించారు. జంట కవులైన వేంకట పార్వతీశ కవులలో ఒకరైన "కవిరాజహంస" బాలాంత్రపు వెంకటరావుగారి కుమారులు. బాలాంత్రపు నళినీ కాంతారావు వీరి అగ్రజులు. వీరి తండ్రి ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల సంస్థాపక, నిర్వాహకులు. తల్లి వెంకటరమణమ్మ కూడా గొప్ప సాహితీ సంస్కారం కల వ్యక్తి. ఇంటిలోని సాహితీ వాతావరణానికి తోడుగా తండ్రి నడిపే గ్రంథమాలకు వస్తూ పోతూ వుండే టేకుమళ్ళ రాజగోపాలరావు, తెలికచర్ల వెంకటరత్నం, చిలుకూరి నారాయణరావు, గంటి జోగి సోమయాజి వంటి పండితులతో కళకళలాడుతుండేది. 

పిఠాపురంలో పెరిగారు. బంధువైన పులగుర్త లక్ష్మీనరసమాంబ దగ్గర భక్తిసంగీతం, మేనమామ దుగ్గిరాల పల్లంరాజు దగ్గర శాస్త్రీయసంగీతం నేర్చుకున్నారు. కాకినాడలో పి.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూ శాస్త్రీయసంగీతం నేర్చుకున్నారు. రజని 1937-1940 వరకు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ (ఆంధ్రా యూనివర్సిటీ) లో ఎం.ఏ. తెలుగు చదివారు. పింగళి లక్ష్మీకాంతం గారు వీరి గురువులు. దేవులపల్లివారు ఆత్మీయ మిత్రులు. 1941లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జెక్యుటివ్ గా చేరారు. 1966లో అసిస్టెంట్ డైరక్టరుగా పదోన్నతిపై పశ్చిమ బెంగాల్ లోని కర్సియాంగ్ స్టేషను కెళ్ళారు. కర్సియాంగ్ నుండి ఢిల్లీలోని ట్రాన్స్క్రిప్షన్ సర్విసులో చేరారు. 1970లో స్టేషను డైరక్టరై అహమ్మదాబాదు వెళ్ళారు. 1971 నుండి 76 వరకు విజయవాడ కేంద్రం డైరక్టరు. 76 నుండి 78 జనవరి వరకు బెంగుళూరు కేంద్ర డైరక్టరుగా పనిచేసి జనవరి 31న రిటైరయ్యారు. 1988 నుండి 90 వరకు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో గౌరవాచార్యులుగా పనిచేశారు. 1979 నుండి 82 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర కళాపీఠం డైరక్టరుగా వ్యవహరించారు. ఆకాశవాణి, దూరదర్శన్ లకు ఎమిరిటస్ ప్రొడ్యూసర్ గా 1982 నుండి 85 వరకు పనిచేశారు.

రజని తెలుగు లలిత సంగీత వికాసానికి ఎనలేని దోహదం చేశారు. ఎన్నో గేయ నాటకాలు, సంగీత రూపకాలు రజని రసమధురంగా రచించారు. రేడియో కోసం రజని వందలాది గీతాలను రచించారు. ఇతర రచయితల గీతాలకి కూడా స్వరరచన చేశారు. బాలలకోసం జేజిమామయ్య పాటలు రచించారు.స్వరకర్తగా, గేయకవిగా, సినీ గాయకుడుగా రజని ప్రసిద్ధుడు. భానుమతి, రజని కలిసి పాడిన పాటలు చిత్రసీమలో గణన కెక్కాయి. స్వర్గసీమ, గృహప్రవేశం వంటి చిత్రాల్లో పాటలు పాడారు.  90యేళ్ల వయసులోనూ కళారంగంలో అనేక విషయాలను గురించి తెలియజేస్తూ ఉత్సాహంగా ఉండేవారు. తెలుగు సాహిత్యంలో ఎందరో ఉద్ధండులతో ప్రత్యక్ష అనుబంధం కలిగిన బాలాంత్రపు రజినీకాంతరావు గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు 98యేళ్లు. ఇవాళ ఉదయం ఆయన హఠాత్తుగా కన్నుమూసి.. తెలుగు సంగీతాభిమానుల్ని శోకంసంద్రంలో ముంచివేశారు. బాలాంత్రపు మరణంతో తెలుగు కళ ఓ శకాన్ని కోల్పోయిందనే చెప్పాలి. 

More Related Stories